• facebook
  • whatsapp
  • telegram

Counselling: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌పై దృష్టిపెట్టాలి

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ రాజీనామాతో ప్రక్రియ జాప్యం

విద్యా సంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల ఎదురుచూపులు 

కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు
 


అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో జాప్యం కొనసాగుతోంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఇన్‌ఛార్జిగా ఉన్న వైస్‌ ఛైర్మన్‌ రామమోహనరావు వీటిపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. తెలంగాణలో జులై 15 నుంచి తరగతులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను జూన్‌ 27 నుంచి నిర్వహించేందుకు తెలంగాణలో షెడ్యూల్‌ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్రంలో ఇంతవరకు స్పష్టత లేదు. కౌన్సెలింగ్‌లో కీలకంగా వ్యవహరించే ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, కార్యదర్శులను వైకాపా ప్రభుత్వంలో నియమించారు. ప్రభుత్వం మారినందున వీరు సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


4 లక్షల మందికిపైగా నిరీక్షణ

డిగ్రీ, ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ కోసం 4 లక్షలకు పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 2,65,444 మంది అర్హత సాధించారు. వీరిలో కొంతమంది టాపర్లు తప్ప మిగతా అందరూ ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా డిగ్రీలో ఏటా 1.50 లక్షలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడి 60 రోజులకు పైగా గడిచింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ వర్సిటీలు దాదాపు ఇప్పటికే ఇంజినీరింగ్‌ ప్రవేశాలు పూర్తి చేశాయి. కొన్ని కళాశాలలు యాజమాన్యా కోటా సీట్లకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో సీటు ఎక్కడొస్తుంది.. కోరుకున్న బ్రాంచి, కళాశాలలో వస్తుందా.. లేదంటే డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు తీసుకోవాలా.. లేకుంటే యాజమాన్య కోటాలో చేరేందుకు ముందుగా ఒప్పందం చేసుకోవాలా? అనేదానిపై విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ త్వరగా చేపట్టాలని వారంతా కోరుతున్నారు. 
అనుమతులు వేగవంతం చేయాలి


అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజినీరింగ్‌ సీట్లకు సంబంధించిన అనుమతులను జూన్‌ 30 వరకు ఇచ్చేందుకు గడువు విధించింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు కళాశాలలకు అనుమతులు వచ్చేశాయి. వీటికి అయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 11 వందలకు పైగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిల్లో 40 శాతానికి పైగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి అనుమతుల పొడిగింపునకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. కొన్ని యాజమాన్యాలు రుసుములు చెల్లించలేదు. రెండేళ్లకు ఒకేసారి అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. అనుతుల పొడిగింపునకు రుసుములు చెల్లించలేదు. దీంతోపాటు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలి.


ఫీజులపై అస్పష్టత

ఇంజినీరింగ్‌ కళాశాలలకు గత ప్రభుత్వం ఒక్క ఏడాదికే ఫీజులను నిర్ణయించింది. ఈ గడువు 2023-24తో పూర్తయింది. ఫీజులపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. హైకోర్టు ఆదేశాలతో కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించి, అంతకుముందున్న దానిపై 10% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం వద్ద అప్పీల్‌ చేశారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. దీంతో కళాశాలలకు కొత్తగా ఫీజులు నిర్ణయించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజులు నిర్ణయించాలని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని విన్నవిస్తున్నాయి. కళాశాలలకు ఫీజులు ఖరారు కాకపోతే కౌన్సెలింగ్‌ నిర్వహించడం కష్టమవుతుంది. కన్వీనర్‌ కోటా ఫీజులపై మూడింతలు ఎక్కువగా యాజమాన్య కోటా కింద వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫీజులు నిర్ణయం కాకపోతే యాజమాన్య కోటాలో చేరేవారు ఎంత చెల్లించాలనే దానిపైన సందిగ్ధత ఏర్పడుతుంది.


   ఏపీ, టీఎస్‌ మాక్ కౌన్సెలింగ్స్ - 2024   


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.