• facebook
  • whatsapp
  • telegram

Medical: స్థానిక విద్యార్థులతోనే వైద్య సీట్ల భర్తీ

* పదేళ్ల కాలపరిమితి’ ముగిసినందున.. స్థానికేతర కోటా విధానానికి స్వస్తి

* న్యాయ శాఖ పరిశీలనలో ప్రతిపాదనలు

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. జూన్‌ 2తో పదేళ్ల కాలపరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే వైద్య విద్య సీట్ల భర్తీ చేపట్టనున్నారు. అందుకోసం సిద్ధం చేసిన దస్త్రాలు ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఉత్తర్వుల జారీ లాంఛనమే కానుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. 2014కు ముందు ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌/పీజీ సీట్లను స్థానిక, స్థానికేతర కోటాలో 85:15 నిష్పత్తి ప్రకారం కేటాయిస్తున్నారు. 15% కోటాలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కాదు. ఇప్పటికే 2014 తరువాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని సీట్లలో స్థానిక విద్యార్థులే ప్రవేశాలు పొందుతున్నారు. 

రాష్ట్ర కళాశాలల విషయంలోనూ..

విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాలలు రాష్ట్రస్థాయి విద్యా సంస్థలుగా ఉన్నాయి. వీటిలో కిందటి విద్యా సంవత్సరం వరకు 42:32:22 నిష్పత్తిలో ఏయూ, ఓయూ, ఎస్వీయూ ప్రాంతాల వారీగా సీట్లను కేటాయిస్తూ వచ్చారు. పునర్విభజన చట్టం-2014 ప్రకారం పదేళ్ల కాల పరిమితి ముగిసినందున ఈ రెండు వైద్య కళాశాలల్లోనూ స్థానిక విద్యార్థులతోనే సీట్లను భర్తీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇకపై ఈ రెండింటికీ రాష్ట్రస్థాయి హోదా తొలగనుంది. ఈ ఉత్తర్వులూ త్వరలో వెలువడనున్నాయి. సంబంధిత ప్రతిపాదనలు విశ్వవిద్యాలయం నుంచి ప్రభుత్వం ద్వారా న్యాయ శాఖకు వెళ్లాయి.

మినహాయింపు కోరిన ఆరోగ్య వర్సిటీ

ఎంబీబీఎస్‌ ‘సి’ కేటగిరీ సీట్లను జాతీయస్థాయిలో భర్తీ చేస్తామని ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరంలో అమలు చేయొద్దని కోరుతూ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం జాతీయ వైద్య కమిషన్‌కు తాజాగా లేఖ రాసింది. ‘సి’ కేటగిరీ సీట్ల విధానంపై మా ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాలు మాకు లేఖ రాశాయి. దీంతోపాటు ప్రవేశాల నిర్వహణకు తక్కువ సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పులు చేయొద్దు’ అని అందులో పేర్కొంది.

పీజీ ఇన్‌సర్వీస్‌ కోటా సీట్ల తగ్గింపునకు కమిటీ సిఫార్సు

రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా చేరిన వారికి ఇన్‌సర్వీస్‌ కింద పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు నిర్దేశించిన 30% కోటాను ఎంపిక చేసిన స్పెషాల్టీల్లో 15%కు తగ్గించాలని ప్రత్యేక కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2022 నుంచి పీజీ వైద్య విద్యలో క్లినికల్‌ సబ్జెక్టుల్లో 30%, నాన్‌-క్లినికల్‌ సబ్జెక్టుల్లో 50% సీట్లను రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లో పనిచేసే ఎంబీబీఎస్‌ వైద్యులకు ఇన్‌సర్వీసు కోటాలో కేటాయిస్తున్నారు. ఇలా 2023లో సుమారు 500 మంది పీజీ సీట్లు పొందారు. నాన్‌-క్లినికల్‌ స్పెషాల్టీ సీట్లలో ప్రస్తుతం ఉన్న 50% సీట్లను 30%కు కుదించాలని కమిటీ సిఫార్సు చేసింది. క్లినికల్‌ స్పెషాల్టీల్లోని పీడియాట్రిక్స్, గైనిక్, రేడియాలజీ, జనరల్‌ మెడిసన్, ఎనస్థీషియా కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే ఇన్‌సర్వీస్‌ కోటాను పరిమితం చేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వంలో సమాలోచనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల సంఖ్య అవసరాలకు తగ్గట్లు ఉందని, పీజీ వైద్య విద్యను పూర్తిచేసిన వారు తిరిగి విధుల్లోకి రావడం లేదని.. వచ్చినా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నారన్న ఉద్దేశంతో కమిటీ ఈ సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌సర్వీస్‌ కోటాను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆరు రాష్ట్రాల వైద్య సంఘాల పోరాటాల ఫలితంగా, న్యాయస్థానాల ఆదేశాలతో ఇన్‌సర్వీస్‌ కోటాలో వైద్యులు సీట్లు పొందుతున్నారని గుర్తుచేసింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.