• facebook
  • whatsapp
  • telegram

 Group-I: గ్రూప్‌-1 మార్కుల వెల్లడికీ ఆంక్షలు  

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ ఇంకా గోప్యత పాటిస్తోంది. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్నదాని కంటే ఏడు నెలల ఆలస్యంగా మార్కులు వెల్లడిస్తామని విమర్శల నేపథ్యంలో ప్రకటించినా, అవీ దరఖాస్తు చేసినవారికే తెలియజేస్తామని ఆంక్షలు విధించింది. యూపీఎస్సీలో కమ్యూనిటీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెల్లడిస్తున్నారు. ఏపీపీఎస్సీ కూడా 2016 నోటిఫికేషన్‌ వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2018 నోటిఫికేషన్‌పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని ఏపీపీఎస్సీ మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. 2022 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జాబితా వెల్లడి జరిగిన నెలరోజుల తర్వాత.. కోరినవారికి మార్కుల మెమొరాండం అందిస్తామని పేర్కొన్నా, అలా చేయలేదు. మార్కులు వెల్లడించకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మార్చి 19న ఏపీపీఎస్సీ గుట్టుచప్పుడు కాకుండా వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది. మార్కుల మెమొరాండం అవసరమైనవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేస్తే, రెండు వారాల తర్వాత వారికి వచ్చిన మార్కులను లాగిన్‌ విధానంలో తెలుసుకునే అవకాశం కల్పిస్తామని అందులో వెల్లడించింది.

మార్కుల జాబితా ప్రకటిస్తే నష్టమేంటి?

అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షల్లో తమ మార్కుల గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఇవి తెలిస్తేనే పోటీలో తాము ఎక్కడున్నామో.. ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకుని భవిష్యత్తులో జాగ్రత్తపడగలరు. అందుకే యూపీఎస్సీ ఈ మార్కులను అభ్యర్థులకు తెలియబరుస్తుంది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం మార్కుల వెల్లడిపై ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశమైంది. 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ప్రత్యేకంగా మెమొరాండం ఉండదని తెలిపింది. కానీ.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా నియామకాల్లో ఎంపికైన, మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు ఇంతవరకు చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినవారికి కోర్టు కేసు ఉందని కమిషన్‌ సమాధానమిస్తోంది.

2016 నోటిఫికేషన్‌లో...

ఏపీపీఎస్సీ 36/2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను అనుసరించి... ప్రధాన పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన మార్కులను జాబితా రూపంలో ప్రకటించింది. అందులో అభ్యర్థుల రోల్‌ నెంబరు, కమ్యూనిటీ, ఒక్కో సబ్జెక్టులో 150కి వచ్చిన మార్కుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించింది. నిరుద్యోగులకు సానుకూలంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించకుండా లేనిపోని ఆంక్షలతో పరిమితం చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

3 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలి

గ్రూప్‌-1 (28/2022) నోటిఫికేషన్‌ అనుసరించి మార్కుల మెమొరాండం అవసరమైనవారు మార్చి 22 నుంచి జూన్‌ 21లోగా కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ మార్చి 19న ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి అందిన రెండు వారాల తర్వాత మార్కుల మెమొరాండాన్ని లాగిన్‌ విధానంలో తెలుసుకోవచ్చునని పేర్కొంది. ఇందుకు తొలుత ప్రకటించినట్లు రూ.200 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

 గ్రూప్‌-1 పరీక్ష... ఏపీపీఎస్సీ అప్పీల్‌పై నేడు విచారణ

ఈనాడు, అమరావతి: 2018 నాటి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ వేసిన అప్పీల్‌పై మార్చి 19 న హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్‌ జి.నరేందర్‌ మార్చి 18న సెలవులో ఉండటంతో అప్పీల్‌ విచారణకు నోచుకోలేదు. ఏపీపీఎస్సీ, మరికొందరు ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు అత్యవసర విచారణ జరపాలని  మార్చి 18 న జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.  మార్చి 19 న  విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.



మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.