• facebook
  • whatsapp
  • telegram

పౌరహక్కులకు సంకెళ్లు

పట్టు తప్పుతున్న ప్రజాస్వామ్యం

అత్యుత్తమ పాలనా విధానంగా పేరుగాంచిన ‘ప్రజాస్వామ్యం’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా వంటి నిరంకుశ శక్తులు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా పలు దేశాల్లో ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడుతున్నాయి. అణచివేత ధోరణులు, సైనిక తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య, ఎన్నికల సహాయ సంస్థ (ఐడీఈఏ) తన తాజా నివేదికలో ఈ కఠోర వాస్తవాలను కళ్లకు కట్టింది. ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 70శాతం ప్రజాస్వామ్యయుతంకాని, ప్రజాస్వామ్య విలువలు క్రమేణా క్షీణిస్తున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను సంపూర్ణంగా గౌరవించే దేశాల్లోని ప్రజల సంఖ్య ప్రపంచ జనాభాలో 8.4శాతమే. ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్న దేశాల సంఖ్య గత దశాబ్ద కాలంలో రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల సంఖ్య ముందెన్నడూ లేనంత తక్కువగా 98కి పరిమితమైంది. 47 దేశాల్లో నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నాయి. చైనా, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఇరాన్‌ వంటివి నిరంకుశ వ్యవస్థలకు ఉదాహరణలు. రష్యా, మొరాకో, టర్కీ తదితర దేశాల్లో మిశ్రమ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయి. చాలా దేశాలు పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటి హక్కులకు సంకెళ్లు బిగిస్తున్నాయి. శాంతియుత నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నాయి. గత రెండేళ్లలో ప్రజాస్వామ్యం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2020నుంచి ఇప్పటిదాకా మాలిలో రెండుసార్లు సైనిక తిరుగుబాట్లు చోటుచేసుకొన్నాయి. ట్యునీసియాలో అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేసి ఆత్యయిక పరిస్థితి పేరిట అధికారాలన్నింటినీ తన గుప్పిట పెట్టుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణ, మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుతో పౌర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బెలారస్‌, క్యూబా, మయన్మార్‌, సుడాన్‌లలో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు అణచివేతకు గురయ్యాయి. సుడాన్‌లో సైనిక తిరుగుబాటుతో ప్రధానమంత్రి అబ్దల్లా హమ్దోక్‌ గద్దె దిగినప్పటికీ- సైన్యంతో ఒప్పందం చేసుకొని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టారు. కొవిడ్‌ మహమ్మారి రంగప్రవేశం తరవాత ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం మరింతగా బలహీనపడింది. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, సబ్‌ సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో పాలకులు మహమ్మారి కట్టడి ముసుగులో అనుచిత ఆంక్షలు విధించారు. ప్రతిపక్షాలతోపాటు అసమ్మతి వర్గాల గొంతు నొక్కేశారు.

అమెరికాలో దేశాధ్యక్ష హోదాలో ఉన్నప్పుడే ట్రంప్‌ తమ ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తడం సంచలనం సృష్టించింది. ఆ దేశంలో టెక్సాస్‌ సహా కొన్ని రాష్ట్రాలు మైనారిటీలకు ఇతరులతో సమానంగా ఓటుహక్కు కల్పించడంలో విఫలమవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్న దేశాల జాబితాలో అమెరికాను ఐడీఈఏ ఈ ఏడాది తొలిసారిగా చేర్చింది. ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనపై కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయనడంలో సందేహం లేదు. పెగాసస్‌ స్పైవేర్‌ను పాలక వర్గాలు దుర్వినియోగం చేశాయన్న ఆరోపణలపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక కమిటీని నియమించడం, సుదీర్ఘ ఉద్యమం ద్వారా సాగుచట్టాల రద్దును రైతులు సాకారం చేసుకోవడం వంటివి ప్రజాస్వామ్య విజయానికి ఉదాహరణలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇండియా, అమెరికా సంయుక్తంగా ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవలసిన అవసరం ఉంది. నిరంకుశ శక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ప్రధాన అజెండాగా భారీ వర్చువల్‌ సదస్సును ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించాలని బైడెన్‌ తలపెట్టారు. ఇందులో పాల్గొనవలసిందిగా భారత్‌ సహా 110 దేశాలను ఆహ్వానించారు. ఈ వేదికను అన్ని దేశాలూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దిశగా పటిష్ఠ ప్రణాళికలను రూపొందించుకొని, వాటిని ఆచరణలోకి తీసుకురావడం అత్యావశ్యకం.

- నవీన్‌ కుమార్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముడివీడుతున్న అపనమ్మకాలు

‣ భారత్‌ మెడపై కాట్సా కత్తి

‣ కులగణనకు పెరుగుతున్న డిమాండ్లు

‣ ప్రజాప్రయోజనం నెరవేరుతుందా?

Posted Date: 29-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం