• facebook
  • whatsapp
  • telegram

తొలగని ఆర్థిక అంధకారం

నష్టాలతో విద్యుత్‌ సంస్థలు విలవిల

భారత విద్యుత్‌ రంగంలో ఆర్థిక అంధకారం రాజ్యమేలుతోంది. దేశంలో ప్రతీ గ్రామానికి కరెంటు సరఫరా లక్ష్యాన్ని సాధించామంటూ కేంద్రం ఘనంగా చాటుతోంది. కానీ, 90శాతం విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా విలవిల్లాడుతున్నాయి. ప్రజలకు కరెంటు సరఫరా చేసి బిల్లులు వసూలు చేసుకునే ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)’ల నష్టాలు రూ.50 వేల కోట్లను దాటాయి. ఇవి ప్రజలకు సరఫరా చేసే కరెంటును విద్యుదుత్పత్తి కేంద్రా(జెన్‌కో)ల నుంచి కొనాలి. అలా కొన్నందుకు జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ సంస్థల పుట్టి మునిగే పరిస్థితి ఉందనే సాకులు చూపుతూ వాటిని ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం అన్నిరకాలుగా నిబంధనల చట్రంలో బిగిస్తూ విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు సిద్ధం చేసింది.

బాధ్యత ఎవరిది?

దేశంలో డిస్కమ్‌ల నష్టాలకు బాధ్యులెవరనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. ఎన్ని నిబంధనలు తెచ్చినా, లక్షల కోట్ల రూపాయల రాయితీలిచ్చినా, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నా- విద్యుత్‌ సంస్థల ఆదాయం మాత్రం పెరగడం లేదు. రెండు దశాబ్దాల క్రితం వార్షిక సగటు వాణిజ్య, సాంకేతిక (ఏటీసీ) నష్టాలు జాతీయస్థాయిలో 21.9శాతంగా ఉండేవి. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచే సంస్కరణల్లో భాగంగా మొత్తం ఎనిమిది రకాల పథకాలను కేంద్రం అమలుచేసింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే- కరెంటు కొనుగోలు, అమ్మకాల్లో పూర్తి పారదర్శకత సాధించడం. కానీ, ఏటీసీ నష్టాలు ప్రస్తుతం 20.9శాతంగా ఉన్నాయి. అంటే ఈ పథకాలు ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రాంతాలవారీగా చూస్తే నష్టాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలోనే 35శాతం నుంచి 39శాతం నష్టాలున్న డివిజన్లు మూడు ఉన్నాయి. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ తదితర వెనకబడిన రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సరఫరా చేసే కరెంటులో 50శాతం వరకు ఎటు పోతోందో తెలియడం లేదు. గడచిన మూడేళ్ల(2018-21)లో తెలుగు రాష్ట్రాల డిస్కమ్‌ల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం(లోటు) రూ.35 వేల కోట్లుగా తేలింది. కరెంటు ఛార్జీలు పెంచకపోతే ఈ రెండు రాష్ట్రాల్లోని నాలుగు డిస్కమ్‌ల నష్టాలు రానున్న రెండేళ్లలో రూ.50 వేల కోట్లను దాటిపోతాయని అధికారిక గణాంకాలే చాటుతున్నాయి. నష్టాలు, బకాయిల విషయంలో ఒక్కో రాష్ట్ర డిస్కమ్‌ల తీరు ఒక్కో రకంగా ఉంది. ప్రజలకు సరఫరా చేసే విద్యుత్తులో 20శాతం నుంచి 39శాతం ఎటు పోతోందో తెలియకపోతే- నష్టాలను తప్పించుకోవడం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి ప్రతి త్రైమాసికానికి ఇంధన ఆడిట్‌ నిర్వహించి ఎంత కరెంటు కొన్నారు, ఎక్కడ సరఫరా చేశారు, ఎంత బిల్లు వసూలు చేశారనే లెక్కలు పక్కాగా చెప్పాలని కేంద్రం ఉత్తర్వులివ్వడంతో డిస్కమ్‌ల పనితీరులో డొల్లతనం బయటపడుతోంది. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సరఫరా చేసే ప్రతి యూనిట్‌కు సగటు వ్యయం రూ.7.24 అవుతున్నా రూ.6.50కి మించి తిరిగి రావడం లేదు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల డిస్కమ్‌లకు రూ.15 వేల కోట్లకు పైగా నష్టాలు వస్తాయని చెబుతూ- వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్‌) నుంచి కరెంటు ఛార్జీలు పెంచబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదికి భారీగా రూ.7,500 కోట్ల మేర ఛార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ఇటీవల ప్రతిపాదనలిచ్చాయి.

సంస్కరణలే శరణ్యం

కరెంటు ఛార్జీల పెంపులో అన్ని రాష్ట్రాల మధ్య ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు నెలకు వంద యూనిట్ల కరెంటు వాడుకున్న ఇంటి నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడులో ఒక్కో యూనిట్‌కు కేవలం రూపాయిన్నర చొప్పున ఛార్జీని వసూలు చేస్తుంటే- వెనకబడిన రాష్ట్రం రాజస్థాన్‌ రూ.6.78 చొప్పున రాబడుతోంది. దేశంలో ఎవరి ఇంటికైనా ఇచ్చే కరెంటు ఒకటే అయినప్పుడు, రాష్ట్రాలవారీగా పేదరికంలో మగ్గుతున్న వారి కష్టాల్లో తేడా లేనప్పుడు... కరెంటు ఛార్జీల్లో మాత్రం ఇంత వ్యత్యాసం ఎందుకుంటోంది? ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ ఛార్జీలను పెంచే ఆలోచన కూడా చేయవు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తమకు అధికారమిస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్తును ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ తాజాగా హామీ ఇచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో డిస్కమ్‌లు నిబంధనల ప్రకారం ఏటా ఛార్జీల సవరణ ప్రతిపాదనలు ఇవ్వడం లేదని, ఇకనుంచి ఆలస్యం చేస్తే భారీ జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ మండళ్లు కఠినంగా వ్యవహరిస్తేనే డిస్కమ్‌లు బాగుపడతాయి. అంతర్గత పనితీరును మెరుగు పరచుకొనేందుకు డిస్కమ్‌ల యాజమాన్యాలు శ్రద్ధ చూపాలి. ఏటీసీ నష్టాలు తగ్గకపోతే జీతాలు పెంచేది లేదని హెచ్చరిస్తేనే డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుంది. విద్యుత్‌ చౌర్యాన్ని పూర్తిగా అరికట్టి, ఏటీసీ నష్టాలను బాగా తగ్గిస్తే కరెంటు ఛార్జీలు పెంచకుండానే డిస్కమ్‌లన్నీ లాభాల్లోకి వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 700 కోట్ల యూనిట్ల విద్యుత్తును పంపిణీ, సరఫరాల ప్రక్రియల్లో నష్టపోతున్నారు. వీటికి యూనిట్‌కు రూ.7.14 చొప్పున లెక్కిస్తే అయిదు వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా పెరుగుతుంది. అప్పుడు ఈ రాష్ట్రాల డిస్కమ్‌లకు కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరమే ఉండదు. అంతర్గత పనితీరును మెరుగుపరచుకొని పారదర్శకత, సంస్కరణలు తెస్తే లాభాలొచ్చి ప్రజలపై ఛార్జీల భారం పడదు. అవేమీ చేయకుండా నష్టాల్లో మునుగుతూ ఛార్జీలు పెంచుకుంటామంటే ఏదో ఒకరోజు కేంద్రం డిస్కమ్‌లను పూర్తిగా ప్రైవేటీకరించడం తథ్యమని అందరూ గుర్తించాలి.

రాష్ట్రాల పెత్తనంతో కష్టాలు

భారత విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం స్వతంత్ర వాణిజ్య కంపెనీలుగా పనిచేయాల్సిన డిస్కమ్‌లపై రాష్ట్రాల పెత్తనమే సాగుతున్నందువల్ల వాటి ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఈ సంస్థలను ఆర్థికంగా మెరుగుపరుస్తామంటూ 2016లో కేంద్రం తెచ్చిన ‘ఉజ్జ్వల్‌ డిస్కం హామీ యోజన (ఉదయ్‌)’ పథకం విఫలమైంది. ఆ పథకం ప్రకారం 2020కల్లా ప్రతీ యూనిట్‌ సరఫరాకయ్యే వ్యయాన్ని పూర్తిగా వసూలు చేయాలి. కానీ ఇప్పటికీ ఒక యూనిట్‌ కరెంటు సరఫరాపై సగటున జాతీయస్థాయిలో 30 పైసల దాకా నష్టం వస్తున్నందువల్లే డిస్కమ్‌లు నష్టాల్లో ఉన్నాయని తాజాగా పార్లమెంటులోనే కేంద్రం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నష్టం సగటున యూనిట్‌కు 70 పైసలు. తమ ఆర్థిక కష్టాలు స్వయంకృతాపరాధమేనని అంగీకరించకుండా- డిస్కమ్‌లు, వాటిపై పెత్తనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు ఛార్జీలు పెంచుతున్నాయి.

 

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 06-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం