• facebook
  • whatsapp
  • telegram

TSPSC: గ్రూప్‌-2 రాత పరీక్షలపై సందిగ్ధం

* రీషెడ్యూలా.. యథావిధిగా కొనసాగిస్తారా!

* టీఎస్‌పీఎస్సీ నిర్ణయం కోసం ఉద్యోగార్థుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ‘గ్రూప్‌-2’ రాతపరీక్షలపై సందిగ్ధం నెలకొంది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తారా? యథావిధిగా కొనసాగుతాయా? అనే విషయమై టీఎస్‌పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్‌-2 పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. 2023, జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూల్‌ జారీచేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు నవంబరు 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్‌ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్‌ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్‌పీఎస్సీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్‌కే ఉంటుందని, ఈమేరకు కమిషన్‌ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ చర్చలు జరుపుతున్నా నిర్ణయం వెలువడలేదు.


సాంకేతిక అడ్డంకులు..

టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా.. ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నా.. పరీక్ష వాయిదా వేయాలన్నా.. ఫలితాలు వెల్లడించాలన్నా.. కమిషన్‌ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి బోర్డులో ఛైర్మన్‌తో పాటు అయిదుగురు సభ్యులున్నారు. అనంతరం ఛైర్మన్‌ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండాపోయింది. కాగా ఛైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి పంపిన వారెవరూ కమిషన్‌కు రావడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని నిపుణులు చెబుతున్నారు.


కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే..

టీఎస్‌పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్‌-2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబా రాజీనామా చేయనందున వారిలో సీనియర్‌ సభ్యులైన ఒకరికి యాక్టింగ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఛైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్తబోర్డును ఏర్పాటుచేస్తే, ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్‌ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త బోర్డు ఏర్పాటుకు ఛైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని సంప్రదించింది. ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్‌ వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రభుత్వం కొత్తబోర్డు ఏర్పాటు చేసిన తరువాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుంది.


 


టీఎస్‌పీఎస్సీ  గ్రూప్‌ - II -స్టడీ మెటీరియల్ 

పేప‌ర్ - I 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పేప‌ర్ - II 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు



పేప‌ర్ - III 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు



పేప‌ర్ - IV 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫిజియోథెరపీతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు

‣ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

‣ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 450 ‘ఏవో’ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.