విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Admissions: లా కోర్సుల్లో అడ్మిషన్లపై వచ్చే ఏడాదికి మార్గదర్శకాలు: హైకోర్టు


ఈనాడు, హైదరాబాద్‌: న్యాయ కళాశాలలకు అనుమతులు, గుర్తింపు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం కారణంగా లా కోర్సుల్లో ప్రవేశాలు సకాలంలో జరగడం లేదని, ఈ అంశంపై పూర్తిస్థాయి వాదనలు చేపట్టి వచ్చే ఏడాది ప్రవేశాలకు మార్గదర్శకాలు జారీ చేయాలనుకుంటున్నామని హైకోర్టు జులై 24న వెల్లడించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి కాలేజీల అనుమతులు, గుర్తింపులను ఆగస్టు 4లోగా పూర్తిచేస్తామని బార్‌ కౌన్సిల్, అనంతరం 5 నుంచి కౌన్సెలింగ్‌ ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో విచారణను వాయిదా వేసింది. 2023-24 లా కోర్సుల అడ్మిషన్లలో జాప్యం చేస్తుండటాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. లా కాలేజీల అనుమతులు, గుర్తింపులను ఆగస్టు 4లోగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. లా కోర్సుల్లో కౌన్సెలింగ్‌ ఆగస్టు 5 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. కోర్టుకు సహాయకులుగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. లా కాలేజీల ఏర్పాటులో సుదీర్ఘ ప్రక్రియతో జాప్యం జరుగుతోందన్నారు. మొదట కాలేజీల అవసరాలను గుర్తించి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాల్సి ఉందని.. అనంతరం సిలబస్, కోర్సులను యూనివర్సిటీ అనుమతించాల్సి ఉందని.. తర్వాత బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏర్పాటైన కాలేజీలు కూడా ఏటా అనుమతులు తీసుకోవాల్సి ఉండటంతో అడ్మిషన్లలో జాప్యం జరుగుతోందన్నారు. అనుమతుల కోసం ఆరు నెలల ముందుగా కాలేజీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయిలో వాదనలు విని వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు మార్గదర్శకాలు జారీ చేయాలనుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుత అడ్మిషన్లకు సంబంధించి వివరాల నిమిత్తం తదుపరి విచారణను ఆగస్టు 12వ తేదీకి వాయిదా వేసింది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Published at : 25-07-2024 12:41:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం