• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ విలువల పరిరక్షణే సర్వోన్నతం

అలక్ష్యానికి అడ్డుకట్ట అత్యవసరం

 

 

చట్టబద్ధ పాలన భారత రాజ్యాంగ మౌలిక సూత్రం. దాని పరిరక్షణలో న్యాయస్థానాల పాత్ర కీలకం. ఆ మేరకు కోర్టులు వెలువరిస్తున్న తీర్పులు చాలా సందర్భాల్లో అలక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా అందరికీ సమాన న్యాయం అందాలన్న లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఈ పరిణామాలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

 

చట్టబద్ధ పాలన కీలక రాజ్యాంగ ప్రమాణం. దాన్ని ఎవరూ ఉల్లంఘించే వీలు లేదు. మార్పుచేర్పులూ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధ పాలనను విడనాడకూడదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తరవాతా అనేక తీర్పుల్లో అదే అంశాన్ని పునరుద్ఘాటించింది. చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నప్పుడే దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చినట్లు అని    జాతిపిత మహాత్మా గాంధీ పేర్కొన్నారు. చట్టబద్ధ పాలన అంటే చట్టం ముందు అందరూ సమానులే అని, కుల, మత, జాతి, హోదా, ప్రాంతం, వర్గ భేదాలు లేకుండా పౌరులందరికీ చట్టం సమానంగా వర్తిస్తుందని అర్థం. ఈ సమానతా సూత్రమే భారత స్వాతంత్య్ర ఉద్యమంలోకి ప్రజలందరినీ ఆకర్షించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక చట్టబద్ధ పాలనకు పట్టం కట్టడం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన పరిణామమే. పరిపాలన అంటే రాజ్యాంగ విలువలు, చట్టాల ఆధారంగా సాగడం. అదే చట్టబద్ధ పాలన లక్షణం. అధికారంలో ఉన్నవారి ఇష్టాయిష్టాలు, చపలచిత్త ధోరణులను అనుసరించి కాకుండా నియమబద్ధ పరిపాలనకు భరోసా ఇచ్చేదే చట్టబద్ధ పాలన.

 

న్యాయ స్ఫూర్తికి తూట్లు

సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు దేశంలోని న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమని 141వ రాజ్యాంగ అధికరణ పేర్కొంటోంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల వంటి రాజ్యాంగ న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు రూపొందించే కొత్త చట్టపరమైన సూత్రాలు క్రమంగా చట్టబద్ధ పాలనలో అంతర్భాగమవుతాయి. కోర్టులు తమ తీర్పులను తామే అమలు చేయలేవు కాబట్టి, ఆ బాధ్యతను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్వహించక తప్పదు. ఆచరణలో కోర్టు తీర్పులను ఉల్లంఘించడం ఎక్కువవుతోంది. సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ సెక్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసినా, పోలీసులు రద్దయిన ఆ సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. దీనికి శ్రేయా సింఘాల్‌ కేసు ఒక ఉదాహరణ. భారత నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ)లోని 170వ సెక్షన్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన భాష్యానికి విరుద్ధంగా, విచక్షణా రహితంగా పోలీసులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. చట్టబద్ధ పాలన స్ఫూర్తికి వ్యతిరేకంగా విచారణ న్యాయస్థానాలు ఇటువంటి అక్రమ అరెస్టులకు ఆమోదముద్ర వేయడం అవాంఛనీయ పరిణామం. సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ సెక్షన్‌ పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే సందేశాలన్నింటినీ ఒకే గాటన కడుతూ, అవి హానికరమని వర్ణిస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. శ్రేయా సింఘాల్‌ కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. నిందితులను జైలుకు పంపితీరాలనే నియమం ఎక్కడా లేదని, వారికి బెయిలు ఇవ్వాలని పలు సందర్భాల్లో సుప్రీం స్పష్టం చేసింది. అయినా పోలీసులు, విచారణ న్యాయస్థానాలు సుప్రీం ఆదేశాలను పట్టించుకోకపోవడంతో అరెస్టులు, జైలు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సీఆర్పీసీ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల మళ్ళీ స్పష్టం చేసింది. అయినా, పోలీసులు, విచారణ న్యాయస్థానాలు, ప్రముఖులు చట్ట స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకొనే ఆశకు ఆస్కారం లేకుండా పోతోంది. పరమానంద్‌ కటారా కేసులో సుప్రీం తీర్పును ఇక్కడ ఉదహరించాలి. ప్రమాదానికి గురైన వ్యక్తికి చికిత్స చేయడానికి నిరాకరించడం వైద్య వృత్తి స్ఫూర్తికి, విలువలకు విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నా, దాన్ని ఎవరూ గౌరవించడం లేదు. తన వైద్య రికార్డులను డిమాండ్‌ చేసి, వాటి ప్రతులను సంపాదించే హక్కు రోగులకు ఉందని పలు హైకోర్టులు తీర్పులు వెలువరించినా- ఆచరణలో రోగుల హక్కులు నిరాకరణకు గురవుతూనే ఉన్నాయి.

 

రాజద్రోహానికి వక్రభాష్యం

ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్‌ చేయడం, నిరసన తెలపడం, ఉద్యమించడం రాజద్రోహం కిందకు రాదని కేదార్‌నాథ్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనకారులు హింసను రెచ్చగొట్టి, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని సాయుధ తిరుగుబాటుతో కూలదోయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే దాన్ని రాజద్రోహంగా పరిగణించాలని పేర్కొంది. ఈ ధర్మసూక్ష్మాన్ని పోలీసులు, అధికార స్థానాల్లో ఉన్నవారు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది చట్టబద్ధ పాలనకు విరుద్ధమని తెలిసీ వారు పద్ధతి మార్చుకోవడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిపై తాము దర్యాప్తు చేపట్టినప్పుడు రాజకీయ జోక్యాన్ని ఎదుర్కోవలసి వస్తోందని 21 రాష్ట్రాల్లో 72శాతం పోలీసులు వెల్లడించినట్లు ఒక అధ్యయనం తెలిపింది. రాజకీయ ఒత్తిళ్లతోనే వారు రద్దయిపోయిన సెక్షన్లను ఉపయోగించి కేసులు పెడుతున్నారు. నిందితులను జైల్లోకి తోస్తున్నారు. దీనికి దిగువ కోర్టులు సహకరిస్తున్నాయి. తమకు చట్టం గురించి తెలియదని  చెప్పి తప్పించుకోవడం సాధారణ పౌరులకు  కుదరదు. అలాంటప్పుడు విచారణ న్యాయస్థానాలు, పోలీసులు, న్యాయవాదులు ఏ సాకు చెప్పి తప్పించుకోవడానికి వీలవుతుంది? వారు చట్టం గురించి తమకు తెలియదనడం నేరమవుతుంది కూడా. చట్టబద్ధ పాలనకు ఆటంకంగా మారిన ఇలాంటి అవాంఛనీయ ధోరణులను అరికట్టకపోతే, మన ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుంది. న్యాయవ్యవస్థపై పాలనా వ్యవస్థ పెత్తనం ఎక్కువై ప్రజాస్వామ్య సమతూకం దెబ్బతింటుంది.

 

అవగాహన పెంచాలి

ప్రజల ప్రాణాలు, జీవన గమనం, వారి స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగ కోర్టులు వెలువరించిన తీర్పుల గురించి అందరికీ తెలియాలి. వీటిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరగాలి. తమ తీర్పుల ప్రాధాన్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడానికి రాజ్యాంగ కోర్టులు తామే ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. ఉన్నత న్యాయ స్థానాలు వెలువరించే తీర్పులను దిగువ కోర్టుల న్యాయమూర్తులకు సుబోధకం చేయడానికి క్రమం తప్పకుండా శిక్షణ తరగతులు నిర్వహించాలి. తీర్పుల స్ఫూర్తి, సారాంశాలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించాలి. అలా ఉల్లంఘించిన న్యాయ, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించేటప్పుడు వారికి మైనస్‌ మార్కులు వేయాలి. న్యాయవాదులు, న్యాయశాస్త్ర విద్యార్థులకు కీలకమైన తీర్పులపై లోతైన అవగాహన కల్పించాలి. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారికి బార్‌ కౌన్సిళ్లు శిక్షణ తరగతులు నిర్వహించి చట్టాలు, తీర్పుల గురించి సమగ్ర అవగాహన కల్పించాలి. చట్టబద్ధ పాలనను కాపాడటానికి ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థలు సమన్వయంతో ముందుకుసాగాలి. చట్టబద్ధ పాలన ఆవశ్యకతను ప్రజలకు విడమరచి చెప్పి చైతన్యవంతులను చేయడానికి సమాచార మాధ్యమాలు తమ వంతు కృషిచేయాలి.

 


 

Posted Date: 07-09-2021 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం