• facebook
  • whatsapp
  • telegram

నదులు కలిస్తేనే జలకళ

అనుసంధానంపై కేంద్రం కసరత్తు

ఉత్తర భారతదేశంలోని నదులను దక్షిణాది నదులతో అనుసంధానించాలనే ఆలోచనకు ఇప్పుడు- మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యం ఉంది. భారత్‌లో ఏటికేడు నీటి ఎద్దడి పెరుగుతోంది. వేసవికాలాల్లో కరవు పరిస్థితులు మరింతగా విజృంభిస్తున్నాయి. దేశంలోని మూడొంతుల జనాభా నేడు క్షామ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, పంజాబ్‌, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రంగా ఉంది.

ఒక అంచనా ప్రకారం దేశంలోని సుమారు పది రాష్ట్రాల్లోని 254 జిల్లాల్లో క్షామం తాండవిస్తోంది. ఆయా జిల్లాల్లో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవి కాలంలో ప్రచండ భానుడి ప్రతాపానికి నీటివనరులెన్నో ఎండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉపరితల నీటిని విపరీతంగా వినియోగించడం, భూగర్భ జలాలనూ అపరిమితంగా తోడేయడం, భూమిలోకి నీరు ఇంకే చర్యల పట్ల నిర్లక్ష్యం వంటివి తీవ్రమైన నీటి సంక్షోభానికి దారి తీస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండటంతో నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. ఒక అధ్యయనం ప్రకారం... అపరిమిత నీటివాడకంవల్ల 2050 నాటికి ఇప్పుడున్న నీటి వనరుల్లో 79శాతం కనుమరుగు కానున్నాయి. ఈ తరహా పరిస్థితులవల్ల మొత్తంగా పర్యావరణానికే తీవ్రహాని కలుగుతుంది. దేశవ్యాప్తంగా 91 పెద్ద జలాశయాల సామర్థ్యం 157 వందల కోట్లకు పైగా ఘనపు మీటర్లు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం... గత సంవత్సరం ఏప్రిల్‌ 13 నాటికి వాటిలో 35  వందల కోట్లకు పైగా ఘనపు మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంతకుముందు సంవత్సరం కంటే ఇది చాలా తక్కువ. మరో నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలోని 40శాతం బావుల్లో నీళ్లు అడుగంటడమో లేదా ఆ బావులు ఎండిపోవడమో జరిగింది.  

వేసవిలో తీవ్ర నీటిఎద్దడితో సతమతమవుతున్న రాష్ట్రాలకు నదుల అనుసంధానం ద్వారా హిమాలయాల్లోని హిమానీ నదాల నీటిని అందించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. నదుల అనుసంధానంవల్ల వరదలను సమర్థంగా నియంత్రించవచ్చు. భూగర్భ జలాలను రీఛార్జ్‌ చేయవచ్చు. కరవు ప్రాంతాలకు సాగునీటిని అందించవచ్చు. నదుల అనుసంధానానికి సంబంధించిన భారీ ప్రాజెక్టులో తొలి భాగంగా కేంద్ర నీటి వనరుల మంత్రిత్వ శాఖ (ఎన్‌డబ్ల్యూడీఏ) హిమాలయ ప్రాంతానికి చెందిన 14 చిన్న నీటివనరుల అనుసంధానంపై సమగ్ర నివేదికను తయారు చేసింది. ప్రాజెక్టులో రెండు, మూడు దశల్లో ఉపఖండంలోని 53 అనుసంధాన ప్రాజెక్టులను చేపడతారు. నదుల అనుసంధాన యోచన మొదలైనప్పటి నుంచి ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటివరకు హిమానీ నదాలు, దక్షిణాది నదులను కలిపే దిశగా సాధ్యాసాధ్యాలకు సంబంధించిన సుమారు 50 నివేదికలను తయారు చేసింది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చే ఆశావహ పరిస్థితులు చోటు చేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
నదుల అనుసంధానం ద్వారా ఒనగూడే పలు సామాజిక, ఆర్థిక ప్రయోజనాల గురించి నిపుణులు ఇప్పటికే కొన్ని అంచనాలు సిద్ధం చేశారు. వరద నియంత్రణ, సాగునీటిని కరవు ప్రాంతాల్లోని భూములకు విస్తరించడంవంటి చర్యలతో పాటు- ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించేందుకూ ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందంటున్నారు.

మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే- దేశవ్యాప్తంగా నీటి మార్గంలో రవాణాకు అవకాశం ఏర్పడటం. ఉత్తరాది నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాలకు నీటిని తరలించాలనే భావన కొత్తదేమీ కాదు. 1970లో అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్‌ కేఎల్‌ రావు తొలుత ఈ దిశగా యోచించారు. ఉత్తరాదిలో తరచూ వరదల బీభత్సం పడమట, దక్షిణాన క్షామ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ ఇంజినీరు ఆర్థర్‌ కాటన్‌ సైతం ఉత్తరాది నదీ జలాలను దేశంలోని మిగతా ప్రాంతాలకు తరలించాలని యోచించారు. డాక్టర్‌ కేఎల్‌ రావు ఉత్తరాన హిమాలయ ప్రాంతంలోని గంగా బేసిన్‌ను బ్రహ్మపుత్ర నదిని అనుసంధానించేందుకు ఒక ప్రణాళికనూ సిద్ధం చేశారు. నీటి సంక్షోభం ఒక్క ఇండియాకే పరిమితం కాలేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్రమైన నీటి కరవును ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే- భారత్‌తో పాటు 54 దేశాలు 2050 సంవత్సరానికల్లా అతి తీవ్రమైన నీటి సంక్షోభం పాలబడక తప్పదు!

- ఆర్‌.పి.నైల్వాల్‌

(ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)

Posted Date: 05-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం