• facebook
  • whatsapp
  • telegram

సమున్నత ఆశయాల యువభారతం



జాతీయ సమగ్రతను కాపాడటంలో, పరిపాలనలో కీలకమైన అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలన్నది చాలామంది యువత కల. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడి చదివి యూపీఎస్‌సీ పరీక్షలు రాస్తారు. ఇలాంటి అత్యున్నత కొలువుల కోసం సన్నద్ధమయ్యేవారి గురించి ఇటీవల ఒక ఉన్నతాధికారి చులకనగా మాట్లాడటం విమర్శలకు తావిచ్చింది.


ఇటీవల వెలువడిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారు తమ ఏకాగ్ర దీక్ష, కఠోర శ్రమ ఫలించాయని సంబరపడ్డారు. అయితే, యూపీఎస్‌సీ గురించి దిల్లీలో ఉన్నతాధికారి ఒకరు అంతకుముందు చేసిన అసందర్భ వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించాలి. భారతీయ యువతీయువకుల్లో చాలామందిలో ఉన్నతమైన ఆకాంక్షలు కొరవడిన ఫలితంగా యూపీఎస్‌సీ పరీక్షల్లో నెగ్గడానికి ఏళ్ల తరబడి అమూల్య సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఉన్నత ఆకాంక్షలతో ఎలాన్‌ మస్క్, ముకేశ్‌ అంబానీల మాదిరిగా వ్యవస్థాపకులుగా ఎదగాలని ఆయన సెలవిచ్చారు. ఆ వ్యక్తి ప్రైవేటు రంగంలో ఉన్నతాధికారిగా పనిచేసి తదనంతరం ప్రభుత్వ రంగంలోకి మారారు. ఆయన చేసిన వ్యాఖ్యల తరహాలోనే ఇతరులూ యూపీఎస్‌సీ అభ్యర్థులను చులకన చేస్తూ మాట్లాడటం సమంజసం కాదు.


మొక్కవోని దీక్షతో...

యూపీఎస్‌సీ ద్వారా భర్తీ అయ్యే కొన్ని వందల ఉద్యోగాల కోసం ఏటా లక్షలమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారత్‌- యువతీయువకులకు ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంలో తగినన్ని ఉద్యోగాలు చూపలేకపోతోంది. ఈ పరిస్థితిలో వారు యూపీఎస్‌సీ ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారంటే ఆశ్చర్యం ఏముంది? ఈ వాస్తవాన్ని గమనించకుండా ఉన్నతమైన ఆకాంక్షలు లేకపోవడమే యువతను యూపీఎస్‌సీ పరీక్షల వైపు నెడుతోందని వ్యాఖ్యానించడం సరికాదు. విధాన రూపకర్తలుగా ఎదగాలనే ఆశయంతో కఠోర శ్రమ చేసే యువతను ఇలా నిరుత్సాహపరచడం ఆవేదన కలిగిస్తోంది. అలాంటి ఆశయాల్ని తక్కువ స్థాయి ఆకాంక్షలుగా భావించకూడదు. సమున్నత ఆదర్శంగా గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించాలి. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర కేంద్ర సర్వీసు ఉద్యోగాల కోసం యూపీఎస్‌సీ పరీక్షలు రాస్తున్నవారిలో సాధారణ పట్టభద్రులే కాకుండా, ఇంజినీర్లు, డాక్టర్లు సైతం పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. మేనేజ్‌మెంట్, చార్టర్డ్‌ అకౌంటెన్సీ, న్యాయశాస్త్రాలలో పట్టభద్రులైనవారూ యూపీఎస్‌సీ పరీక్షల్లో పోటీ పడుతున్నారు. వీరిలో చాలామంది ఉన్నత శ్రేణి విద్యాసంస్థల్లో చదివినవారే. తలచుకుంటే వారికి ప్రైవేటు రంగంలో లక్షలు ఆర్జించే ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. అయినా, వాటిని కాదనుకొని ఒక మోస్తరు జీతభత్యాలనిచ్చే ప్రభుత్వ రంగంలో ప్రవేశించాలనుకొంటున్నారు. ఈ ఆశ నెరవేరడం నల్లేరుపై నడక కాదని వారికి తెలుసు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్‌సీలో నెగ్గడానికి వారు ఎంతో శ్రమిస్తారు. అవసరమైతే శిక్షణ సైతం తీసుకుంటారు. యూపీఎస్‌సీ పాఠ్య ప్రణాళికలోని పలు అంశాలపై పట్టు సాధించడానికి కనీసం ఒకటీ రెండేళ్లపాటు శ్రమించాల్సి ఉంటుంది. తద్వారా వారికి భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకొని మొక్కవోని దీక్షతో ముందుకుసాగుతారు. వివిధ రంగాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను చూపే విధానకర్తలుగా ఎదిగే సామర్థ్యం ఉన్నవారే అంతిమంగా ఉత్తీర్ణులవుతారు. యూపీఎస్‌సీ పరీక్షలు రాయడం ఇతరత్రా ఉన్నత ఆశలు లేకపోవడానికి ప్రతీక అని అభివర్ణించిన ఉన్నతాధికారి ఈ కఠోర శ్రమను వ్యర్థంగా పరిగణిస్తున్నారు. బహుశా కష్టపడకుండానే విజయం సాధించవచ్చని భావిస్తున్నట్లుంది. పరాజయాలను విజయానికి సోపానాలుగా పరిగణించకుండా ఒక్క ఓటమితోనే కాడి కింద పడేయాలని ఆయన సలహా ఇస్తున్నారా? గమ్యం చేరేవరకు విశ్రమించకు అని వేదాల నుంచి ఆధునిక యుగ విజేతల వరకు అందరూ బోధిస్తారని ఆయనకు తెలియదా? ప్రభుత్వ రంగానికి భిన్నంగా ప్రైవేటు రంగంలో బోలెడు అవకాశాలుంటాయని ఆ ఉన్నతాధికారి అభిప్రాయంలా ఉంది. అంకుర పరిశ్రమలు పెట్టి కోట్లకు పడగలెత్తడం సునాయాసమని ఆయన భావిస్తున్నట్లుంది. కానీ, 90శాతం అంకుర సంస్థలు ఉన్నఫళాన లాభాల్లోకి రావని హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ అధ్యయనం తెలిపింది. పట్టువదలకుండా కృషి చేయడం ద్వారానే అంకురాలు విజయవంతమవుతాయి.


సామాన్యుల బతుకులు మార్చడానికి...

ఆశాభంగాలు, అపజయాలు లేకుండా ఏ ఒక్కరూ విజయాలు సాధించలేరు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రజ్ఞులకు ఈ సంగతి బాగా తెలుసు. అందుకే చంద్రయాన్‌-2 విఫలమైనా చంద్రయాన్‌-3తో ఘనవిజయం సాధించారు. యూపీఎస్‌సీ పరీక్షలు రాసేవారికీ ఇదే మనస్తత్వం ఉండాలి, ఉంటుంది కూడా. నిస్వార్థంగా సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేసే ప్రజా సేవకులుగా ఎదగడమే యూపీఎస్‌సీ ఉత్తీర్ణుల ఆశయం కావాలి. సమాజంలో దిగువ వర్గాలకు చెందినవారు పైఅంచెలకు ఎదగడానికి, ఐఏఎస్‌ అధికారి హోదాలో తమబోటి సామాన్యుల స్థితిగతులను మెరుగుపరచడానికి యూపీఎస్‌సీ ఉత్తీర్ణత ఉత్తమ సాధనమవుతుంది. మరికొందరికి ఐఎఫ్‌ఎస్‌ అధికారులుగా విదేశాలలో భారత్‌ ప్రయోజనాల కోసం పాటుపడే అవకాశం లభిస్తుంది. ఇంకొందరికి ఖాకీ దుస్తులు ధరించి సమాజంలో శాంతిభద్రతలను కాపాడాలనే ఆశయం నెరవేరుతుంది. నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి అమితాబ్‌ కాంత్‌ ఉద్ఘాటించినట్లు... భారతదేశ ప్రగతి రథానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు జోడుగుర్రాలు. ఈ క్రమంలో సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి సాధనలో ప్రైవేటు రంగాన్నీ ప్రభుత్వాధికారులు కలుపుకొని పోవాలి. 2047కల్లా వికసిత భారత్‌ స్వప్న సాకారానికి ఇది ఎంతో అవసరం.


పనిచేయాల్సింది ప్రజల కోసం...

ఉన్నత ఆశయాలతో అఖిల భారత సర్వీసుల్లోకి అడుగు పెడుతున్న వారిలో చాలామంది ఆ తరవాత గాడి తప్పుతున్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర అధికారుల్లో కొంతమంది అధికార పక్షం అడుగులకు మడుగులొత్తుతూ ప్రజాసేవను గాలికొదిలేస్తున్నారు. జగన్‌ జమానాలో ఏపీలో చాలా మంది ఐఏఎస్‌ అధికారులు దారితప్పి ‘అయ్యా... ఎస్‌’ అన్నట్లుగా తయారై అపఖ్యాతి మూటగట్టుకొన్నారు. సివిల్‌ సర్వీసులు అన్నవి ప్రజాసంక్షేమానికి పాటుపడటానికి ఉద్దేశించినవన్న విషయం మరచిపోయి ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజ ఖేద్కర్‌ అలవిగాని సౌకర్యాల కోసం వెంపర్లాడటం తాజాగా తీవ్ర విమర్శలకు దారితీసింది. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ సూచించినట్లు గరిష్ఠ స్థాయిలో సుపరిపాలన అందిస్తూ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అఖిల భారత సర్వీసు అధికారులు కృషిచేయాలి.


- మిళింద్‌ కుమార్‌ శర్మ 

(సామాజిక విశ్లేషకులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నైపుణ్య యుక్తితో యువ‘శక్తి’!

‣ జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?

‣ చైనా విస్త‘రణం’... శాంతికి అవరోధం

‣ సత్వర న్యాయం సాకారమవుతుందా?

‣ జన విస్ఫోటం... సమస్యలకు మూలం!

‣ ఆయుధ స్వావలంబన కోసం...

‣ వర్ధమాన దేశాల వెన్నుతట్టే వేదిక

Posted Date: 14-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని