• facebook
  • whatsapp
  • telegram

ఆదాయం కోసం సరికొత్త వ్యూహాలు

రైల్వే అధిగమించాల్సిన అవరోధాలు

ఆదాయంకన్నా ఖర్చులు అధికమై రైల్వేశాఖ పోనుపోను ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోతోంది. ఏటా బడ్జెట్‌ కేటాయింపులపైనే ఆధారపడి బండి నెట్టుకురావలసి వస్తోంది. ఇలాంటి సంక్లిష్ట స్థితి నుంచి బయటపడేందుకు, లాభాల బాట పట్టేందుకు మౌలిక వసతుల ఆధునికీకరణతోపాటు, ఆదాయం పెంచుకొనేందుకు సరికొత్త మార్గాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇంతకాలం సరకులను భారీ పరిమాణంలో రవాణా చేయడానికి ప్రాధాన్యమిస్తూ వచ్చిన రైల్వే- ఇక నుంచి చిన్న పరిమాణాల్లోనూ సరకు రవాణా చేయడంపై దృష్టి పెట్టాలని ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఆ దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

నిధులు అవసరం

గడచిన నాలుగు దశాబ్దాల్లో రైల్వే శాఖ బొగ్గు, సిమెంటు, ఎరువులు, ధాన్యం, పెట్రోలియం ఉత్పత్తులు, పరిశ్రమలకు కావలసిన ముడి సరకులను భారీయెత్తున రవాణా చేస్తూ వచ్చింది. దీన్ని బల్క్‌ రవాణా అంటారు. బొగ్గు, సిమెంటు వంటి భారీ సరకులను గనుల నుంచి పరిశ్రమల నుంచి సేకరించి నేరుగా మార్కెట్‌కు చేర్చే విధంగా రైల్వే మార్గాల్ని సైతం నిర్మించారు. రైల్వే రవాణాలో 49 శాతాన్ని బొగ్గు ఆక్రమిస్తోంది. 1960లలో సరకుల రవాణాకు గిరాకీ పెరగడంతో రైల్వే శాఖ ఎనిమిది చక్రాల వ్యాగన్లను రంగంలోకి దించి బల్క్‌ రవాణాను విస్తరించింది. చిన్న పరిమాణాల్లో (నాన్‌బల్క్‌) సరకుల రవాణాకు పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు. భారీ సరకుల రవాణాకన్నా చిన్న పరిమాణాల్లో సరకు రవాణా రెండింతలు లాభదాయకం. ఇలాంటి సరకుల రవాణా ఎక్కువగా రైలుమార్గంపై కాకుండా రహదారి వ్యవస్థపై ఆధారపడింది. 10-12 టన్నుల ట్రక్కుల్లో చిన్నపరిమాణాల్లో సరకు రవాణా చేయడం ఖాతాదారులకు సౌలభ్యంగా ఉంటుంది. 2051కల్లా రైల్వే రవాణాలో భారీసరకుల వాటా తగ్గుతుందని, చిన్న పరిమాణాల్లో రవాణాతోపాటు, ఎగుమతి-దిగుమతి కంటైనర్ల వాటా పెరుగుతుందని 2020 జాతీయ రైల్‌ ప్రణాళిక అంచనా వేసింది. తాను చేపట్టిన భారీ ఆధునికీకరణ కార్యక్రమానికి నిధుల అవసరం దృష్ట్యా- రైల్వే శాఖ క్రమంగా చిన్న పరిమాణాల్లో సరకుల రవాణాకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ప్రయాణికుల ఛార్జీలను పెంచి అదనపు ఆదాయం ఆర్జించడం రాజకీయంగా ప్రభావం చూపుతుంది. అందుకని, రైల్వేశాఖ సరకు రవాణాపైనే ఎక్కువగా ఆధారపడక తప్పదు. ఈ రంగంలో పనితీరు మెరుగు పరచుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. నేడు సరకుల రవాణాలో రైల్వే వాటా కేవలం 26 శాతం మాత్రమే. మిగతా 74 శాతంలో అత్యధిక భాగం రోడ్డు రవాణాయే ఆక్రమిస్తోంది.

వ్యవసాయోత్పత్తుల రవాణాకు కిసాన్‌ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి మరో మార్గాన్ని రైల్వేశాఖ వెదికింది. త్వరగా చెడిపోయే పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులు, మాంసం, చేపలు, కోడి మాంసం తదితరాలను- శీతలీకరించిన వ్యాగన్లలో రవాణా చేయడం కిసాన్‌ రైలు ప్రత్యేకత. 2020లో ఈ తరహా రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 7.87 లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తులను కిసాన్‌ రైళ్లలో రవాణా చేశారు. సరకుల ట్రక్కులను నేరుగా రైలు వ్యాగన్లలోకి ఎక్కించి గమ్యానికి చేర్చే ‘రోల్‌ ఆన్‌ రోల్‌ ఆఫ్‌’ సర్వీసులను భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా చేపట్టింది. వినియోగదారుల వస్తువులను భద్రంగా, శీఘ్రంగా రవాణా చేయడానికి ఉపయోగకరమైన సర్వీసు ఇది. సరకు రవాణా రైళ్ల వేగాన్ని పెంచడమూ చిన్నపరిమాణాల సరకు రవాణాలో కీలకమే. అందుకే రాగల 20 ఏళ్లలో గూడ్స్‌ రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచాలని జాతీయ రైలు ప్రణాళిక ప్రతిపాదించింది. చిన్న పరిమాణాల సరకుల రవాణాకు ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తే ప్రైవేటు పెట్టుబడులను సులువుగా ఆకర్షించవచ్చు. చిన్న పరిమాణాల సరకుల రవాణాకు భారత కంటైనర్‌ కార్పొరేషన్‌ను రైల్వే శాఖ అనుమతించింది. కంటైనర్‌ రవాణాలో ప్రైవేటు ఆపరేటర్లకూ చోటు కల్పించింది. అయితే, కంటైనర్లలో చిన్నపరిమాణాల్లో ఉండే సరకుల రవాణా ఇప్పటికీ ఖరీదైన వ్యవహారంగానే ఉంది. చిన్న పరిమాణాల్లో సరకుల రవాణాకు కావలసిన సౌకర్యాలను సమకూర్చుకోవడానికి రైల్వేశాఖ సంసిద్ధమవుతోంది. డబుల్‌ డెకర్‌ బస్సుల తరహాలో ప్రత్యేక తరహా కంటైనర్లను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఎగుమతి, దిగుమతి వస్తు రవాణాకు ఈ కంటైనర్లు ఎంతో అనువైనవి. ఇప్పటికే ప్రత్యేక కంటైనర్లలో కార్లు, మోటారు సైకిళ్ల రవాణాకూ రైల్వేశాఖ సిద్ధమైంది. 2013-14లో 429 రైళ్లలో మోటారు వాహనాలు రవాణా కాగా, 2019-20 కల్లా వాటి సంఖ్య 1,595కు పెరిగింది. 2021-22లో 3,334 రైళ్లలో మోటారు వాహనాలు రవాణా అయ్యాయి.

కార్యాచరణ కీలకం

చిన్నపరిమాణాల్లో సరకులు భారీస్థాయిలో కాకుండా చిన్న చిన్న పార్సిళ్ల రూపంలో వస్తాయి. వాటిలో నిర్ణీత కాలంలో గమ్యానికి చేర్చకపోతే త్వరగా చెడిపోయే, రవాణాలో దెబ్బతినే వస్తువులూ ఉంటాయి. పార్సిళ్లను రైలు స్టేషన్లలో చెల్లాచెదురుగా పడేయడం ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుంది. ఈ తరహా సరకుల లోడింగ్‌, అన్‌ లోడింగ్‌కు రైల్వే స్టేషన్లలోనే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. సరకుల తరలింపునకు వాహనాలు సులువుగా వచ్చిపోయే వెసులుబాటు కల్పించాలి. మొత్తం మీద వివిధ రకాల ప్రతిపాదనలు, వాటిపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నా- రైల్వే శాఖ మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకుసాగాలి. ఎలాంటి ఏర్పాట్లను ముందుగా చేపట్టాలి, వేటిని తదుపరి దశలో చేపట్టాలనేది నిర్ణయించుకోవాలి. చిన్నపరిమాణాల్లోని సరకుల రవాణాకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఒకే ఛత్రం కింద వినియోగదారులకు సకల సౌకర్యాలను వేగంగా అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆధునికీకరణ పంథాలో దూసుకెళ్ళాలని రైల్వే శాఖ సంకల్పిస్తుండటం స్వాగతించదగింది. ఎలాంటి సరికొత్త వ్యూహాలకైనా పకడ్బందీ కార్యాచరణ తోడైతేనే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.

అంకురాలకు  ఆహ్వానం

కార్యనిర్వహణలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించి, వేగంగా ఆధునికీకరణను సాధించడానికి రైల్వే శాఖ- అంకుర సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నూతన విధానాన్ని ఇటీవలే ప్రకటించారు.

తొలి విడత కింద 100 సమస్యలకు అంకురాల నుంచి పరిష్కారాలను కోరుతోంది. వినూత్న ప్రతిపాదనలతో ముందుకొచ్చిన సంస్థలను ఎంపిక చేసి, ఆ ప్రతిపాదనలకు కార్యరూపం కల్పించేందుకు రూ.1.50 కోట్ల మూలధనం సమకూరుస్తారు. సమస్య, పరిష్కార ఆవిష్కారం అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

అంకురాలు రూపొందించిన నమూనాల్లో రైల్వే శాఖ ఎంపిక చేసినవాటికి మూడు కోట్ల రూపాయల మేరకు అదనపు నిధులు కేటాయిస్తారు. విజయవంతమైన నమూనాల ఆవిష్కర్తలకు మేధా హక్కులు కల్పిస్తారు.

 

- వరప్రసాద్‌
 

Posted Date: 23-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం