• facebook
  • whatsapp
  • telegram

Education: 2024-25లో ‘ఉన్నత విద్య’లో యథావిధిగా 15% నాన్‌లోకల్‌ కోటా!  

* మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం

* ఈ వారంలోనే తేదీల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2024-25) రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలను గతంలో మాదిరిగా యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా ఏపీ విద్యార్థులు కూడా 15 శాతం నాన్‌లోకల్‌ కోటా సీట్లకు పోటీపడి దక్కించుకోవచ్చు. ప్రభుత్వ స్థాయిలో ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై సంకేతాలు ఇవ్వడంతో ఈ వారంలో ఎంసెట్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాన్‌లోకల్‌ కోటా సీట్లు 15 శాతం కింద ఏపీ విద్యార్థులు పోటీపడవచ్చా..? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలపాలని ఉన్నత విద్యామండలి గత డిసెంబరు లో సర్కారుకు లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టానికి జూన్‌ 2కు పదేళ్లు పూర్తవుతాయి. ఇప్పటివరకు ఎంసెట్‌తోపాటు ఆయా కోర్సుల్లో ఉన్న కన్వీనర్‌ కోటా సీట్లలో 85% తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగిలిన 15% సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడుతున్నారు. అందులో మెరిట్‌ను బట్టి సీట్లు దక్కుతాయి. ఆ ప్రకారం ఏటా సుమారు 4 వేల మంది వరకు ఏపీ విద్యార్థులు కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌లో ప్రవేశాలు పొందుతున్నారు.
 

సీట్లు భారీగా ఉన్నందున..


ఏపీ విద్యార్థులు ప్రధానంగా కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్ల కోసమే పోటీపడుతుంటారు. ఉన్నత విద్యామండలి లేఖ రాసిన నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో దీనిపై ఇటీవల చర్చ జరిగింది. వచ్చే జూన్‌ 2 లోపు పరీక్ష నోటిఫికేషన్‌ ఇచ్చినా సమస్య లేదని, ప్రవేశాల నోటిఫికేషన్‌ మాత్రం జూన్‌ 2 తర్వాత జారీ చేస్తే 100% కన్వీనర్‌ కోటా సీట్లు స్థానికులకు దక్కుతాయని కొద్ది రోజుల క్రితం వరకు భావిస్తూ వచ్చారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు ఏపీ విద్యార్థులు దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేస్తున్నందున ముందుగా ప్రవేశాల గురించి చెప్పాల్సి వస్తుందని.. పరీక్ష రాసిన తర్వాత సీట్లు ఇవ్వమంటున్నారని న్యాయస్థానానికి వెళితే సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దానికితోడు 15% నాన్‌లోకల్‌ కోటాలో పోటీపడేది ఒక్క ఏపీ విద్యార్థులే కాదు. మరోవైపు ఇప్పటికే కన్వీనర్‌ కోటాలో 20% సీట్లు మిగిలిపోతున్నాయి. ఒకవేళ జూన్‌ 2 తర్వాత ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే? అనే ప్రశ్నా తలెత్తింది. అప్పుడు జాతీయ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు సంబంధించి సమస్యలు రావొచ్చని కొందరు అధికారులు చెప్పినట్లు సమాచారం. వీటన్నింటికితోడు రాజకీయ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ సారికి యథావిధిగా ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
 

తాత్కాలిక కాలపట్టిక తయారు..


ఉన్నత విద్యామండలి సందేహాలపై సర్కారు స్పష్టత ఇచ్చినందున ఎంసెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షల తేదీలను ప్రాథమికంగా సిద్ధం చేశారు. వీటిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం పొందనున్నారు. మొత్తానికి ఈ వారంలోనే పరీక్షల కాలపట్టికను వెల్లడించనున్నారు. మే నెలలోనే అన్ని పరీక్షలను పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.