• facebook
  • whatsapp
  • telegram

అట్టడుగునే ఆదివాసులు!

పీసా చట్టానికి పాతికేళ్లు

పల్లెల్లో గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చినట్లని మహాత్మా గాంధీ అనేవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఎన్నికయ్యాయి. నిరుడు తెలంగాణలో పంచాయతీ పాలక వర్గాలు కొలువుతీరాయి. గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయడంలో ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘకాలంగా విఫలమవుతూనే ఉన్నాయి.  కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌- షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం-1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయనే చెప్పాలి.

గ్రామసభల స్ఫూర్తికి తూట్లు

పంచాయతీ రాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు పెద్దయెత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని (పంచాయతీ రాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణ చట్టం) ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి. జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. విద్యా, వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఆవాసాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన; గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసుకోవాలి.

మహోన్నత లక్ష్యాలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని అశ్రద్ధ కనబరుస్తున్నాయి. చట్ట నియమాల రూపకల్పనలో ఏళ్ల తరబడి కాలయాపనవల్ల అసలు లక్ష్యం పూర్తిగా నీరుగారింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996లో చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల అనంతరం అంటే 2011లో సంబంధిత నియమ నిబంధనలు రూపొందించింది. ఆ నియమాలు వచ్చిన రెండేళ్ల తరవాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ- జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘పీసా’ అమలు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు. చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు అవుతున్నా ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటివరకు చట్ట నిబంధనలను రూపొందించుకోలేదు. గుజరాత్‌లో అక్కడి అయిదో షెడ్యూలు ప్రాంతాల్లోనూ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమలుచేస్తున్నారు. ‘పీసా’ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించుకోవడంతో దాని అమలు తీరే మారిపోయే దుస్థితి దాపురించింది. షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యేవారికి నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఆ నిబంధనను అనేక రాష్ట్రాలు తమ ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామ సభల హక్కులను నిర్వీర్యం చేశాయి. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం... ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు తీసుకువచ్చి గ్రామసభల ఉనికినే అపహాస్యం చేస్తున్నాయి.

హక్కులతోనే వికాసం

దేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లోనే వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉంది. అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి, వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడం ఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి. గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనం; రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ; భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు- ‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి. పీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు. దీంతో రాజ్యాంగ రక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి. పీసాతో సహా ఇతర గిరిజన రక్షణ చట్టాలు, సంబంధిత నిబంధనలపై శిక్షణ, అవగాహన పెంచే బాధ్యత, అమలు తీరును పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది, తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి. పీసా చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంలోనైనా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పంచాయతీ పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి. మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చి పీసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది!

Posted Date: 01-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం