• facebook
  • whatsapp
  • telegram

కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

* స్టార్‌ హోటల్‌ స్థాయి హాస్టళ్లు 



కొత్తతరం - ఓ మంత్రదండంలాంటిది. వాళ్ళ చూపో చేయో పడ్డ ప్రతిదీ ‘హాంఫట్‌’ అన్నట్టు ఇట్టే రూపుమార్చుకుంటుంది. వాళ్ళ అవసరాలమేరకు కార్పొరేట్‌ హంగులద్దుకుని కొత్తకళ సంతరించుకుంటుంది. బట్టల షాపులు కాస్తా బ్రాండెడ్‌ షోరూమ్‌లవుతున్నాయన్నా, రెస్టరంట్‌ భోజనాలు చిటికెలో ఇంటికొస్తున్నాయన్నా... అన్నీ కుర్రతరం కోసం వచ్చిన మార్పులే. ఆ వరసలో ఇప్పుడు పీజీ హాస్టల్సూ వచ్చిచేరాయి... ‘కో-లివింగ్‌’ అంటూ కొత్త హంగుల్ని దిద్దుకుంటున్నాయి. ఇదివరకు చూడని వసతులెన్నో తెస్తున్నాయి..!


 


కొత్తతరం విద్యార్థులు దేశంలో తమకి నచ్చిన కోర్సు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఐటీ ఉద్యోగులైతే శిక్షణ కోసమనో, ఆన్‌సైట్‌ పనులకోసమో వేరే నగరా ల్లో నెలలపాటు ఉండాల్సి వస్తోంది. ఇలాంటివాళ్ళు ఇప్పటిదాకా నగరాల్లోని పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) హాస్టళ్ళపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఎంత మంచి హాస్టల్‌ అనుకున్నా- భోజనంలో కాస్త శుచీశుభ్రతా, విశాలమైన గదులూ, ఏవేళకావేళ వాటిని శుభ్రంచేసే తీరూ, లాండ్రీ, సెక్యూరిటీ గార్డులు- ఇవి తప్ప ఇంతకన్నా గొప్ప వసతులేవీ ఆశించలేం. పైగా ఫలానా సమయంలోపు రావాలి, పెట్టింది తినాలి, బయటి ఫ్రెండ్స్‌ ఎవరూ రాకూడదూ... లాంటి కట్టుబాట్లెన్నో ఉంటాయి. ఇవేవీ వద్దనుకుని ఏ అపార్ట్‌మెంట్‌లోనో గది తీసుకుందామనుకుంటే- వంటావార్పు నుంచీ గదులు శుభ్రంచేయడందాకా అన్నిపనులూ షేర్‌ చేసుకోవాలి. కొత్త నగరానికిలా చదువులకోసమో ఉద్యోగాల కోసమో వచ్చినవాళ్ళు దంపతులైతే- వాళ్ళు పనిచేయాల్సిన ఆరునెలలో లేదా ఏడాది కోసం ఇల్లు అద్దెకు తీసుకోవడం భారమే అవుతుంది. అటు పీజీ హాస్టల్‌లో ఇమడలేనివాళ్ళకీ, ఇటు ఇంటి అద్దె భరించలేనివారికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి- ఈ కో-లివింగ్‌ ఆవాసాలు!



ఇలా ఉంటాయివి..

ఏ త్రీస్టార్‌/ ఫైవ్‌స్టార్‌ హోటలో మీకు హాస్టల్‌గా మారితే ఎలా ఉంటుంది? కో-లివింగ్‌ ఆవాసం ఇంచుమించు అలాగే ఉంటుంది! ఏ పెద్ద హోటల్‌కీ తీసిపోని విశాలమైన ఏసీ గదులతోపాటూ చక్కటి ఫర్నిచర్‌, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసే పనివాళ్ళూ, లాండ్రీ సేవలు అందించేవాళ్ళూ ఎప్పుడూ అందుబాటులో ఉంటారిందులో. వీటికి తోడు అత్యాధునిక జిమ్‌లూ, యోగా, డ్యాన్స్‌ శిక్షణ ఏర్పాట్లతోపాటు సంబంధిత శిక్షకులూ ఉంటారు. మంచి రెస్టరంట్‌లు ఉంటాయి. వాటిల్లో వంట నచ్చకపోతే మీరే చేసుకోవడానికి కమ్యూనిటీ కిచెన్‌లుంటాయి. వాటికి అదనంగా మీ గదిలోనే ఒవెన్‌లూ కనిపిస్తాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లో ఉండి పని చేసుకోవాలనుకున్నా, ఆన్‌లైన్‌లో క్లాసులు వినాలనుకున్నా మీ గదికే పరిమితంకావాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ వర్క్‌ ఏరియాలుంటాయి. పనులూ క్లాసులతో బుర్రవేడెక్కి కాస్త సేదదీరాలంటే ఇండోర్‌ గేమింగ్‌ జోన్‌లూ ఉంటాయి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటివి ఆడటానికి బాక్స్‌స్టేడియంలనీ ఏర్పాటుచేస్తున్నారు. గదికో టీవీ ఉన్నా- అందరితోకలిసి ఇక్కడి ‘మూవీ రూమ్‌’లో తెరపైన ఇష్టమొచ్చిన సినిమాలు చూడొచ్చు. ఇక- సెక్యూరిటీ విషయానికి వస్తే దాదాపు అన్ని ఫ్లోర్‌లలోనూ సీసీ కెమెరాలుంటాయి. సెక్యూరిటీ కూడా అత్యాధునికంగానే ఉంటోంది. మనం బయటకు వెళ్ళి రావాలన్నా బయోమెట్రిక్‌ అనుమతి తప్పనిసరి. పీజీ హాస్టళ్ళలోలా కట్టుబాట్లు ఉండవు- బయట నుంచి మీ స్నేహితులూ రావొచ్చు. అమ్మాయిలకంటూ ప్రత్యేక ఫ్లోర్‌లుంటాయి ఇందులో. ఏదైనా సమస్య వస్తే పిలవడానికి వాళ్ళ గదుల్లోనూ, కమ్యూనిటీ ఆప్‌లోనూ... ఎమర్జెన్సీ బటన్‌లుంటాయి. ప్రతి కో-లివింగ్‌ ఆవాసమూ ఇన్ని వసతులతో ఉంటుందని చెప్పలేంగానీ... స్థాయీభేదాలతో దాదాపు అన్నీ ఈ సౌకర్యాలు కల్పించడానికే ప్రయత్నిస్తున్నాయి. స్టార్‌ హోటల్‌ స్థాయి ఉన్నవాటిల్లో 13 వేల(షేరింగ్‌) నుంచి రూ.25(సింగిల్‌) వేలదాకా అద్దె ఉంటున్నాయి. హైదరాబాద్‌లో బోస్టన్‌ లివింగ్‌, ఇస్తారా, సెటిల్‌ వంటి సంస్థలు ఈ స్థాయిలో అందిస్తున్నాయి. ‘హైదరాబాద్‌ వన్‌’ అనే పేరుతో 47 అంతస్తులతో కూడిన 1500 కోట్ల రూపాయల ఖర్చుతో అతిపెద్ద కో-లివింగ్‌ ఆవాసం కూడా ఈ ఏడాది రాబోతోంది. ఇవికాకుండా- చిన్నసైజు లగ్జరీ అపార్ట్‌మెంటుల్లాంటి వసతులతో కూడిన కోలివింగ్‌ ఆవాసాల్లో ఏడువేల నుంచి అద్దె మొదలవుతుంది. స్టాన్జా లివింగ్‌, హౌజర్‌ వంటి సంస్థలు పలు చోట్ల అపార్ట్‌మెంట్‌లని తీసుకుని ఇలా అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాయి. సంస్థ స్థాయి ఏదైనా సరే- గది అద్దెతోపాటు లాండ్రీ, రూమ్‌ సర్వీసెస్‌, జిమ్‌ యోగా వంటివన్నీ ఫీజులో భాగంగానే ఉంటున్నాయి. ఒక్క భోజనం ఖర్చులు మాత్రమే అదనంగా చెల్లించాలి. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడల్లో- ఎక్కడైనాసరే ఐటీ కంపెనీలూ విద్యాసంస్థలూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ కో-లివింగ్‌ ఆవాసాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడి హోటల్‌, ఫ్లాట్‌ అద్దెలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ రుసుమనే చెప్పాలి!



 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.