• facebook
  • whatsapp
  • telegram

జవాబుదారీతనమే గీటురాయి

సుపరిపాలన వారోత్సవాల (2021 డిసెంబరు 20-25) సందర్భంగా...

ఆధునిక ప్రపంచంలో ఒక రాజ్యం మంచి పరిపాలన అందించిందంటే, కొన్ని లక్ష్యాలను సమర్థంగా సాధించిందని అర్థం. ఆ లక్ష్యాలను నెరవేర్చడం కోసమే మానవ సమాజం రాజ్యాన్ని ఏర్పరచుకుంది. శాంతి భద్రతలను కాపాడటం, అందరికీ సమర్థంగా సమన్యాయాన్ని అందించడం, చట్టబద్ధపాలనను అమలు చేయడం రాజ్యం మొదటి విధులు. దేశీయంగా శాంతి భద్రతల విషయంలో చాలా వరకు రాజ్యం సమర్థంగా పనిచేస్తోంది. న్యాయం విషయంలో మాత్రం ఆ ప్రగతి కనిపించదు. భారత్‌లో నాలుగు కోట్లకు పైగా కేసులు న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిలో అధిక శాతం క్రిమినల్‌ కేసులే. చట్టబద్ధపాలన మృగ్యంకావడం, సివిల్‌ కేసుల్లో కోర్టులకు వెళ్ళకుండా సెటిల్‌మెంట్లవైపు అడుగులు వేయడం వల్ల కండబలం కలిగిన సంఘటిత నేర ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆ ముఠాలకు చెందినవారు కాలక్రమంలో నేర పరిశోధనను, ప్రాసిక్యూషన్‌ను శాసించే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. అలాంటి పరిణామాలు సుపరిపాలనకు పెను సవాళ్లుగా మారుతున్నాయి. నేర పరిశోధన, ప్రాసిక్యూషన్‌ రెండూ రాజకీయం చేతుల్లో బందీలు కావడంవల్ల ఏ అండ, పలుకుబడి, డబ్బు లేనివారు మాత్రమే ఎంతో కొంత చట్టానికి కట్టుబడవలసి వస్తోంది. మిగిలినవాళ్లంతా అమలుకాని చట్టం నుంచి తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బలమైన, నిష్పాక్షికమైన చట్టబద్ధ పాలనా వ్యవస్థను తీర్చిదిద్దకపోతే వచ్చే 30 ఏళ్ల కాలంలో శాంతి భద్రతలు, నేర ప్రవృత్తి అదుపు తప్పే ప్రమాదం ఉంది.

కొనసాగుతున్న అంతరాలు

సమాజం ఉమ్మడి అవసరాలను తీర్చడం రాజ్యం ప్రధాన బాధ్యత. మంచినీటి సరఫరా, వరదనీటి నివారణ, మురుగునీటి పారుదల, దోమల నిర్మూలన, రోడ్లపై గుంతలను పూడ్చటం, ట్రాఫిక్‌ నియంత్రణ వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. అవన్నీ సరిగ్గా లేకుంటే ప్రజల జీవితాలు గందరగోళమవుతాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. భారత్‌లో నేటికీ శుద్ధమైన తాగునీరు లేక ఎంతోమంది అంటువ్యాధులకు గురవుతున్నారు. చాలా నగరాల్లో సరైన వరద నీటి వ్యవస్థ లేదు. గ్రామీణ సమాజంలో నేటికీ బహిరంగ మల విసర్జన కొనసాగుతోంది. పట్టణాలు, నగరాల్లో నూటికి 70 మందికి ఇంకా సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో లేదు. వ్యర్థ జలాలతో చెరువులు, నదులు కలుషితమవుతున్నాయి. ఇక విద్యుత్తు, రవాణా, మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలో అట్టడుగున ఉన్న దేశాల్లో భారత్‌ సైతం ఒకటి. వీటన్నింటిపట్ల నిర్లక్ష్యం వహిస్తే- పేదరికాన్ని నిర్మూలించడం, అందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం అసాధ్యం. రవాణా సదుపాయాలు, 24 గంటల విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ వంటివీ పౌరులందరికీ సమర్థంగా అందేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి.

ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన వైద్యం అందించడం సైతం ప్రభుత్వాల ప్రధాన విధి. వాటి విషయంలో మన దేశం దయనీయ స్థితిలో ఉంది. 15 ఏళ్ల వయసు పిల్లల్లోని విద్యాప్రమాణాలపై జరిపిన పరిశీలనలో 74 దేశాల సరసన భారత్‌ 73వ స్థానంలో నిలిచింది. భారత్‌లో విద్యార్థుల తెలివితేటలకు కొదవ లేదు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులను ఖర్చుచేస్తున్నాయి. సమాజం విద్యను, విద్వత్తును గౌరవిస్తుంది. అయినా సరైన విద్య అందకపోవడంవల్ల పుట్టుకతో వచ్చిన అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకూ అవరోధంగా నిలుస్తోంది. కరోనా వైరస్‌ మన ఆరోగ్య రంగ బలహీనతను బట్టబయలు చేసింది. వైద్య ఖర్చుల కారణంగా భారత్‌లో ఏటా ఆరు కోట్ల కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. సరైన వైద్యం దక్కక ఏటా అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఏడున్నర లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. జాతీయాదాయంలో ప్రభుత్వాలు ఆరోగ్యానికి అరకొర నిధులనే కేటాయిస్తున్నాయి.

మౌలిక సంస్కరణలు అవసరం

భారత ప్రజాస్వామ్యం స్వయం దిద్దుబాటు శక్తిని ప్రదర్శించడంలో విఫలమైంది. ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం, ఉద్యమం చేస్తేగానీ ప్రభుత్వాలు స్పందించవనే భావన సమాజంలో పాతుకుపోయింది. పాలనలో పారదర్శకత కొరవడింది. ఎంతో ఆశతో తెచ్చుకున్న సమాచార హక్కు చట్టం ఆచరణలో నిర్వీర్యమైంది. ఇలా వివిధ స్థాయుల్లో పాలకులు ప్రజలకు ఏమాత్రం జవాబుదారీ కాకుండా వ్యవహరిస్తుండటంతో, యజమానులు కావలసిన ప్రజలు గులాములుగా మారారు. ప్రజలకు సేవకులు కావాల్సిన పాలకులు ప్రభువులుగా రూపాంతరం చెందారు. ఇవన్నీ వ్యవస్థ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితులు అన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ కనిపించాయి. అక్కడి నాయకత్వం ముందుచూపుతో, విజ్ఞతతో ఆ సవాళ్లను అధిగమించింది. భారత్‌లో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే మౌలికమైన రాజకీయ, పాలనా సంస్కరణలను చేపట్టాలి. అధికారాన్ని సమూలంగా ప్రక్షాళించి జవాబుదారీతనానికి బాటలు వేయాలి. సమర్థులు, నిజాయతీపరులు రాజకీయాల్లోకి ప్రవేశించాలి. ప్రజాహితాన్ని పెంచడానికి ప్రాధాన్యమివ్వాలి. ఒక దశాబ్ద కాలంలో వీటన్నింటినీ సాధించడానికి బృహత్తర ప్రణాళికను దేశవ్యాప్తంగా చేపట్టడం మనముందున్న కర్తవ్యం. ఏడాదికి ఒకసారి స్మరణగా మారితే సుపరిపాలన అందదు. అందుకోసం దేశ ప్రజల భాగస్వామ్యంతో, రాజకీయ, పాలనా రంగాల్లో ప్రజాస్వామిక మార్పులకు జవాబుదారీతనంతో వ్యవస్థలను నిర్మించుకోవాలి.

వికేంద్రీకరణకు విఘాతం

ఇండియాలో హక్కులతో పాటు బాధ్యతలు సైతం ఉన్నాయన్న స్పృహ కొరవడింది. ప్రజల్లో ఆదర్శాన్ని నింపాల్సిన రాజకీయ పార్టీలు నిరంతరం అప్రజాస్వామిక నిరసన పద్ధతులను అనుసరిస్తున్నాయి. చీటికిమాటికి రాస్తారోకోలు, బందులు, రైల్‌ రోకోలు వంటి వాటివల్ల పాలన కుంటువడుతూ ప్రజల హక్కులు హరించుకుపోతున్నాయి. రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చే సమయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఈ ధోరణులపై మనల్ని హెచ్చరించారు కూడా. విపరీత కేంద్రీకరణ ఉన్న మన దేశంలో పేరుకు ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, క్రమబద్ధంగా జరుగుతున్నప్పటికీ- స్వపరిపాలనకు చోటు లేకుండా పోయింది. అధికారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌ చేతుల్లోనే కేంద్రీకృతమైంది. సామాన్య ప్రజలకు తమ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు మృగ్యమయ్యాయి. స్థానిక ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. చాలా సందర్భాల్లో లంచాలు, సిఫార్సులు లేకుండా, పదిసార్లు తిరగకుండా పౌరులకు హక్కుగా జరగాల్సిన ఒక్క చిన్న పనీ సాకారం కావడంలేదు.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనాకు పొరుగు పోటు

‣ నియంత్రణల నుంచి సరళీకరణ వైపు...

‣ భూమి హక్కుల్లో చిక్కులు

‣ హక్కుల పేరిట అమెరికా దూకుడు

Posted Date: 24-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం