• facebook
  • whatsapp
  • telegram

ప్రజాప్రయోజనం నెరవేరుతుందా?

ఎంపీలాడ్స్‌ నిధుల పునరుద్ధరణ

పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాలు, ప్రాంతాల పరిధిలో అత్యవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఉద్దేశించింది ఎంపీలాడ్‌ (పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి) పథకం. 1993లో పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్‌ మైనారిటీ ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. మొదట్లో ప్రతి సభ్యుడికి ఏటా కోటి రూపాయల చొప్పున కేటాయించేవారు. తరవాత దాన్ని రెండు కోట్ల రూపాయలకు, అనంతరం అయిదు కోట్లకు పెంచారు. గతేడాది ఏప్రిల్‌లో కొవిడ్‌ విజృభించిన సమయంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఎంపీలాడ్స్‌ నిధులను కేంద్రం రెండేళ్ల పాటు నిలుపుదల చేసింది. వాటిని కేంద్ర ఆర్థిక శాఖకు మళ్ళించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న తరుణంలో ఎంపీలాడ్‌ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతో పాటు, 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది.

నిబంధనలకు విరుద్ధంగా...

పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక ఆస్తులు (డ్యూరబుల్‌ అసెట్స్‌)ను ఏర్పరచేందుకు ఎంపీలాడ్‌ పథకాన్ని నిర్దేశించారు. లోక్‌సభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో, రాజ్యసభ సభ్యులైతే తాము ఎన్నికైన రాష్ట్రంలోని ఏదైనా జిల్లాలో, నామినేటెడ్‌ సభ్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఈ నిధులను వినియోగించవచ్చు. కేంద్ర స్థాయిలో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్‌ కార్యాలయం నోడల్‌ శాఖగా వ్యవహరిస్తుంది. ఈ పథకం కింద తన నియోజకవర్గంలో నిర్ణీత పనులు చేపట్టాలని కలెక్టర్‌కు ఎంపీలు సూచిస్తారు. దేశంలోని 790 మంది ఎంపీలకు ఏటా అయిదు కోట్ల రూపాయల చొప్పున రూ.3,950 కోట్ల నిధులు కేటాయిస్తారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితర మౌలిక వసతులను కల్పించి, దీర్ఘకాలం పాటు వాటి ద్వారా ప్రజలు ప్రయోజనం పొందేలా చూడటం ఎంపీలాడ్స్‌ లక్ష్యం. స్థానిక ప్రభుత్వాలు పెద్దగా దృష్టిసారించని సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అభివృద్ధి పనుల వల్ల స్థానికంగా పలువురికి ఉపాధి సైతం దొరుకుతుంది. అందుకే గతేడాది ఎంపీలాడ్స్‌ను నిలిపివేయడాన్ని విపక్షాలు నిరసించాయి. ఇవి ఏటా పూర్తిస్థాయిలో వినియోగం కాకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడంపై ఎన్నో విమర్శలున్నాయి.

నిబంధనల ప్రకారం ఎంపీలాడ్స్‌ను ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం, నవీకరణ, ప్రైవేటు భవనాల నిర్మాణం, క్లబ్బులు, తయారీ యూనిట్ల ఏర్పాటు, మతపరమైన కట్టడాలు, మరమ్మతులు తదితరాలకు వినియోగించకూడదు. చాలాచోట్ల అందుకు విరుద్ధంగా వీటిని కేటాయించడాన్ని గతంలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన నివేదికలో ఆక్షేపించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి సరైన వివరాలు సైతం అందుబాటులో ఉండటంలేదని పేర్కొంది. చాలామంది ఎంపీలు ఈ నిధులను ఎప్పటికప్పుడు వినియోగించకుండా ఎన్నికలు సమీపించే సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు గంపగుత్తగా పనులకు సిఫార్సులు చేస్తున్నారు. చాలాచోట్ల పూర్తయిన పనులు వెంటనే ప్రజలకు అందుబాటులోకి రావడంలేదు. ఎంపీలు తమ తైనాతీలైన గుత్తేదారులకు  పనులు దక్కేలా చూడటం, ఫలితంగా వాటిలో నాణ్యత లోపించడం, పాలక పక్షాల సొంత అవసరాలకూ ఎంపీలాడ్స్‌ను వినియోగించడాన్ని కాగ్‌ తప్పుపట్టింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మతపరమైన నిర్మాణానికి ఆ నిధులను వినియోగించారని ఫిర్యాదు అందడంతో కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

సుదీర్ఘ ప్రక్రియ

ఎంపీలాడ్‌ పథకం కింద 2020 మార్చి నాటికి కేటాయించిన నిధుల్లో రూ.5,275 కోట్లు ఖర్చుకాలేదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. 2019 మార్చి నాటికి రూ.4,103 కోట్లు, 2018 మార్చి చివరి నాటికి రూ.4,877 కోట్ల ఎంపీలాడ్స్‌ నిధులు వినియోగం కాలేదు. గతంలో లోక్‌సభ కొలువుతీరి ఏడాది గడచిన తరవాతా 542 మంది ఎంపీల్లో 298 మంది ఒక్క రూపాయినీ వినియోగించలేదని కాగ్‌ కుండ బద్దలుకొట్టింది. 2014 మే నుంచి 2018 డిసెంబరు మధ్యలో 93శాతం ఎంపీలు ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేదు. ఎంపీలాడ్స్‌ పరంగా ఎన్నో దశల ప్రక్రియలు నిధుల వినియోగంలో ఆటంకంగా నిలుస్తున్నాయన్న వాదనలూ ఉన్నాయి. ఎంపీలు సిఫార్సు చేశాక అంచనాలు రూపొదించడం నుంచి, టెండర్లు పిలవడం వరకు సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటోంది. దీన్ని నివారించేలా సరైన విధానం రూపొందించాలి. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఆదరువుగా నిలిచే ఎంపీలాడ్స్‌ నిధులను ఎప్పటికప్పుడు వినియోగించేలా ఎంపీలు తప్పనిసరిగా శ్రద్ధచూపాలి. వాటి సక్రమ వినియోగానికి కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ పథకం అసలు లక్ష్యం నెరవేరుతుంది.

- దివ్యాన్షశ్రీ
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేలిమి విద్యే దేశానికి పెన్నిధి

‣ ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం

Posted Date: 17-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం