• facebook
  • whatsapp
  • telegram

సోనియా కుటుంబానికే పాదాక్రాంతం

తీరుమారని కాంగ్రెస్‌

 

 

నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల కేసులో రాహుల్‌ గాంధీని ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించడాన్ని నిరసిస్తూ దేశంలో అనేక చోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు హడావుడి చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబీకులు చిక్కుల్లో పడినప్పుడల్లా నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి కాంగ్రెస్‌లో ఇంకా ఆ కుటుంబ వీరవిధేయులు మిగిలే ఉన్నారా అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది! అదే సమయంలో పార్టీపై తన పట్టును నెహ్రూ కుటుంబం ఇప్పటికీ నిలబెట్టుకుంటోందని రూఢి అయింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన 23 మంది సీనియర్‌ నాయకుల గోడు అంతా అరణ్య రోదనగానే మిగిలిందని, ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన చింతన్‌ శిబిరం చింతనే మిగిలించిందనీ తేలిపోయింది. ఎవరెంత మొత్తుకున్నా సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలు తమ ధోరణి మార్చుకోరని అవగతమైంది. రాహుల్‌ గాంధీకోసం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు నిషేధాజ్ఞలను ధిక్కరించి మరీ పోలీసులతో పెనగులాడటం చూస్తే- (సోనియా) కుటుంబమే పార్టీ, పార్టీయే కుటుంబమని మరోమారు రుజువైంది.

 

స్వచ్ఛంద నిరసనలేనా? 

కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలు స్వచ్ఛందంగా, ఆకస్మికంగా జరిగినవి కావు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌కు సంబంధించిన వీడియోనే దీనికి నిదర్శనం. దిగ్విజయ్‌ హడావుడిగా వచ్చి ‘కహా హాజరీ లగానీ హై’ (ధర్నాకు హాజరైనట్లు ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి) అని కార్యకర్తలను అడగడం అందులో కనిపించింది. సోనియా కుటుంబ మెప్పుకోసం ఆయన మొక్కుబడిగా ధర్నాలో పాల్గొన్నారే తప్ప మనస్ఫూర్తిగా కాదని దాంతో అర్థమవుతోంది. ఏతావతా, నిరసన ప్రదర్శనలు పైవాళ్లు పనిగట్టుకుని నిర్వహించినవేనని అనుకోవచ్చు. పార్టీ అంటే తానేనని గర్వించే నాయకత్వం మాత్రమే నాయకులు, కార్యకర్తలను తన స్వార్థం కోసం అలా ఉపయోగించుకొంటుంది. ఇటీవలి కాలంలో చాలామంది కాంగ్రెస్‌ నాయకులు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తి నరేంద్ర మోదీ హయాములో కొంతకాలం జైలు ఊచలు లెక్కబెట్టారు కూడా. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో మరెందరో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు దర్యాప్తు సంస్థలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వారెవరూ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలను రెచ్చగొట్టి వీధుల్లోకి లాక్కురాలేదు. పోలీసులతో తలపడమని వారిని ఉసిగొల్పలేదు. కాంగ్రెస్‌కు తామే సర్వంసహాధిపతులమని, మిగిలిన వారంతా తమ పాట్లు తామే పడాలని సోనియా కుటుంబం భావిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనమేమి కావాలి? దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు తమపైకి ఉసిగొల్పి వేధిస్తోందని చాటుకొంటే ప్రజల మద్దతు పొందవచ్చునని సోనియా కుటుంబానికి బహుశా ఎవరో తప్పుడు సలహా ఇచ్చి ఉంటారు! రాహుల్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నా సామాన్య జనం పట్టించుకోలేదు. ధర్నాలు కొద్దిమంది కాంగ్రెస్‌ వారికే పరిమితమయ్యాయి.

 

ఇదీ కేసు... 

ఏనాడో ముద్రణ నిలిచిపోయిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అనేక భవనాలు, భూములు, ఇతర ఆస్తులున్నాయి. వాటి మార్కెట్‌ విలువ రెండు వేల కోట్ల రూపాయలని అంచనా. ఆ స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో ఎంతో ఆదాయం వస్తోంది. కోల్‌కతాలోని ఒక డొల్ల కంపెనీ ద్వారా హవాలా మార్గంలో కేవలం కోటి రూపాయలు చెల్లించి రూ.2000 కోట్ల ఆస్తులను సోనియా కుటుంబం దిగమింగిందన్నది ఆరోపణ. ఆ హవాలా లావాదేవీకి కాంగ్రెస్‌ మాజీ కోశాధికారి మోతీలాల్‌ వోరా కారకుడని రాహుల్‌ గాంధీ నిందించినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని వోరా కుమారుడు ఖండించారు. మోతీలాల్‌ వోరా మరణించారు కాబట్టి తప్పును ఆయన మీదకు తోసేయడం రాహుల్‌కు వాటంగా అనిపించిందేమో! వోరా తరవాత కాంగ్రెస్‌ కోశాధికారిగా వ్యవహరించిన పవన్‌ బన్సల్‌ సైతం ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. రైల్వే బోర్డు ముడుపుల కేసులో బన్సల్‌ పేరు లేకపోవడానికి కారణం ఆయన రాహుల్‌కు వ్యతిరేకంగా మారడానికి అంగీకరించడమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. బన్సల్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరి బంధువు ఒకరు బోర్డు నియామకాల కోసం భారీగా లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వాటిలో ఒక లావాదేవీని బన్సల్‌ అధికార నివాసం నుంచే జరిపారని తెలుస్తోంది. రైల్వే బోర్డు పదవి కోసం రూ.10 కోట్లు చేతులు మారాయి. ఆ ముడుపు ముట్టజెప్పిన వ్యక్తిని ముంబయిలో రైల్వే మంత్రి హోదాలోనే బన్సల్‌ కలిశారు. ఆసక్తికరంగా- రైల్వే బోర్డు ముడుపులపై యూపీఏ హయాములోనే కేసు దాఖలైంది. అందులో బన్సల్‌ దగ్గరి బంధువు పేరును చేర్చారు. రైల్వేమంత్రికి తెలియకుండా అతడు నియామకాలు జరపలేడు కదా!

 

ప్రజా సమస్యలపై అలక్ష్యం 

దేశ ప్రజలను అనేక సమస్యలు పీడిస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ- తమ యజమానులు చిక్కుల్లో పడగానే ఎక్కడ లేని వీరావేశంతో వీధులకెక్కడం చూస్తే ఆ పార్టీ ఎటుపోతోందనే సందేహం కలగకమానదు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ఆదాయ అంతరాల వంటివాటిపై ప్రతిపక్షం ఉద్యమించి ప్రజలను తనవైపు తిప్పుకోవచ్చు. కానీ, కాంగ్రెస్‌కు అవేమీ పట్టవు- తమ పాలక కుటుంబం బాగోగులు తప్ప! గడచిన ఎనిమిదేళ్లుగా రాహుల్‌ వివిధ సమస్యలపై జనంలోకి రాకుండా స్వదేశంలో లేదా విదేశాల నుంచి ట్వీట్లు చేయడానికే పరిమితమవుతున్నారు. సోనియా కుటుంబం రాజసౌధంలోంచి ఎన్నికల సమయంలో మాత్రమే బయటికొచ్చి కంటితుడుపు ప్రచారంతో కథ ముగించేస్తోంది. మామూలు రోజుల్లో వారి దర్శనం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులకు సైతం దొరకడం లేదు. నాలుగేళ్ల నుంచి తాను రాహుల్‌తో సమావేశం కావడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అది సాధ్యపడలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ గోడు వెళ్లబోసుకున్నారు. సోనియా కుటుంబ హయాములో కాంగ్రెస్‌ కుంగి కృశించిపోతోందంటే ఇక ఆశ్చర్యమేముంది?
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వసుధైక కుటుంబానికి అసలైన ఆలంబన

‣ కశ్మీర్‌పై అల్‌ఖైదా దుష్టనేత్రం

‣ ఆర్థిక పురోగమనానికి బ్రిక్స్‌ భరోసా

‣ వరదల బీభత్సం... జనజీవనం అస్తవ్యస్తం!

‣ అఫ్గాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం

‣ 5జీ రాకకు వేళాయె...

Posted Date: 04-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం