• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులకే అగ్రాసనం

విధులకు ప్రాధాన్యమివ్వని రాజ్యాంగం

బ్రిటిష్‌ వలస పాలకులు భారతీయుల జీవనాధారాలను నాశనం చేయడమే కాదు, ప్రజల మౌలిక హక్కులనూ అణగదొక్కి హుందాగా జీవించే అవకాశం లేకుండా చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్ర సమర యోధులు 1920ల నుంచే భారతీయులకు మౌలిక హక్కులతో కూడిన స్వరాజ్యం కోసం ఉద్యమించారు. భారతీయుల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ హరించే వీలులేకుండా కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని 1928లో మోతీలాల్‌ నెహ్రూ పిలుపిచ్చారు. 1936-37 మధ్య దేశంలోని 11 రాష్ట్రాలకు ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటిని సక్రమంగా పనిచేయనివ్వకుండా బ్రిటిష్‌ అధికారులు అడ్డుపడేవారు. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశానికి హక్కులతో కూడిన పాలనావ్యవస్థ ఏర్పడాలని స్వాతంత్య్ర సమర యోధులు తపించారు. ప్రభుత్వం, పార్లమెంటు, న్యాయవ్యవస్థలు పౌరుల హక్కులను హరించకుండా రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగ ముసాయిదా రూపొందించారు. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లు, హింసాకాండలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలో పౌరుల హక్కులు, పరిపాలన, విశాల ప్రజాప్రయోజనాల మధ్య సమతూకం పాటించారు. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది వంటివని రాజ్యాంగ నిర్మాణ సభ పేర్కొంది. ఆ హక్కులకు చట్టబద్ధత కల్పించారు. అంటే, తమ హక్కుల అమలుకు చట్టాన్ని ఆశ్రయించే వెసులుబాటును పౌరులకు కల్పించారు. అరుదైన సందర్భాల్లో తప్ప- ప్రాథమిక హక్కుల్లో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని 32వ రాజ్యాంగ అధికరణ స్పష్టీకరించింది. ఆ అధికరణ అత్యంత ముఖ్యమైనదని, అది లేకపోతే రాజ్యాంగానికి విలువ లేదని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఉద్ఘాటించారు. 32వ అధికరణ రాజ్యాంగానికి ఆత్మవంటిదని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులను హరించడానికి లేదా కుదించడానికి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు సైతం లేదని 13(2) అధికరణ ఢంకా బజాయించి చెబుతోంది. ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయ సమీక్షను రాజ్యాంగం అనుమతిస్తోంది.

ఆందోళనకర పరిణామాలు

ఈమధ్య కొన్ని వర్గాలు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులను ఒకే గాటన కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ వాదనకు వత్తాసుగా 1925లో మహాత్మా గాంధీ చేసిన ఒక ప్రసంగాన్ని సందర్భశుద్ధి లేకుండా ప్రస్తావిస్తున్నారు. నాటి భారతీయ సంస్థానాధీశులు ప్రజాసేవకులే తప్ప యజమానులు కారని గాంధీజీ చేసిన ప్రసంగంలోని వాక్యాలను వక్రీకరిస్తున్నారు. ఆ ప్రసంగ పాఠాన్ని ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో ప్రచురించారు. ‘భారత దేశంలోని రాజసంస్థానాల ప్రజలకు పూర్తి హక్కులు ఉండాలి. మనమంతా మన విధులను సక్రమంగా నెరవేరిస్తే హక్కులు వెన్నంటి వస్తాయి. అంతే తప్ప... విధులు నిర్వహించకుండా హక్కులు కావాలనడం వల్ల ప్రయోజనం లేదు’ అని గాంధీజీ పేర్కొన్నారు. ఆ విధంగా సంస్థానాధీశుల విధులను గుర్తు చేశారు. ‘భారత దేశం బలోపేతమై తన అభీష్టాన్ని నెరవేర్చుకునే స్థితికి ఎదగాలి. దేశం తన బలమేమిటో గ్రహిస్తే స్వీయ సంకల్పాన్ని నెరవేర్చుకోగలుగుతుంది. ప్రజా సేవకుడిగా పనిచేసే సంస్థానాధీశులను నేను సమర్థిస్తాను, సమ్మతిస్తాను. ఇక్కడ ప్రజలే అసలుసిసలు యజమానులు’ అని మహాత్ముడు ఉద్ఘాటించారు. సంస్థానాధీశులు ప్రజల పట్ల తమ విధులు, బాధ్యతలను నెరవేర్చకుండా బ్రిటిష్‌ వారి తొత్తులుగా, నిరంకుశులుగా పాలన సాగించడాన్ని నిరసిస్తూ- గాంధీజీ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించేవారు తయారయ్యారు.

ప్రాథమిక హక్కులకన్నా విధులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ధోరణులు పెరుగుతున్నాయి. నిజానికి 1950 నుంచి అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులకు చోటు లేదు. ఆత్యయిక పరిస్థితి అమలయ్యే రోజుల్లో వాటిని 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చొప్పించారు. 1976 మే నెలలో ఏఐసీసీ తీర్మానం ప్రకారం ఏర్పడిన 12 మంది సభ్యుల కమిటీ చేసిన సిఫార్సు ఫలితమే 42వ రాజ్యాంగ సవరణ. జాతి సమైక్యత, దేశ సమగ్రతలను కాపాడటానికి ప్రతి పౌరుడు ప్రాథమిక విధులను నెరవేర్చాలని సర్దార్‌ స్వరణ్‌ సింగ్‌ కమిటీ సూచించింది. దాని ప్రకారం తీసుకొచ్చిన 42వ సవరణ రాజ్యాంగ పీఠికను సైతం మార్చి ఆదేశిక సూత్రాలను అందులో పొందుపరచింది. పీఠికలో జాతి ఐక్యత అనే పదాలను జాతి ఐక్యత, దేశ సమగ్రతగా మార్చిన సవరణ అది. పదవీకాలం ముగిసినా దాన్ని మరికొంత కాలం పొడిగించుకున్న పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చిందని ఇక్కడ గమనించాలి. ఈ సవరణ తీసుకొచ్చిన మార్పుల్లో కొన్ని అవసరమైనవే కావచ్చు కానీ- మరికొన్ని అసంబద్ధమైనవి, అనాలోచితంగా తెచ్చినవేనని నాటి ‘లా కమిషన్‌’ ఛైర్మన్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అప్పటి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ప్రాథమిక హక్కులతో సమానంగా ప్రాథమిక విధులకు చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చి నిరంకుశత్వానికి దారితీస్తుంది.

ఒకే గాటన కడుతున్న వైనం

ప్రాథమిక హక్కులు, విధులను ఒకే గాటన కడితే న్యాయ సమీక్షకు అవకాశం ఉండదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను తెచ్చే అధికారం పార్లమెంటుకు దఖలుపడుతుంది. ఆ చట్టాలు దేశ ప్రయోజనాలను కాపాడటం కోసమేనని ఏలినవారు సమర్థించుకోవడానికి వీలుకలుగుతుంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం రాజద్రోహం కిందకు వస్తుందని పాలకులు మండిపడుతున్న ఈ రోజుల్లో- ప్రాథమిక హక్కులకు కత్తెర వేసే ప్రమాదం నానాటికీ పెరుగుతోంది. పౌరులు తమ ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్‌ చేసినప్పుడు మొదట ప్రాథమిక విధులను నెరవేర్చి, ఆ తరవాతే ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడాలని పాలకులు దబాయించే అవకాశం ఏర్పడుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు అగ్రాసనం వేసిందే తప్ప... విధులకు కాదు. హక్కులు, విధులను ఒకే గాటన కట్టడం నిరంకుశ పాలనకు దారితీస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రాథమిక హక్కుల కట్టడికి రాజ్యాంగం వీలుకల్పిస్తోంది. ఏదిఏమైనా ప్రాథమిక హక్కులు, విధులకు సంబంధించిన చర్చ త్వరలో సమసిపోతుందా లేక నిరంకుశ ధోరణులకు బాట వేస్తుందా అన్నది కీలక ప్రశ్న.

నిరంకుశులే ఆదర్శమా?

హిట్లర్‌, స్టాలిన్‌, ముస్సోలినీ మొదలుకొని నేటి ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌-అన్‌ వరకు నిరంకుశ పాలకులు ప్రాథమిక విధులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. తమకు అనువైనప్పుడు ప్రాథమిక హక్కులను నిరాకరిస్తారు. ప్రజలు మొదట దేశంపట్ల తమ విధులు, బాధ్యతలను నెరవేర్చాలని ఒత్తిడి చేస్తారు. తమ మాట విననివారిని అణచివేస్తారు. సోవియట్‌ యూనియన్‌ను ఆదర్శంగా తీసుకుని ఎమర్జెన్సీలో ప్రాథమిక విధులను ప్రవేశపెట్టారు. ప్రాథమిక హక్కులు, విధులు సరిసమానమని మన రాజ్యాంగం ఎక్కడా పేర్కొనలేదు. అత్యవసర సందర్భాల్లో ప్రాథమిక హక్కులకు తాత్కాలికంగా కొన్ని పరిమితులను మాత్రం విధించడానికి అవకాశమిస్తోంది. తదనుగుణంగా తరవాతి కాలంలో సుప్రీంకోర్టు తీర్పులు ప్రాథమిక హక్కులు తిరుగులేనివి కావని వ్యాఖ్యానించాయి.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి

‣ సముచిత వాటాతోనే ‘ఆమె’కు న్యాయం

‣ చిన్న పరిశ్రమల వృద్ధితోనే ఆత్మనిర్భరత

‣ మత్తు మాయలో యువత

‣ పొగబారుతున్న నగరాల ఆరోగ్యం

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి

‣ సముచిత వాటాతోనే ‘ఆమె’కు న్యాయం

‣ చిన్న పరిశ్రమల వృద్ధితోనే ఆత్మనిర్భరత

‣ మత్తు మాయలో యువత

‣ పొగబారుతున్న నగరాల ఆరోగ్యం

Posted Date: 21-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం