• facebook
  • whatsapp
  • telegram

నిర్లక్ష్యం ప్రాణాంతకం

నిర్వహణ లోపాలే పెనువిపత్తులు

దేశంలో ఆనకట్టల భద్రతకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ 2019 ఆగస్టు రెండో తేదీన ఆమోదించగా, రాజ్యసభ ఈ నెల రెండున ఆమోదముద్ర వేసింది. దీంతో గతంలోకన్నా సమర్థంగా ఆనకట్టల సంరక్షణ, నిఘా, తనిఖీ, నిర్వహణలకు అవకాశం ఏర్పడింది. అమెరికా, చైనాల తరవాత భారత్‌లోనే అత్యధిక భారీ ఆనకట్టలు ఉన్నా, వాటి భద్రతకు ఇప్పటి వరకూ సమగ్ర చట్టమన్నది లేదు. దేశంలో కొన్ని ఆనకట్టలకు ఇటీవల సంభవించిన ప్రమాదాలు ఈ బిల్లు అవసరాన్ని నొక్కిచెప్పాయి. 2019 జులై మూడో తేదీ రాత్రి మహారాష్ట్రలోని టివారె ఆనకట్టకు గండి పడి సమీపంలోని ఏడు గ్రామాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఆనకట్ట ఎగువన కురిసిన భారీ వర్షాలకు మట్టి కరకట్టకు గండి పడి పెద్దయెత్తున నీరు దిగువనున్న భేండెవాడీ గ్రామాన్ని ముంచెత్తింది. నిరుడు డిసెంబరు 31న తెలంగాణలోని శంకరంపేట వద్ద సరళాసాగర్‌ సాగు నీటి ప్రాజెక్టుకు గండ్లు పడి తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. డ్యాములో ఉన్న అర టీఎంసీ నీరు బయటకు వెళ్ళిపోయింది. ఈ ఏడాది నవంబరు 19న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య ప్రాజెక్టు (చెయ్యేరు) నిండిపోగా, నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. కానీ, అయిదో గేటు పని చేయకపోవడంతో వరద నీటితో మట్టి కరకట్ట కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలోనూ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి.

పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వాలదే!

నదులపై నిర్మించే ఆనకట్టలు- సాగు, తాగు నీటి సరఫరాతోపాటు విద్యుదుత్పాదన, వరద ఉద్ధృతి నివారణకు తోడ్పడే భారీ నిర్మాణాలు. సాధారణంగా 15 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తయిన ఆనకట్టలను భారీ డ్యాములుగా వర్గీకరించారు. 2019 జూన్‌ నాటికి నిర్మితమవుతున్న వాటితో సహా- భారతదేశంలో 5,745 భారీ డ్యాములు ఉన్నాయి. వీటిలో 75శాతం 20 ఏళ్ల కింద నిర్మించినవి; 227 డ్యాములు నూరేళ్లకు ముందు కట్టినవి. భారీ ఆనకట్టల్లో అత్యధికం మహారాష్ట్ర (2,394), మధ్యప్రదేశ్‌ (906), గుజరాత్‌(632)లలోనే ఉన్నాయి. పెద్ద ఆనకట్టల్లో చాలా ఎక్కువ పరిమాణంలో నీటిని నిల్వ చేస్తారు కాబట్టి, డ్యామును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అది దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకొంటూ ఉండాలి. కేంద్ర జల సంఘానికి చెందిన ఆనకట్టల భద్రతా సంస్థ డ్యాముల సమాచారాన్ని నిరంతరం సేకరిస్తూ, వాటి సంరక్షణకు తగిన సాంకేతిక సహకారాన్ని రాష్ట్రాలకు, డ్యాము యాజమాన్య సంస్థలకు అందిస్తూ ఉంటుంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంఘం డ్యాము భద్రతా విధానాలను, నియమ నిబంధనలను రూపొందిస్తుంది. ప్రస్తుతం 18 రాష్ట్రాలకు, నాలుగు ఆనకట్టల యాజమాన్య సంస్థలకు సొంత డ్యాము భద్రతా సంస్థలు ఉన్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు, తరవాత చేయవలసిన తనిఖీల గురించి కేంద్ర జల సంఘం సలహాలు ఇస్తుంది.

ఈ బిల్లు దేశంలో నిర్దేశిత ఆనకట్టలన్నింటికీ వర్తిస్తుంది. నీరు అనేది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశమైనప్పుడు పార్లమెంటు ఎలా చట్టం చేయగలదనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబు రాజ్యాంగంలోనే ఉందని భారత సొలిసిటర్‌ జనరల్‌ వివరించారు. రాజ్యాంగంలోని 246వ అధికరణలోని 56, 97 పద్దులను ఈ సందర్భంగా ఉటంకించారు. ఏడో షెడ్యూలు కింద కేంద్ర జాబితాలోకి వచ్చే అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. 56వ పద్దు కింద ప్రజా ప్రయోజనాల కోసం అంతర్రాష్ట్ర నదులు, నదీ లోయల మీద చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు దఖలు పడింది. రాష్ట్రాల జాబితాలో కానీ, ఉమ్మడి జాబితాలో కానీ చేర్చని అంశాల మీద చట్టాలు చేసే అధికారాన్ని 97వ పద్దు కేంద్రానికి కట్టబెట్టింది. ఈ జాబితాల్లో ఉల్లేఖించని పన్నులను కూడా కేంద్రం విధించవచ్చు.

అన్ని జలాశయాలకూ అవసరం

ఆనకట్టల భద్రతా చట్టం కింద కేంద్రం, రాష్ట్రాల స్థాయుల్లో నాలుగు అంచెల నిఘా యంత్రాంగ్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆనకట్టల భద్రతకు తగిన విధానాలు, నియంత్రణలను రూపొందించే అధికారంతో జాతీయ డ్యాముల భద్రతాసంఘం(ఎన్‌సీడీఎస్‌)ను నెలకొల్పాలి. దానికి కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ సంఘం రూపొందించే విధానాలను అమలు చేసే బాధ్యతను జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ)కు అప్పగించారు. రాష్ట్రాల డ్యాము భద్రతా సంస్థల (ఎస్‌డీఎస్‌ఓ) మధ్య కానీ, ఒకే రాష్ట్రంలోని భద్రతా సంస్థకు, డ్యాము యాజమాన్య సంస్థకు మధ్య కానీ తలెత్తే వివాదాలను పరిష్కరించే బాధ్యత ఎన్‌డీఎస్‌ఏకి అప్పగించారు. రాష్ట్రాల స్థాయిలోనూ ఇలాంటి విధులు, బాధ్యతలతో డ్యాము భద్రతా సంఘాలు, ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలని బిల్లు నిర్దేశించింది. ఎస్‌డీఎస్‌ఓలు ఆనకట్టలను నిరంతరం తనిఖీ చేస్తూ, పర్యవేక్షిస్తూ ఉండాలి. రాష్ట్ర డ్యాము భద్రతా సంఘం ఎస్‌డీఎస్‌ఓల పనితీరును సమీక్షిస్తూ ఉంటుంది. ఆనకట్టల వల్ల నిర్వాసితులైనవారి పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. తాజా చట్టానికి ముందూ తరవాతా నిర్మించిన ఆనకట్టలకు బిల్లు వర్తిస్తుంది. బిల్లు కింద ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సంస్థల అధికారుల విధి నిర్వహణకు అడ్డు తగిలినా, వారి ఆదేశాలను ఆచరించడానికి నిరాకరించినా ఏడాది జైలు శిక్ష పడుతుంది. ఈ ధిక్కరణ ప్రాణ నష్టానికి దారితీస్తే రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. జరిమానాలు కూడా విధిస్తారు. భారీ ఆనకట్టల భద్రతకు తీసుకొచ్చిన ఈ బిల్లు క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలను చూపనుంది. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల భద్రతకూ ఇటువంటి ఏర్పాట్లు చేయాలి.

సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం...

ఆనకట్టల భద్రతకు ఒక చట్టం తీసుకువచ్చే విషయాన్ని 1982 నుంచే పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పడిన స్థాయీసంఘం దేశంలోని ఆనకట్టలన్నింటికీ ఏకరూప భద్రతా నిబంధనలను సిఫార్సు చేసి, ఆనకట్టల భద్రతకు ఒక చట్టం చేయాలని 1986లో సూచించింది. పార్లమెంటు ఈ తరహా చట్టాన్ని చేయాలని కోరుతూ గతంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాలు తీర్మానాలు ఆమోదించాయి. దీన్ని పురస్కరించుకొని 252వ రాజ్యాంగ అధికరణ కింద పార్లమెంటులో 2010లో ఆనకట్టల భద్రతా బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రాల జాబితాలోని అంశాలపై రాష్ట్రాలు కోరినప్పుడు చట్టాలు చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చే అధికరణ అది. 15వ లోక్‌సభ రద్దయినప్పుడు 2010నాటి బిల్లు కూడా మురిగిపోయింది. తరవాత 2019లో ప్రవేశపెట్టిన ఆనకట్టల భద్రత బిల్లును లోక్‌సభ అదే ఏడాది ఆమోదించింది. తాజాగా రాజ్యసభ సమ్మతించింది.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చిరకాల మైత్రికి కొత్త ముడి

‣ సాంకేతికత అండగా విమానయానం

‣ పోషణతోనే బలవర్ధక భారత్‌

Posted Date: 08-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం