• facebook
  • whatsapp
  • telegram

ఏఐ నామ సంవత్సరం

* విద్య, ఉపాధి రంగాల్లో కొత్త విప్లవం.. కృత్రిమ మేధ


తరగతి గది అంటే ఓ టీచర్‌.. ఆయన చేతిలో పుస్తకం.. అందరికీ ఒకటే పాఠం. కానీ, ఇక మీదట ఇలా ఉండకపోవచ్చు. ఏ విద్యార్థికి ఏం కావాలో గుర్తించి అదే చెబుతారు.. కృత్రిమ మేధ (ఏఐ) టీచర్లు! అంతేకాదు.. ఎక్కడో హార్వర్డ్‌ వర్సిటీలో కోట్లు ఖర్చయ్యే చదువులు కూడా ఓ కుగ్రామంలో కూర్చుని చదివేసుకోవచ్చు!

* ఇలా విద్య, వైద్య, ఉపాధి రంగాలే కాదు.. ఇందుగలదందు లేదని సందేహంబు వలదు... అన్నట్లు ఏఐ ప్రవేశించని రంగమే లేదు. ఇది అనేకానేక సరికొత్త అవకాశాలను సృష్టిస్తోంది. కొత్త సంవత్సరంలో మన జీవితాలను కొత్త పుంతలు తొక్కించబోతోంది.. ఏఐ!


సరికొత్త సాంకేతికతలతో ఉద్యోగావకాశాలు

కృత్రిమ మేధ (ఏఐ) మన ప్రపంచాన్ని వేగంగా మారుస్తోంది. విద్యారంగంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో ఏఐ పాత్రను, ఎదురయ్యే సవాళ్లను విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, విద్యార్థులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.


ఎవరి పాఠాలు వారికే!

‘అందరికీ ఒకే పాఠం’ అనే విధానానికి కాలం చెల్లుతోంది. ఏఐ ఆల్గరిథంలు విద్యార్థుల బలాబలాలను అర్థం చేసుకోవడం ద్వారా ఎవరి పాఠాలు వారికే సిద్ధం చేస్తాయి. ఏఐ ఆధారిత పరీక్షలు బహుళైచ్ఛిక ప్రశ్నలను మించి ఉంటాయి. ఇంటరాక్టివ్‌ ప్రాంప్ట్‌లు, రియల్‌ టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ ద్వారా సృజనాత్మకతను కొలిచే సామర్థ్యం కృత్రిమ మేధకు ఉంటుంది. ఏఐ ట్యూటర్ల ద్వారా విద్యార్థులకు అదనపు మద్దతు అందుతుంది. ప్రశ్నలకు సమాధానాలతో పాటు వ్యక్తిగత మార్గదర్శకత్వం లభిస్తుంది. బోధకులకు ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ/ఆగ్మెంటెడ్‌ రియాలిటీ సహాయపడుతుంది.


అందరికీ అన్నీ

కృత్రిమ మేధ ప్రవేశం తర్వాత.. నాణ్యమైన విద్యను అందించడానికి భౌగోళిక, ఆర్థికపరమైన అడ్డంకులు ఇక ఉండవు. ఆన్‌లైన్‌ విద్యావకాశాలు, వ్యక్తిగత బోధన అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఏఐ ట్యూటర్లు, వర్చువల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. వీటికి ఆర్థికపరమైన అడ్డంకులు ఉండవు. ఏ స్థాయి విద్యార్థులకైనా మెరుగైన అభ్యాస వాతావరణాన్ని కృత్రిమ మేధ సృష్టిస్తుంది.


సవాళ్లు లేకపోలేవు..

కృత్రిమ మేధతో ప్రయోజనాలతో పాటే సవాళ్లు కూడా ఉన్నాయి. విశ్వసనీయత, డేటా భద్రత అతిపెద్ద సవాలు. ప్రస్తుతం ఏఐ ఇంకా విధాన రూపకల్పన దశలో ఉంది. మార్గదర్శకాలు సిద్ధం కావడానికి సమయం పట్టవచ్చు.


సాంకేతిక నిపుణులదే పైచేయి

డేటా విశ్లేషణ, కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి నైపుణ్యాలకు డిమాండు పెరుగుతుంది. వినియోగదారుల ప్రవర్తనను ఊహించే ఆల్గరిథంలు రూపొందించడం, క్లౌడ్‌ ఆధారిత ప్రపంచానికి సురక్షిత నెట్‌వర్క్‌లను రూపొందించడం లాంటి పనులు చేసే సాంకేతిక నిపుణులు సూపర్‌స్టార్లు అవుతారు.


ఆట లాంటి చదువు

గేమిఫికేషన్‌ ద్వారా నేర్చుకోవడంతో.. చదువంటే ఒక ఆటలా మారుతుంది. గేమిఫైడ్‌ అనుభవాలు, వ్యక్తిగతీకరించిన కథాంశాల్లాంటి డైనమిక్‌, ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను ఏఐ ఇవ్వగలదు. ఆకర్షణీయమైన కంటెంట్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకోవడం అంటే ఒక సబ్జెక్టులో పట్టు సాధించడం. ఇది ఏఐతోనూ, అది లేకుండా కూడా ఉంటుంది. నిరంతర అభ్యాసం చాలా ముఖ్యం. ఏ వయసులో ఉన్నవారికైనా వారికి తగిన పాఠాలను ఏఐ ఇవ్వగలదు.


ఆటోమేషన్‌ ప్రభావం

కొన్ని మూస ఉద్యోగాలు కనుమరుగవుతాయి. అధిక నాణ్యత గల పర్యవేక్షణకే భవిష్యత్తు. ఉద్యోగాలను కాపాడుకోవాలంటే ఏఐ, రోబోటిక్స్‌ లాంటి వాటిలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. 2024లో ఉద్యోగ మార్కెట్లో చాలా మార్పులు వస్తాయి. ఒకేలాంటి పని మళ్లీమళ్లీ చేయక్కర్లేదు. అనవసరమైన ఉద్యోగాలూ తగ్గుతాయి.


మాంద్యం మరో అవకాశం: మధు వడ్లమాని

2024లో భారీగా ఉద్యోగాలు పోవచ్చని, మాంద్యాన్ని ఎదుర్కోబోతున్నామని చాలామందిలో సందేహాలు ఉన్నాయి. సరికొత్త నైపుణ్యం సాధించడానికి మాంద్యం అవకాశమిస్తుంది. సానుకూలత, నిరంతర అభ్యాసం గొప్ప ఆయుధాలు. స్వీయ అభివృద్ధిపై దృష్టిపెట్టడానికి, రాబోయే మార్పులను స్వీకరించడానికి సదా సంసిద్ధంగా ఉండాలి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.