• facebook
  • whatsapp
  • telegram

MBBS :ఎంబీబీఎస్‌ సీట్లన్నీ కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేయాలి  

* నేరుగా ప్రవేశాలు కల్పించొద్దు
* ఎన్‌ఎంసీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను పూర్తిగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశించింది. కౌన్సెలింగ్‌ ద్వారా కాకుండా ఏ వైద్య కళాశాలలోనూ నేరుగా ఒక్క సీటును కూడా భర్తీ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తే వైద్య కళాశాలలు భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని, దీంతో పాటు సీట్లను సైతం కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మొదటిసారి నేరుగా ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ చేస్తే రూ.కోటి లేదా కోర్సు పూర్తయ్యేందుకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని కళాశాల జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. రెండోసారి నేరుగా ప్రవేశం కల్పిస్తే రూ.రెండు కోట్లు లేదా కోర్సు పూర్తయ్యేందుకు చెల్లించే ఫీజుకు రెండింతలు.. వీటిలో ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. మూడోసారి కూడా ఇలాగే వ్యవహరిస్తే ప్రవేశాలు పొందిన విద్యార్థుల అడ్మిషన్‌ రద్దు చేయడంతోపాటు ఆయా కళాశాలలు ఎంత మందికి ప్రవేశాలు కల్పిస్తే అందుకు రెట్టింపు సంఖ్యలో సీట్లలో కోత విధించనున్నట్లు ఎన్‌ఎంసీ వివరించింది.

* ఆ జాబితాలోని విద్యార్థులకే రిజిస్ట్రేషన్‌కు అవకాశం

2023-24 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 2023 నవంబరు 21 చివరి తేదీ అని ఎన్‌ఎంసీ తెలిపింది. ఆ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,04,891 మంది విద్యార్థులు కోర్సులో చేరినట్లు వారి వివరాలు కళాశాలలు అప్‌లోడ్‌ చేశాయని వెల్లడించింది. ఆ జాబితాలోని విద్యార్థులకు మాత్రమే ప్రాక్టిస్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 2023-24లోనూ అన్ని ఎంబీబీఎస్‌ సీట్లను విధిగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య మండళ్లను ఎన్‌ఎంసీ ఆదేశించింది. దీనికి విరుద్ధంగా అడ్మిషన్లు కల్పించి ఉంటే.. వాటిని ఏ దశలోనైనా రద్దు చేయనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది.


 


మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.