• facebook
  • whatsapp
  • telegram

రాజ్యం... పాలకుల ఇష్టారాజ్యం కాదు!

రాజ్యాంగాన్ని విస్మరిస్తున్న నేతాగణాలు

దేశానికి రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలనే కీలక అంగాలను సమకూర్చింది. ప్రజలు, వారికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల వ్యవహారశైలిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది.

- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

భారతదేశ పౌరులకు తాత్వికంగా, రాజకీయంగా అస్తిత్వాన్ని ప్రసాదించింది రాజ్యాంగమే. ప్రజల జీవితాలు, హక్కులు, ఆస్తిపాస్తులు, పౌరసత్వం, హోదాలకు రాజ్యాంగమే కర్త. ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థల అధికారాల పరిధిని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఈ మూడు వ్యవస్థలకు విడివిడిగా నిర్దిష్ట అధికారాలు ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి సమన్వయంగా పనిచేయాలి తప్ప- ఎవరూ ఎవరికన్నా తక్కువ, ఎక్కువ కాదు. ప్రభుత్వం, చట్టసభలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అన్నది సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఇచ్చింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఈ అంశం ఇమిడిఉంది. ఆ మౌలిక చట్రాన్ని మార్చే అధికారం చట్టసభలకు లేదు. రాజ్యాంగ నిబంధనలు, చట్టాలకు భాష్యం చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. శాసనసభలకు, పార్లమెంటుకు ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు కాబట్టి ప్రజాప్రతినిధులే సర్వోన్నతులని భావించడానికి వీల్లేదు. రాజ్యాంగం తమకు నిర్దేశించిన పరిధిలోనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ నడుచుకోవలసి ఉంటుంది.

ప్రమాణ ఉల్లంఘన

ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో సహా వివిధ తరగతుల అధికారులు, సైన్యం, న్యాయవాదులు- రాజ్యాంగానికి బద్ధులమై నడుచుకుంటామని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తామని వివిధ సందర్భాల్లో ప్రమాణం చేస్తారు. దీన్ని విస్మరించి రాజ్యాంగానికి భంగకరమైన చర్యలను ప్రోత్సహించడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇలా చేయడమంటే తాము చేసిన ప్రమాణాలను తామే ఉల్లంఘించడమే. వారు తమ ప్రమాణాలను ఉత్తుత్తి మాటలుగా పరిగణిస్తున్నారని తేలుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకోకూడదనే మౌలిక నియమాన్ని ఉల్లంఘించడమవుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు అయిన బ్రిటన్‌లో గతంలో రాజు(ప్రభుత్వం)కు, పార్లమెంటుకు మధ్య ఎవరు గొప్ప అనే సంఘర్షణ ఏర్పడింది. అప్పుడు పార్లమెంటే సర్వోన్నతమని, దానికి ప్రత్యేక హక్కులు, అధికారాలు, మినహాయింపులు ఉంటాయని నిర్ధారించారు. అప్పట్లో న్యాయమూర్తులను రాజే నియమించేవాడు కాబట్టి, ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ నడుచుకునేది. ప్రభుత్వం... అంటే రాజు చేసే నిర్ణయాలను పార్లమెంటులో సభ్యులు విమర్శిస్తే వారికి జైలుశిక్ష కానీ, మరణశిక్ష కానీ విధించేవారు. దీన్ని నివారించడానికి పార్లమెంటులో చేసే ప్రసంగాలకు శిక్షల నుంచి మినహాయింపు ఉండాలని 1523లో నాటి ఇంగ్లాండ్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌  స్పీకర్‌ సర్‌ థామస్‌ మోర్‌ డిమాండ్‌ చేశారు. తరవాత సభ్యులు సక్రమంగా ప్రవర్తించకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని పార్లమెంటు తన చేతుల్లోకి తీసుకుంది. 1770లో తెచ్చిన పార్లమెంటు ప్రత్యేకాధికారాల చట్టం పార్లమెంటులో సభ్యులు చేసే ప్రసంగాలకు జైలుశిక్ష, జరిమానాలు, ఇతర రకాల శిక్షల నుంచి రక్షణ కల్పించింది. భారతదేశానికి లిఖిత రాజ్యాంగం ఉంది. అది చట్టసభల అధికారాలు, రక్షణలు, మినహాయింపులు, ప్రత్యేక హక్కులను స్పష్టంగా నిర్వచించింది. ఈ విషయంలో 105, 118, 121, 122 రాజ్యాంగ అధికరణలు పార్లమెంటుకు, 194, 211, 212 అధికరణలు రాష్ట్రాల అసెంబ్లీలకు వర్తిస్తాయి. ముఖ్యంగా 105, 194 అధికరణలు చట్టసభల ప్రత్యేక హక్కులు, అధికారాలు, రక్షణల గురించి వివరిస్తాయి. బిల్లుల గురించి చర్చ జరిగేటప్పుడు ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఉంది తప్ప- దుర్భాషలాడే అధికారం వారికి లేదని రాజ్యాంగంలోని 194వ అధికరణ ప్రకారం స్పష్టమవుతోంది. చట్టసభలు తమకు రాజ్యాంగం ఏయే అధికారాలనైతే ఇచ్చిందో వాటినే వినియోగించుకోవాలి తప్ప తమకు ఇవ్వని అధికారాలను చలాయించకూడదు.

సమన్వయం అవసరం

పార్లమెంటు, శాసన సభల్లో నాలుగు గోడల మధ్య జరిగే చర్చల్లో తామేం మాట్లాడినా చెల్లిపోతుందనే దురభిప్రాయం ప్రజాప్రతినిధులకు ఏర్పడింది. చట్టసభలు రాజ్యాంగానికి అనుగుణంగా నిర్వహించే కార్యక్రమాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. చట్టాలు చేయడానికి తమకున్న అధికారాన్ని వినియోగించుకోవడానికి అడ్డుపడలేవు. 122వ రాజ్యాంగ అధికరణ ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. చట్టసభలు తమ రాజ్యాంగ విధులను నెరవేర్చడానికి ఏ కోర్టూ అడ్డురాలేదు. అలాగే ప్రజాప్రతినిధులూ కోర్టులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, అధికారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ ధర్మ సూక్ష్మాలు ఈనాటి ప్రజాప్రతినిధుల్లో చాలామందికి తెలియకపోవడంతో చిక్కు వస్తోంది. స్వాతంత్య్రానంతరం పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల్లో ఉద్దండులు చాలామంది ఉండేవారు. వారికి రాజ్యాంగం గురించి, చట్టాల గురించి క్షుణ్నంగా తెలుసు. ఈ తరం ప్రజాప్రతినిధులకు తొలితరంవారికున్నంత పరిణతి, విజ్ఞాన పటిమ ఉందని చెప్పలేం. కాబట్టి వారు రాజ్యాంగ సూత్రాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే, చట్టసభల్లో తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చిందని, కోర్టులు ఆ అధికారానికి అడ్డుతగలకూడదనే దురూహలో ఉన్నారు. న్యాయమూర్తుల తీర్పులను, వారి ఉద్దేశాలను తప్పుపట్టే అధికారం తమకు లేదనే సంగతి వారికి అర్థం కావడం లేదు. రాజ్యాంగం తమకు ఆ విధమైన మినహాయింపును, రక్షణను ఇవ్వడం లేదని వారు గ్రహించాలి. చట్ట సభల నిర్ణయాలు, అధికారాలపై న్యాయ సమీక్ష గురించి 2007 రాజా రామ్‌పాల్‌ కేసులో సుప్రీంకోర్టు నిర్వచించింది. రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, అధికారాలను చట్టసభలు సక్రమంగా వినియోగించుకొంటున్నంత వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవు. చట్టసభలు రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు ఆస్కారం ఏర్పడుతుంది. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం చట్టసభలు, న్యాయవ్యవస్థ, ప్రభుత్వం సమన్వయంతో నడుచుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. ప్రమాణ స్వీకారంలోని ఆంతర్యమదే. ప్రత్యేక హక్కులు, అధికారాల ముసుగులో దుర్భాషలకు దిగడానికి వీల్లేకుండా 1926లో కెనడా ఒక చట్టం తెచ్చింది. ఇతర ప్రజాస్వామ్య దేశాలు అనుసరిస్తున్న పద్ధతుల్లో మంచిని మన ప్రజా ప్రతినిధులు స్వీకరించి రాజ్యాంగబద్ధులై వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

న్యాయవ్యవస్థపై నిందలా?

ఒక చట్టం కానీ, అందులో కొన్ని భాగాలు కానీ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే- దానికి విరుద్ధంగా మళ్ళీ అదే చట్టాన్ని తీసుకొచ్చే అధికారం చట్టసభలకు లేదు. ఈ అంశాన్ని స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు సుస్పష్టం చేసింది. ప్రభుత్వం కానీ, చట్టసభలు కానీ తమ హక్కులకు భంగం కలిగించాయని ప్రజలు భావిస్తే, వారు న్యాయం కోసం కోర్టులకు వెళ్ళవచ్చు. దురదృష్టవశాత్తు చట్టసభలు, ప్రభుత్వం ఈ న్యాయపాలన సూత్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థ మీద నిందలు మోపడం, దుర్భాషలాడటం తరచూ చూస్తున్నాం. కొందరు ప్రజాప్రతినిధులైతే టీవీ తెరలపై నుంచి సంఘ విద్రోహుల ఎన్‌కౌంటర్లకు డిమాండ్‌ చేస్తున్నారు. అది న్యాయపాలనకు పూర్తి విరుద్ధం.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం