• facebook
  • whatsapp
  • telegram

బొగ్గు కొరతకు విరుగుడు

కాంతిపుంజాల సౌర విద్యుత్తు

బొగ్గు కొరతతో భారత్‌లో కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో సౌరశక్తిని సమధికంగా వినియోగించుకోవడంపై భారత్‌ దృష్టి సారించింది. దేశంలో 2.20 కోట్ల వ్యవసాయ పంపుసెట్ల ద్వారా ఏటా 21 వేల కోట్ల యూనిట్ల విద్యుత్తును అన్నదాతలు ఉపయోగించుకుంటున్నారు. ఇది దేశ విద్యుత్తు వినియోగంలో సుమారు 18శాతం. ప్యారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఈ దశాబ్దం చివరి నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 40శాతం విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో భారత్‌ ముందుకు సాగుతోంది. రైతులకు విద్యుత్‌, నీటి భద్రతను కల్పించి వారి ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగంలో డీజిల్‌ వినియోగాన్ని పూర్తిగా తొలగించి కాలుష్యాన్ని నివారించేందుకు 2019లో కేంద్రం పీఎమ్‌-కుసుమ్‌ పథకాన్ని తెచ్చింది. రెండు మెగావాట్ల దాకా చిన్న సౌర విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, అదనంగా 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించడం, సౌర విద్యుత్తుతో నడిచే 20లక్షల వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం, ఇప్పటికే విద్యుత్‌ గ్రిడ్‌కు అనుసంధానించి ఉన్న 15 లక్షల పంపుసెట్లను సౌరశక్తికి మార్చడం అనే మూడు అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. రెండు మెగావాట్ల దాకా చిన్న సౌరవిద్యుత్‌ ప్లాంట్లను రైతులు, సహకారసంఘాలు, పంచాయతీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్లు(ఎస్‌ఈఆర్‌సీ) నిర్దేశించిన ధరలకు డిస్కమ్‌లు కొనుగోలు చేస్తాయి. భూమిని లీజుకు ఇచ్చి ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తే ఎకరానికి రూ.25వేల దాకా ఆర్జించవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సొంతంగా ప్లాంట్లను నెలకొల్పితే ఏటా రూ.65వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఇందుకోసం రైతులకు రుణాలు అందించేందుకు ఆర్‌బీఐ సరళమైన విధానాలను ప్రవేశపెట్టింది.

సబ్‌స్టేషన్లకు అయిదు కిలోమీటర్ల పరిధిలో సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం. ఇందుకోసం డిస్కమ్‌లు దరఖాస్తులు ఆహ్వానిస్తాయి. ఎంపికైన రైతులు 25ఏళ్లకు డిస్కమ్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాలి. నీటిపారుదలకు విద్యుత్‌ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో నివాసముంటున్న 20లక్షల మంది అన్నదాతలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా మోటారు పంపుల పరిమాణాన్ని నిర్దేశిస్తారు. ప్లాంట్ల ఏర్పాటులో రాయితీలూ అందుతాయి. ప్లాంట్ల ద్వారా ఫీడర్లకు సౌరవిద్యుత్తును అందించవచ్చు. రాష్ట్రాల డిస్కమ్‌లపై వ్యవసాయ విద్యుత్‌ రాయితీల భారం తగ్గి, వాటి సామర్థ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దేశీయంగా సౌర పరికరాల తయారీ పెరుగుతుంది. విద్యుత్‌ బిల్లులు తగ్గుతాయి. వచ్చే ఏడాది నాటికి 25.75 గిగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పీఎమ్‌-కుసుమ్‌ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఇందుకోసం కేంద్రం దాదాపు రూ.34వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. 2020-21 బడ్జెట్‌లో ఈ పథకం విస్తరణను ప్రకటించారు. దీనివల్ల లక్ష్యం 30.8 గిగావాట్లకు చేరింది.

రాష్ట్రాల డిమాండ్‌ మేరకు, 4909 మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు 2019-20, 2020-21లో కేంద్రం నిధులు విడుదల చేసింది. ఫలితంగా 3.59లక్షల స్వతంత్ర సౌర మోటార్లు ఏర్పాటయ్యాయి. గ్రిడ్‌తో అనుసంధానమైన 10లక్షల పంపులకు సౌరశక్తి లభించింది. తొలి విడత కింద 750మెగావాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు 650మంది దరఖాస్తుదారులకు రాజస్థాన్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లు లెటర్‌ ఆఫ్‌ అవార్డు(ఎల్‌ఓఏ)లను జారీ చేశాయి. ఇతర రాష్ట్రాల్లో విభిన్న దశల్లో ఆయా పనులు సాగుతున్నాయి. పథకంలోని రెండో అంశంలో భాగంగా 51వేల పంపులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఏజెన్సీలు ఎంపిక చేసిన వ్యాపారులకు ఎల్‌ఓఏలను ఇచ్చాయి. కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఇది నెమ్మదించినా ప్రస్తుతం చురుకందుకుంది. మూడో అంశంలో భాగంగా రాజస్థాన్‌ ప్రభుత్వం తన మూడు డిస్కమ్‌లలో మూడు పైలట్‌ ఫీడర్లకు సౌరశక్తిని విజయవంతంగా అందించింది. గ్రిడ్‌కు అనుసంధానమైన 10వేల పంపులకు సౌరశక్తిని అందించేందుకు ఎల్‌ఓఏలను జారీ చేసింది. ఫీడర్లను గుర్తించడం, డిస్కమ్‌లకు మిగులు సౌరవిద్యుత్‌ అమ్మే రుసుముల నిర్ణయం, దరఖాస్తుల ఆహ్వానం తదితరాలపై ఇతర రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఫీడర్‌ స్థాయిలో సౌర విద్యుత్తు కల్పనకు 15లక్షల పంపుల సామర్థ్యాన్ని నిర్దేశించగా, రాష్ట్రాల నుంచి 43లక్షల పంపుల కోసం అభ్యర్థనలు వచ్చాయి. ఇప్పటివరకు 9.25లక్షల పంపులను రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. ఈ ఆర్థిక    సంవత్సరంలో చిన్న సౌరవిద్యుత్‌ ప్లాంట్లు, మోటార్ల ఏర్పాటు ద్వారా సౌర విద్యుదుత్పత్తి గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

- సతీష్‌ సూరి

(పునరుత్పాదక ఇంధనరంగ నిపుణులు)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తైవాన్‌ ఆక్రమణకు డ్రాగన్‌ తహతహ

‣ ప్రజల విజయమిది!

Posted Date: 26-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం