• facebook
  • whatsapp
  • telegram

మూడో ధ్రువంగా ఆప్‌

భాజపా కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయమవుతుందా?

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘన విజయం జాతీయ రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన ఆప్‌- భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లకు పోటీగా మూడో ధ్రువంగా ఆవిర్భవించబోతోందా అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కాంగ్రెస్‌ నానాటికీ క్షీణించిపోతున్న దృష్ట్యా ఆప్‌ మున్ముందు దేశ రాజకీయాల్లో హస్తం పార్టీ స్థానాన్ని భర్తీచేయగలదనే అంచనాలు బలం పుంజుకొంటున్నాయి. మొదట దిల్లీని కైవసం చేసుకుని, తాజాగా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను పక్కకునెట్టి ఆప్‌ అధికార పక్షంగా అవతరించింది. గోవా, ఉత్తరాఖండ్‌లలో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. పంజాబ్‌లో సాధించిన అఖండ విజయం కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీలను ఆప్‌వైపు ఆకర్షించవచ్చు. జాతీయ రాజకీయాల్లో కొత్త కూటమి నిర్మాణానికి నాంది పలకవచ్చు.

గుజరాత్‌పై గురి

తాజా ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్‌ కాంగ్రెస్‌లో  వేగంగా సంభవించిన పరిణామాలు పలువురిని విస్మయానికి గురి చేశాయి. పార్టీ పగ్గాలను నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు అప్పగించి, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం పార్టీకి ఆత్మహత్యాసదృశంగా మారింది. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా సిద్ధూ ఆయన నాయకత్వాన్ని విమర్శించసాగారు. ఈ లుకలుకలను ఆమ్‌ ఆద్మీ పార్టీ సద్వినియోగం చేసుకుని పంజాబ్‌లో బలం పెంచుకుంది. ఇక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం భారతీయ జనతా పార్టీకి పంజాబ్‌లో విజయావకాశాలను దూరం చేసింది. పంజాబ్‌ రైతులు ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయంగా పరిగణించి ఓట్ల వర్షం కురిపించారు.

ఈ సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోనూ కాంగ్రెస్‌ నీరసించిపోతోంది. దాని స్థానాన్ని భర్తీ చేయడానికి ఆప్‌ కదం తొక్కుతోంది. గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ ఇప్పటికే ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో భాజపా 41 సీట్లను, కాంగ్రెస్‌ రెండు సీట్లను గెలుచుకోగా, ఆప్‌ ఒక స్థానం చేజిక్కించుకుంది. నిరుడు గాంధీనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీఎంసీ) ఎన్నికల్లో ఆప్‌ 21శాతం ఓట్లు సాధించడం విశేషం. 2016 జీఎంసీ ఎన్నికల్లో 46.9శాతం ఓట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి 27.9శాతంతో సరిపెట్టుకొంది. కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు ఆప్‌ ఖాతాకు మళ్ళిపోయాయని భావించవచ్చు. భాజపా మాత్రం తన ఓట్లను 46.5శాతానికి పెంచుకోగలిగింది. సూరత్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం ఆప్‌ 28శాతం ఓట్లను సాధించింది. కార్పొరేషన్‌లోని 120 సీట్లకు 27 ఆప్‌ ఖాతాలో జమ అయ్యాయి. భాజపా 90 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్‌ స్కోరు సున్నాకు పడిపోయింది. అదే 2016లో కాంగ్రెస్‌ 36 సీట్లు గెలిచింది. రాజ్‌కోట్‌ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ 17శాతం ఓట్లు సాధించింది. రాష్ట్ర జనాభాలో 14శాతం మేరకు ఉన్న పటీదార్‌ కులస్థుల రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్దిక్‌ పటేల్‌ను గుజరాత్‌ పీసీసీ వర్కింగ్‌ అధ్యక్షుడిగా నియమించినా, పటీదారుల ఓట్లు అత్యధికంగా ఆప్‌కే పడ్డాయి. ఏతావతా గుజరాత్‌లో కాంగ్రెస్‌ బలహీనత ఆప్‌ పార్టీ బలంగా పరిణమిస్తోంది. ఇప్పటికే వ్యాపారవేత్త మహేశ్‌ సవానీతో సహా పలువురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్‌ను వీడి ఆప్‌లో చేరుతున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఇక్కడ ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పటీదార్‌ కులస్థుడిని ప్రకటించే అవకాశం ఉంది. దిల్లీ, పంజాబ్‌లలో గెలిచినందువల్ల రాజ్యసభలో ఆప్‌ సంఖ్యాబలం పెరగనుంది. సభలో దిల్లీ నుంచి ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఆప్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్‌ నుంచి వీరికి మరికొందరు జత కలిసి రాజ్యసభలో ఆప్‌ వాణిని బలంగా వినిపిస్తారు. జాతీయ రాజకీయాల్లో ఆప్‌ పాత్ర ఆ మేరకు పెరగనుంది.

కేజ్రీవాల్‌కు అవకాశం

నిరుడు పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా కార్యకలాపాలు మొదలుపెట్టారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు మమత నాయకత్వం వహిస్తారని ఊహాగానాలూ వినిపించాయి. ఆమె నేతృత్వాన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు శిరసా వహిస్తారా అన్నది సందేహం. పంజాబ్‌లో ఆప్‌ గెలుపు దరిమిలా ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరు ప్రస్తుతం ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే చర్చల్లోకి వచ్చింది. గుజరాత్‌తోపాటు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ల మీదా ఆప్‌ దృష్టి కేంద్రీకరిస్తోంది. హిందీ ప్రాంతానికి చెందిన కేజ్రీవాల్‌కు జాతీయ నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ, ఉమ్మడి నాయకత్వంపై ప్రతిపక్ష నాయకులకు ఏకాభిప్రాయం లేదు. ఎవరికివారు తామే అధినాయకులమని భావించుకుంటున్నారు. తమ ఛత్రం కిందనే అన్ని ప్రతిపక్షాలూ ఏకమై నరేంద్ర మోదీని సవాలు చేయాలని ఆశిస్తున్నారు. మమతా బెనర్జీ మొదలుకొని అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జాతీయ నాయకత్వంపై ఆశ ఉంది. వారందరిలో కేజ్రీవాల్‌ వాణికి బలం పెరగనుంది. ఆయన పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటమే కాదు... ఇతర రాష్ట్రాల్లోనూ బలం పెంచుకోవడం దీనికి కారణం.

శిథిలావస్థకు చేరిన హస్తం పార్టీ

ఒకప్పుడు ఆసేతుహిమాచలాన్ని ఏలిన కాంగ్రెస్‌ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్‌ కొంత పుంజుకొన్నా... 2014లో నరేంద్ర మోదీ కేంద్రంలో గద్దెనెక్కినప్పటి నుంచి క్రమక్రమంగా బలహీనపడసాగింది. నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ 2022కు వచ్చేసరికి కాంగ్రెస్‌ మళ్ళీ శిథిలావస్థకు చేరుకుంది. నేడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అది జూనియర్‌ భాగస్వామిగా నెట్టుకొస్తోంది. గడచిన ఏడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో సొంత మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌- దుర్బల నాయకత్వం వల్ల ఆ రాష్ట్రాలను ఒక్కటొక్కటిగా కోల్పోతోంది. ఎడతెగని అసమ్మతి కాంగ్రెస్‌లో అంతఃకలహాలకు కారణమైంది. పార్టీ అధినాయకత్వం తీరుపై సీనియర్‌ నేతలు బహిరంగంగానే అసమ్మతి తెలిపారు. పార్టీలో కీచులాటల వల్ల కాంగ్రెస్‌ ఇంతకుముందు మధ్యప్రదేశ్‌లో, ఇప్పుడు పంజాబ్‌లో అధికారం జారవిడుచుకుంది. ముఠా కలహాల వల్ల కేరళ, అస్సామ్‌లలో అధికారంలోకి రాలేకపోయింది.

- నీరజ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగుమతుల వృద్ధిలో అసమానతలు

‣ డ్రాగన్‌కు యుద్ధపోటు

‣ ఆధునిక యుగంలోనూ అసమానతలు

‣ మౌలిక వృద్ధికి నిధుల సమీకరణే కీలకం

‣ రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

‣ దేశ రక్షణలో నారీ శక్తి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం