• facebook
  • whatsapp
  • telegram

ఆకర్షణీయ నగరాలపై నిర్లక్ష్యం నీడ

స్మార్ట్‌ సిటీ పథకం అమలులో జాప్యం

సాంకేతిక భారత్‌ను ఆవిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వంద నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. అందులో భాగంగా ‘స్మార్ట్‌ సిటీ’ పథకానికి రూపకల్పన చేసి ‘స్మార్ట్‌ సిటీ మిషన్‌(ఎస్‌సీఎం)’ను ఏర్పరచింది. 2016లో ఈ పథకం కింద నగరాల ఎంపిక మొదలై 2018లో పూర్తయింది. ప్రతీ నగరంలో పనులను చేపట్టేందుకు ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటైంది. తొలి దఫాలో ఎంపికైన ఆకర్షణీయ నగరాల్లో పనులు ఈ ఏడాదే పూర్తి కావాల్సి ఉంది. కానీ కొవిడ్‌ కారణంగా జరిగిన జాప్యం వల్ల తాజాగా నీతి ఆయోగ్‌ ఆకర్షణీయ పథకం గడువును మరో రెండేళ్లు పొడిగించింది. 2023 నాటికి అన్ని నగరాల్లో ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేసింది. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి నగరానికి కేంద్రం రూ.500 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర నిధులకు వాటా ధనం(మ్యాచింగ్‌ గ్రాంటు)గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.500 కోట్లు కలిపి నగరాలను స్మార్ట్‌ బాట పట్టించాలన్నదే ఈ పథకం అసలు లక్ష్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కాకుండా, ఆయా నగరాల్లో అవసరాలు, అవకాశాలను బట్టి ప్రజా, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు సమకూర్చుకొని నగరాల రూపురేఖలు మార్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల కింద 6,452 ప్రాజెక్టులకు గానూ, రూ.1.84 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలవగా, ఇందులో రూ.53,175 కోట్ల విలువైన 3,131 ప్రాజెక్టులు పూర్తయినట్లు తాజాగా లోక్‌సభలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు.  

కొత్త పరిష్కారాలు అవసరం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నగరాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించి, ఆర్థిక పరిపుష్టి సాధించడమే- ఆకర్షణీయ నగరాల పథకం ముఖ్య లక్ష్యం. కానీ, ఎంపికైన నగరాల్లో కొన్నిచోట్ల మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ముందు చూపుతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పట్టణీకరణ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరాల జనాభా అధికమవుతోంది. గ్రామాల నుంచి పట్టణాలకు పెరుగుతున్న వలసల వల్ల నగర ప్రాంతాల్లో మురికివాడలూ అదే స్థాయిలో విస్తరిస్తున్నాయి. దేశంలో మహారాష్ట్ర తరవాత పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏపీయేనని, మహారాష్ట్రలో మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 18శాతమైతే, ఆంధ్రప్రదేశ్‌లో 16శాతమని నీతి ఆయోగ్‌ నివేదికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో మురికివాడల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ప్రభుత్వాల ముందున్న పెద్దసవాలు. ఆకర్షణీయ నగరం పథకం ర్యాంకింగ్‌లలో అగ్రస్థానంలో నిలుస్తున్న గుజరాత్‌లోని సూరత్‌, అహ్మదాబాద్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, మహారాష్ట్రలోని పుణె నగరాల్లో పలు వినూత్నమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అక్కడి ప్రజలకు స్మార్ట్‌ సేవలను అందిస్తున్నారు. సూరత్‌లోని ‘ఎస్‌ఎంఏసీ’ కేంద్రం మహానగర పాలక సంస్థల్లోని వివిధ శాఖల్లో అందుతున్న పౌర సేవలను విశ్లేషిస్తుంది. తద్వారా ప్రతి విభాగం పనితీరు గురించి నగరపాలక సంస్థకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఫలితంగా ప్రజల అవసరాలకు తగ్గట్లు యంత్రాంగాన్ని సంసిద్ధం చేసే అవకాశం ఉంది. ఆటోమెటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌, ఇంటెలిజెంట్ ట్రాన్సిట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ, సూరత్‌ మనీ కార్డ్‌, సౌర, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు లాంటి ప్రాజెక్టుల అమలు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగవుతున్నాయి.

సమన్వయం కీలకం

ఆకర్షణీయ నగరాల పథకం అమలు ఇక నుంచైనా వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరం. కేంద్రం ఇచ్చిన నిధులకు సమానంగా రాష్ట్రాలు తమ వాటాను అందివ్వడమే కాకుండా, కేంద్రం మరో రెండేళ్లు గడువు పొడిగించినందువల్ల ఉపయుక్తమైన ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే సాంకేతిక సంస్థలను సైతం భాగస్వాములుగా చేసి, వాటి సలహాలు తీసుకోవాలి. తెలంగాణ, ఏపీల్లో ఎన్‌ఐటీ, ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. వాటి సలహాలతోపాటు, పలు అంకుర సంస్థల సేవలను సైతం వాడుకొని కృత్రిమ మేధ, ఐఓటీ, రోబొటిక్స్‌ లాంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పరిష్కరించే సరికొత్త ప్రాజెక్టులను చేపట్టాలి. ఘన వ్యర్థాల నిర్వహణను వైవిధ్యంగా చేపట్టాలి. ఆహ్లాదకరమైన ఉద్యానవనాల ఏర్పాటు అవసరం. వారసత్వ, పర్యాటక ప్రాంతాలకు స్మార్ట్‌ హంగులు కల్పించి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలి. ఉచిత వైఫై సౌకర్యంతోపాటు విద్య, వైద్య రంగాల్లో సైతం స్మార్ట్‌ సేవలను పెంపొందించే దిశగా అడుగులు వేగంగా పడాలి. వాటా నిధులను కేటాయించి- కేంద్రం ఇచ్చిన రెండేళ్ల గడువు లోపు ఆకర్షణీయ నగరాలను సాకారం చేస్తేనే దేశంలోని నగరాల్లో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.

రాష్ట్రాల వాటా అంతంతే

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సమాన నిష్పత్తిలో రాష్ట్రాలు నిధులను విడుదల చేస్తేనే ఈ పథకంలో ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. స్మార్ట్‌ సిటీ మిషన్‌ తాజా నివేదిక ప్రకారం ఈ పథకం కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 36. వాటిలో 28 ఈ పథకానికి వాటా ధనాన్ని విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి రూ.27,282 కోట్లను విడుదల చేయగా, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వాటా రూ.21,024 కోట్లు. వాటా నిధుల విడుదలలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరీ తీసికట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఎంపికయ్యాయి. తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌లకు చోటు దక్కింది. ఇందులో మొదటి విడతలో ఎంపికైన నగరాలను పరిశీలిస్తే, విశాఖపట్నంలో ఈ పథకం కింద చేపట్టిన సౌర వీధి దీపాలు, పాఠశాలల్లో ఆకర్షణీయ తరగతులు, ఉద్యానవనాల అభివృద్ధి, సిటీ ఆపరేషన్‌ కేంద్రం లాంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో మిగతా మూడు నగరాల్లో ఆకర్షణీయ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతి అంతంతే అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ నగరానికి ‘ఎస్‌సీఎం’ కింద కేంద్రం రూ.193 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం అసలు మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయకపోవడం గమనార్హం. పైగా నిధుల విడుదల, పనుల పురోగతిపై యుటిలైజేషన్‌ సర్టిఫికెట్ (యూసీ) సమర్పించడంలోనూ ఆయా ‘ఎస్‌పీవీ’లు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

- గుండు పాండురంగశర్మ
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం

‣ ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

‣ బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

Posted Date: 03-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం