• facebook
  • whatsapp
  • telegram

Group-1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు తీర్పుపై ఏపీపీఎస్సీ అప్పీల్‌

* 19 న  విచారణ చేయనున్న ధర్మాసనం

ఈనాడు, అమరావతి: మూల్యాంకనంలో అవకతవకలు జరిగినందున 2018 గ్రూప్‌-1 ప్రధాన పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మార్చి 13న ఇచ్చిన తీర్పుపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం రెండోసారి, మూడోసారి జరిగిందని సింగిల్‌ జడ్జి పొరపాటు పడ్డారని తెలిపారు. జవాబుపత్రాలను మళ్లీ మళ్లీ మూల్యాంకనం చేయడం ఏపీపీఎస్సీ నిబంధన 3(9)కి విరుద్ధమని సింగిల్‌ జడ్జి తీర్పులో పేర్కొన్నారన్నారు. వాస్తవానికి అభ్యర్థులు అభ్యంతరం లేవనెత్తినప్పుడు జవాబు పత్రాలను మళ్లీ దిద్దడం(రీవాల్యూషన్‌) గురించి నిబంధన 3(9) చెబుతోందని వెల్లడించారు. డిజిటల్‌ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే తాము మాన్యువల్‌గా జవాబు పత్రాలు దిద్దామని వెల్లడించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో సింగిల్‌ జడ్జి పొరపాటు పడ్డారన్నారు.

2021 డిసెంబరు - 2022 ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి మాన్యువల్‌ మూల్యాంకనం జరిగిందన్న ఆరోపణను.. ఆధారాలను పరిగణనలోకి తీసుకొని తేల్చాల్సిన అంశమని వెల్లడించారు. ఈ విషయాన్ని రిట్‌ పిటిషన్లలో తేల్చలేరన్నారు. ఒకవేళ ఆ సమయంలో మూల్యాంకనం జరిగిందనుకున్నా.. ఫలితాలను సిద్ధం చేయలేదన్నారు. ఆ సమయంలో జరిగిన మూల్యాంకనంలో తాము ఎంపికయ్యామని, తమ హక్కులకు భంగం కలిగిందని పిటిషనర్లు చెప్పడం లేదని వివరించారు. మాన్యువల్‌ మూల్యాంకనం ఒక్కసారే జరిగిందని, పేపర్లు దిద్దిన ఏజెన్సీకి చెల్లింపుల విషయంలో తాము ఇచ్చిన వివరణను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. ‘ఏపీపీఎస్సీ వివిధ సంస్థల్లో నియామకాలకు చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి దస్త్రాల ఆధారం లేకుండా 2021 డిసెంబరు - 2022 ఫిబ్రవరి మధ్య మొదటిసారి జరిగిన మూల్యాంకనానికి సొమ్ము చెల్లించినట్లు భావించడానికి వీల్లేదు. పోస్టులకు ఎంపికైన 169 మందిలో కొందరు మాత్రమే హైకోర్టులో వాదనలు వినిపించారన్న విషయాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది’ అని పేర్కొన్నారు. పిటిషనర్లు మొదటిసారి జరిగిన డిజిటల్‌ మూల్యాంకనంలో ఎంపికయ్యారని గుర్తుచేశారు. డిజిటల్‌ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్‌ విధానంలో జవాబుపత్రాలను దిద్దాలని హైకోర్టు జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను వారు సవాలు చేయలేదన్నారు. తర్వాతి ఎంపిక ప్రక్రియలో వారు పాల్గొన్నారని తెలిపారు. మాన్యువల్‌గా పేపర్లు దిద్దాక ఎప్పుడైతే అనర్హులయ్యారో ప్రక్రియను ప్రశ్నించడం మొదలు పెట్టారన్నారు. తాజాగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించేందుకు న్యాయమూర్తి.. తగిన కారణాలను పేర్కొనలేదన్నారు. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని మార్చి 13న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు.

 ఏపీపీఎస్సీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తమ అప్పీల్‌పై అత్యవసర విచారణ జరపాలని  మార్చి 18న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌లతో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు.  విచారణ 19 న జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.