• facebook
  • whatsapp
  • telegram

Educations: పీజీ కోర్సుల్లో గందరగోళం

ఈనాడు, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సులపై జగన్‌ సర్కారు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత చదువులు చదవకూడదన్నట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజులు చెల్లింపుల్ని నిలిపివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఈ కోర్సులను గందరగోళంగా మార్చేసింది. ‘పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ల పునర్నిర్మాణం’ పేరుతో వివరాలను ఉన్నత విద్యా మండలి తన వెబ్‌సైట్‌లో పెట్టింది. వీటిపై ఇంతవరకు విద్యార్థులకు అవగాహన కల్పించలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇవి ప్రచారం చేసుకోవడానికి తీసుకొచ్చినట్లు ఉందే తప్ప, విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా లేవని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. అయిదేళ్లుగా పీజీలో ప్రవేశాలు క్రమంగా పడిపోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో సైతం సీట్ల భర్తీ దారుణంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పీజీ చదివే వారిని ప్రోత్సహించాల్సింది పోయి.. నిరుత్సాహపరిచేలా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటులో మూడేళ్లే..

రాష్ట్రంలో 2020-21లో నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని ప్రవేశపెట్టారు. ఇందులో ఆనర్స్‌, ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ను పెట్టారు. నాలుగేళ్ల ఆనర్స్‌ చదివిన విద్యార్థులు ఒక్క ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. మూడేళ్లు చదివి బయటకు వచ్చిన వారు రెండేళ్ల పీజీ చేయాల్సి ఉంటుంది. 2020-21లో డిగ్రీలో చేరిన విద్యార్థులు ఈ ఏడాది నాలుగేళ్లు పూర్తి చేసుకొని బయటకు వస్తారు. ప్రభుత్వం నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని తీసుకొచ్చినా, ప్రైవేటు కళాశాలలు మాత్రం మూడేళ్ల కోర్సునే అమలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అయిదారు ప్రభుత్వ కళాశాలల్లోనే నాలుగేళ్ల ఆనర్స్‌ ఉంది. వాటిలో అందరూ కలిపి 150 మంది కూడా లేరు. నాలుగేళ్లు చదివిన వారికి నేరుగా పీజీ రెండో ఏడాదిలో ప్రవేశం కల్పిస్తారు. ప్రైవేటులో ఫీజుల చెల్లింపు లేనందున దాదాపు అన్ని యాజమాన్యాలూ పీజీ కోర్సులను మూసేశాయి. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలు, వర్సిటీల్లోనే ఉన్నాయి. నాలుగేళ్ల ఆనర్స్‌ చదివిన వారు పీజీలో రెండో ఏడాదిలో ప్రవేశించేందుకు 20% సూపర్‌ న్యూమరరీ సీట్లు పెట్టాలని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. కానీ.. దీనిపై ఇంతవరకు విద్యార్థులకు స్పష్టత ఇవ్వలేదు.

రెండేళ్ల పీజీకి రెండు ఐచ్ఛికాలు..

మూడేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థులు మొదటి, రెండు సెమిస్టర్లలో కోర్‌ కోర్సులు, మూడో సెమిస్టర్‌లో పరిశోధన మెథడాలజీ, నాలుగో సెమిస్టర్‌లో పరిశోధన ప్రాజెక్టు చేయొచ్చు. లేదంటే మొదటి మూడు సెమిస్టర్లు కోర్సు పేపర్లు, నాలుగో సెమిస్టర్‌లో ప్రాజెక్టు చేసుకోవచ్చు. మూడేళ్లు చదివిన వారు ఈ రెండింటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.

సెమిస్టర్‌కు 90 రోజుల పనిదినాలు ఉంటాయి. ఒకవేళ విద్యార్థి మొదటి ఏడాదిలో బయటకు వెళ్లిపోవాలనుకుంటే పీజీ డిప్లొమా ఇస్తారు. రెండేళ్లల్లో మళ్లీ ప్రవేశం తీసుకొని మిగతా సెమిస్టర్లు పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సుల మార్పుపై విద్యార్థులకు అవగాహన కల్పించలేదు.

పీజీలో రెండు రకాల ఐచ్ఛికాలు ఇచ్చిన ఉన్నత విద్యామండలి విశ్వవిద్యాలయాల ఇష్టమని వెల్లడించింది. ఏ వర్సిటీ ఏ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుంటుంది.. ఏ కోర్సులను అమలు చేస్తుందన్న దానిపై అయోమయం నెలకొంది.

రెండేళ్ల పీజీ కోర్సు ప్రవేశానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. కానీ, ఈ విషయం ఇప్పటికీ చాలా మంది పిల్లలకు తెలియదు.

అన్నీ ప్రాజెక్టులేనా..?

నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ చేసిన విద్యార్థులు మూడు, నాలుగు సెమిస్టర్‌లలో పరిశోధన ప్రోగ్రామ్‌ చేసుకోవచ్చు. లేదంటే మూడో సెమిస్టర్‌లో కోర్సు వర్క్‌, నాలుగో సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌ చేసుకోవచ్చు.

ఆనర్స్‌ వారికి రెండు ఐచ్ఛికాలు ఇచ్చిన ఉన్నత విద్యామండలి ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ చేసిన వారికి మాత్రం ఒక్క అవకాశమే ఇచ్చింది. మూడో సెమిస్టర్‌లో కోర్సు వర్క్‌, నాలుగో సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌ చేయాలంది. వాస్తవంగా నాలుగేళ్ల రీసెర్చ్‌ డిగ్రీలో నాలుగో ఏడాదిలో ఈ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ చేస్తారు. మళ్లీ పీజీలో నాలుగో సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్‌ పెట్టారు. ఒక విద్యార్థి ఇన్ని పర్యాయాలు ప్రాజెక్టు వర్క్‌ చేస్తే కోర్‌ కోర్సు నేర్చుకునేందుకు అవకాశం ఎక్కడ ఉంటుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఆనర్స్‌ పరిశోధన చేసిన వారికి ఐచ్ఛికం లేకుండా ఒకే విధానం ప్రవేశ పెట్టింది.

రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ చదువుతున్న వారు 150 మందిలోపు ఉన్నప్పుడు విద్యార్థులను అయోమయానికి గురి చేసేలా పీజీలో ఇన్ని రకాలు ఎందుకని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ కోర్సులను డిజైన్‌ చేసినప్పుడు ఒక ఏడాది ముందు నుంచే విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించాలని చెబుతున్నారు


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.