• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యామ్నాయ విద్యుత్తుతోనే భవిష్యత్తు

ఇంధన భద్రతకు మేలైన దారి

శిలాజ ఇంధనాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంవల్ల కాలుష్య తీవ్రత నానాటికీ పెరుగుతోంది. దాంతో ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి సూర్యరశ్మి, గాలి మొదలైన పునరుత్పాదక ఇంధన వనరుల పైకి మళ్ళింది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ కేంద్రాల సామర్థ్యం 1990ల్లో 18 మెగావాట్లతో ప్రారంభమై- 2021 ఫిబ్రవరి మాసాంతానికి 92,551 మెగావాట్లకు చేరుకుంది. భారీ జల విద్యుత్‌ ఉత్పత్తిని మినహాయిస్తే ప్రస్తుతం మొత్తం ఉత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్‌ భాగస్వామ్యం 11శాతం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడచిన అయిదేళ్లలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం రెట్టింపయింది. సౌర విద్యుదుత్పత్తి అయిదున్నర రెట్లు అభివృద్ధి చెంది అగ్రభాగాన నిలిచింది.

నిర్మాణాత్మక విధానాలు

కేంద్ర ప్రభుత్వం 2010లోనే జాతీయ సోలార్‌ మిషన్‌ను రూపొందించింది. 2022 కల్లా లక్షా 75 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెద్దయెత్తున సౌరవిద్యుత్‌ పార్కులు స్థాపించాలని- భూమి కొరత ఉన్న చోట్ల పంట కాలువలు, గట్లపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 వేల మెగావాట్ల కేంద్రాలను నెలకొల్పాలని నిర్దేశించారు. డీజిల్‌, సంప్రదాయ విద్యుత్తుతో నడుస్తున్న 27లక్షల వ్యవసాయ పంపుసెట్లను, సౌర విద్యుత్తులోకి మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భవనాల కప్పులపై నాలుగు వేల మెగావాట్ల చిన్న కేంద్రాలను స్థాపించారు. రాష్ట్రాల మధ్య హరిత విద్యుత్తు సరఫరా, సౌర విద్యుత్‌ పలకల ధరలు తగ్గడం, భారతీయ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ద్వారా 75శాతం స్థాపిత పెట్టుబడిని తక్కువ వడ్డీకే అందజేయడం లాంటి విధానాలు సౌర విద్యుత్తు కేంద్రాల స్థాపనకు ఊతమిచ్చాయి. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు తప్పనిసరిగా కొంతమేర హరిత విద్యుత్తు వాడుకోవాలనే నిబంధన విధించడంతో- అనేక సంస్థలు, సులభంగా స్థాపించే అవకాశం ఉన్న సౌర విద్యుత్‌వైపు మొగ్గు చూపాయి. ఒకప్పుడు సౌర విద్యుత్‌ యూనిట్‌ ధర పది రూపాయలకంటే ఎక్కువ. నేడది రూ.2.50కే లభించడం ఈ రంగంలో సాధించిన ఘన విజయానికి తార్కాణం.

పవన విద్యుదుత్పత్తిలో సింహభాగం (77శాతం) భూ ఉపరితలంపై ఎక్కువగా గాలులు వీచే అయిదు రాష్ట్రాలదే. తాజా గణాంకాల ప్రకారం తమిళనాడులో 9,285 మెగావాట్లు, మహారాష్ట్రలో 7,359, కర్ణాటకలో 4,743, రాజస్థాన్‌లో 4,299, ఆంధ్రప్రదేశ్‌లో 4,084 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే యూనిట్ల ఏర్పాటుపై దృష్టి పెరుగుతోంది. ప్రస్తుతం 128 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తవుతోంది. దేశానికి సుమారు 7,600 కిలోమీటర్ల సముద్రతీరం ఉండటంవల్ల పవన విద్యుత్‌ ఉత్పత్తికి భారీ అవకాశాలున్నాయి. గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లోనే 70 వేల మెగావాట్లకు పైబడి విద్యుదుత్పత్తి చేయవచ్చు. 2022కల్లా అయిదు వేల మెగావాట్లు, 2030 నాటికి 30 వేల మెగావాట్లు సముద్ర తీర పవన విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వాల లక్ష్యం.

కొత్త ఆవిష్కరణలు అవసరం

వ్యవసాయ పంటలో మిగిలిన అవశేషాలు, ధాన్యాల పొట్టు, ఎండిపోయిన చెట్ల కలప కాల్చి విద్యుదుత్పత్తి చేసే విధానంలో 18 వేల మెగావాట్ల బయోమాస్‌ ప్లాంట్లకు అవకాశం ఉంది. చెరకు పరిశ్రమలలో వెలువడే కుళ్లిన ద్రవాల ద్వారా మరో ఎనిమిది వేల మెగావాట్ల బయోగ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటుచేయవచ్చు. ఇప్పటివరకు 512 బయో ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా (ప్రధానంగా తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌ బంగ, పంజాబ్‌) 10,146 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. నగరాలు, పరిశ్రమల నుంచి వెలువడే చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తికి 2,554 మెగావాట్లకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 168 మెగావాట్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. జంతువుల పేడ, ఇంటి నుంచి వెలువడే ఆహార వ్యర్థాలు తదితరాలతో 316 బయోగ్యాస్‌ కేంద్రాలను ఇప్పటికే స్థాపించారు.

విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులు భరించలేని స్థాయికి చేరి ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో ముడి చమురు ఉత్పత్తికి అవకాశం లేకపోవడం, మొత్తంగా విదేశాలపై ఆధారపడటం వల్ల, మార్కెట్‌ హెచ్చుతగ్గులను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. సంవత్సరానికి సుమారు రూ.7.65 లక్షల కోట్ల విదేశ మారక ద్రవ్యం కోల్పోవాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలి. అప్పుడే ఆ మేరకు ఇంధన భద్రత సాధించడంతో పాటు, వాతావరణ కాలుష్యాన్నీ కొంతవరకైనా నియంత్రించినట్లవుతుంది.

 

- ఇనుగుర్తి శ్రీనివాసాచారి

(విద్యుత్‌, ఇంధన రంగ నిపుణులు)

Posted Date: 08-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం