• facebook
  • whatsapp
  • telegram

దేశీయ జలరవాణా ఊపందుకుంటుందా?

బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతున్న తరుణంలో రవాణా వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. రహదారి ప్రమాదాలూ లెక్కకు మిక్కిలిగా ప్రాణాల్ని తోడేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దేశీయ జల రవాణా (ఇన్‌లాండ్‌ వెజల్స్‌) బిల్లు-2021కు పార్లమెంటు ఇటీవల ఆమోదం తెలిపింది. దేశీయ జలమార్గాలు, నౌకాయానానికి సంబంధించి వేర్వేరు చట్టాలు, నిబంధనల్లో ఏకరూపత తేవడమే దీని ప్రధాన ఉద్దేశం. వందేళ్ల క్రితం 1917లో బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చిన భారత జలరవాణా చట్టం స్థానంలో ఇది అమలవుతుంది. అంతర్గత జల రవాణాలో భద్రతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ఇది పెంచుతుందని, చౌక, సురక్షిత సరకు రవాణాను ప్రోత్సహిస్తుందని- కేంద్రం పేర్కొంటోంది. 

తాజా శాసన నిబంధనల ప్రకారం ఓడలు, తెరచాప పడవలు, సరకు రవాణా నావలు వంటి యాంత్రిక నౌకల వర్గీకరణ, రూపకల్పన, నిర్మాణం, సిబ్బంది వసతి వంటి వాటికి సంబంధించిన నిర్ణయాలు ఇకపై కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతాయి. నౌకలో ఆయా విధులకు ఎంతమంది సిబ్బందిని నియమించాలి, వారి విద్యార్హతలు, శిక్షణ, పరీక్షలు, శారీరక దృఢత్వం వంటి వాటిని కేంద్రం నిర్దేశిస్తుంది. జలాల్లోకి ఎలాంటి కాలుష్యకారకాలను వదలకూడదని ఆంక్షలు విధిస్తుంది. రాష్ట్రప్రభుత్వాలు ఆ మేరకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తాయి. వీటిని అతిక్రమిస్తే నౌకలకు జరిమానా విధిస్తారు. నౌకల నమోదు, సిబ్బంది వివరాలు, జారీచేసిన ధ్రువీకరణలతో కేంద్రం ఎలెక్ట్రానిక్‌ రూపంలో కేంద్రీకృత సమాచార వ్యవస్థను నిర్వహిస్తుంది. దేశీయ నౌకాయాన అభివృద్ధి నిధిని సైతం ఏర్పాటు చేస్తారు. దీన్ని రాష్ట్రాలు సమకూరుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించే రిజిస్ట్రార్‌ వద్ద నౌకల వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ ధ్రువీకరణ దేశమంతటా చెల్లుబాటవుతుంది. నావలకు బీమాసైతం చేయించాలి. దీని వల్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. దీని వల్ల రానున్న పదేళ్లలో కోటి ఉద్యోగాలు వస్తాయని, 40 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని విశ్లేషిస్తున్నారు. జల రవాణాను ప్రోత్సహిస్తే రేవుల నిర్మాణం, పూడికతీత, సరకులు నింపడం, దించడం, నిల్వ సదుపాయాలు, పర్యవేక్షణ, మరమ్మతులు వంటి వాటిలో ఉపాధి దొరుకుతుంది. కానీ, ఈ బిల్లు తమ హక్కుల్ని లాగేసుకుంటోందని ఆయా రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయి.

జాతీయ జలమార్గాల చట్టం-2016 దేశంలో 111 జాతీయ జల మార్గాలను (ఎన్‌డబ్ల్యూ) గుర్తించింది. ఇవి తూర్పు, పశ్చిమ, దక్షిణ, మధ్య భారత ప్రాంతాల్లో, 24 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 15 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 138 నదీ వ్యవస్థలు ఇందులో భాగం. జాతీయ అంతర్గత జలమార్గ ప్రాధికార సంస్థ ఎన్‌డబ్ల్యూల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ చూస్తుంది. ఎన్‌డబ్ల్యూ-4లో కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన మార్గాలున్నాయి. ప్రస్తుతం సరకు, ప్యాసింజర్‌ రవాణాకు అనుకూలంగా గుర్తించిన 23 జాతీయ జలమార్గాల్లో కృష్ణానది (విజయవాడ-ముక్యాల) స్థానం దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయా జాతీయ జలమార్గాల ద్వారా ఎనిమిది కోట్ల టన్నుల సరకు రవాణా సాగినట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. ఒక అధ్యయనం ప్రకారం రోడ్డు మార్గంలో ఒక లీటర్‌ ఇంధనంతో 24 టన్నులు, రైల్వేలో 85 టన్నులు, జల మార్గంలో 105 టన్నుల సరకును తరలించవచ్చు. ప్రస్తుతం గంగా-భాగీరథి- హుగ్లీ, బ్రహ్మపుత్ర, బాక్రా, గోవాలోని నదులు, కేరళ, ముంబయి, కృష్ణా-గోదావరి నదుల డెల్టా ప్రాంతాల్లోనే అంతర్గత జల మార్గాలద్వారా సరకు రవాణా సాగుతోంది. జల రవాణా పర్యావరణ హితం, సురక్షితం, చౌక. ఇందులో ప్రమాదకర సరకులను సైతం  రవాణా చేయవచ్చు. తద్వారా రోడ్లపై రద్దీ, ప్రమాదాలను తగ్గించవచ్చు. అమెరికా వంటి దేశాల్లో అంతర్గత జల రవాణా మొత్తం సరకు రవాణాలో దాదాపు 21శాతం ఉంటుంది. భారత్‌లో ఇది ఒకశాతం కన్నా తక్కువ. అంతర్గత జలమార్గాలు సాధారణంగా వర్షపాతం వంటి వాటిపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల పెద్ద సంస్థలు ఏడాది పొడవునా సరకు రవాణా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం దేశంలో నాలుగువేల కిలోమీటర్ల జల మార్గాలే వాడుకలో ఉన్నాయి. త్వరితగతిన మిగిలిన వాటిని అభివృద్ధి చేయడానికి కేంద్రం కంకణబద్ధం కావాలి. 

- ఎం.అక్షర
 

Posted Date: 20-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం