• facebook
  • whatsapp
  • telegram

నీరుగారుతున్న ‘సహ’ స్ఫూర్తి


దేశీయంగా ప్రజాస్వామ్య పునాదులు పటిష్ఠం కావాలంటే ప్రభుత్వాల పనితీరుపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నది సమాచార హక్కు (ఆర్టీఐ) చట్ట ప్రవేశిక సారాంశం. జనావళికి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా సమకూర్చాలన్నది, ఆ చట్టంలోని సెక్షన్‌ 4(2) నిర్దేశం. 963 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాన్ని ఔదలదాలుస్తున్నవి 42 మాత్రమేననే విస్మయకర వాస్తవం లోగడే వెలుగుచూసింది. తరతమ భేదాలతో అన్ని రాష్ట్రాల్లోనూ అదే దురవస్థ తాండవిస్తోంది. స్వచ్ఛంద సమాచార వెల్లడి దేవతావస్త్రంగా మారిన దుస్థితిలో- దేశవ్యాప్తంగా సర్కారీ కార్యాలయాలకు ఏడాదికి 40 నుంచి 60 లక్షల వరకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. స.హ.చట్టం స్ఫూర్తికి నీళ్లొదులుతున్న అధికారుల తెంపరితనం మూలంగా కేంద్ర, రాష్ట్ర సమాచార సంఘాలకు అప్పీళ్లు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సమాచార కమిషనర్ల పోస్టులను సకాలంలో భర్తీ చేయని పాలకులు; తప్పనిసరి పరిస్థితుల్లో నియామకాలు చేపట్టినా- తమ తాబేదారులకు వాటిని పునరావాస కేంద్రాలుగా మారుస్తున్నారు. తత్ఫలితంగా దరఖాస్తుదారులకు అక్కడా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కేంద్ర సమాచార సంఘంతో పాటు మరో పన్నెండు రాష్ట్రాల కమిషన్ల పరిధిలోని పెండింగ్‌ కేసులు పరిష్కారం కావాలంటే ఏడాది నుంచి ఏడేళ్ల కాలం పడుతుందంటున్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స.హ.చట్టాన్ని కాలరాసే అధికారులకు జరిమానాలతో బుద్ధిచెప్పడానికి సైతం సమాచార సంఘాలు సుతరామూ ఇష్టపడటం లేదు. నూటికి సగటున 95 కేసుల్లో వారిపై అవి కఠిన చర్యలేమీ తీసుకోవడం లేదు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాల కోసం గళమెత్తిన జాగృత జనవాహిని చైతన్యమే పదహారేళ్ల క్రితం సమాచార హక్కు చట్టంగా రూపుదాల్చింది. అధికార రహస్యాల మాటున అవినీతి మహమ్మారితో అంటకాగడానికి దశాబ్దాలుగా అలవాటుపడ్డ నేతలు, వారి అంతేవాసుల పెడపోకడలతో పోనుపోను ఆ ప్రజాశాసనం నిర్వీర్యమైపోతోంది!

సమాచార సంఘాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఇ.ఎం.సుదర్శన నాచియప్పన్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీసంఘం గతంలో అభిలషించింది. కమిషనర్లుగా విశ్రాంత అధికారులు అధిక శాతంలో కొలువుతీరుతుండటంపై సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం విస్మయం వ్యక్తంచేసింది. పారదర్శక విధానాలను పాటిస్తూ భిన్న రంగాల ప్రముఖులను ఆ పదవుల్లో నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వాస్తవానికి సమాచార కమిషనర్ల ఎంపికలో ప్రభుత్వాల పాత్ర- సంఘాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉన్నతస్థాయి స్వతంత్ర కమిటీల ద్వారా ఆ పదవులు భర్తీ అయితేనే- సమాచార సూర్యోదయానికి అవరోధాలు తొలగిపోతాయి. మరోవైపు, క్షేత్రస్థాయిలో ఆర్టీఐపై అవగాహన కల్పించడంలోనూ పాలకులు అలవిమాలిన అలక్ష్యమే ప్రదర్శిస్తున్నారు. ఆయా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు 2013-14తో పోలిస్తే ఆ తరవాతి మూడేళ్లలో 66శాతం మేరకు కోసుకుపోయాయి. ఆసేతుహిమాచలం ఆర్టీఐ ఉద్యమకారులపై భౌతిక దాడులు పెచ్చరిల్లుతున్నాయి. స.హ.చట్టమే ఆయుధంగా అక్రమాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో ఇప్పటి వరకు 95 మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం ఇంకెందరో తీవ్రస్థాయి వేధింపులకు గురవుతున్నారు. ఈ ఘాతుకాలకు అడ్డుకట్ట పడాలంటే- ప్రజావేగుల రక్షణ చట్టాన్ని పూర్తిస్థాయిలో పట్టాలకు ఎక్కించాలి. పాలనలో పారదర్శకతకు ఎంతగా ప్రాధాన్యమిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యంపై అంతగా విశ్వాసం ఇనుమడిస్తుందని ప్రధాని మోదీ ఏనాడో ఉద్ఘాటించారు. ఆ మేరకు అధికార యంత్రాంగానికి పాలకులు దిశానిర్దేశం చేస్తేనే- రాజ్యాంగబద్ధమైన సమాచార హక్కుకు మన్నన దక్కుతుంది!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆధిపత్య భావనే అనర్థాలకు మూలం

‣ నదుల్ని ముంచెత్తుతున్న వ్యర్థాలు

‣ భారత్‌ - అమెరికా మధ్య రష్యా అలజడి

‣ నిర్లక్ష్యం ప్రాణాంతకం

Posted Date: 11-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం