• facebook
  • whatsapp
  • telegram

Placements: టాప్‌ కళాశాలల్లో సగానికి  తగ్గిన ప్లేస్‌మెంట్లు

* ఎంపికలు 20-30 శాతంలోపే..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు ఈసారి 50 శాతానికిపైగా తగ్గాయి. ద్వితీయ శ్రేణి కళాశాలల్లో నాలుగో వంతు బీటెక్‌ విద్యార్థులకూ ఉద్యోగాలు దక్కలేదు. ఇక చిన్న కళాశాలల్లో ఆ ఊసే లేకుండా పోయింది. ఈ విద్యాసంవత్సరం(2023-24)లో రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. అమెరికాతోపాటు యూరప్‌లో నెలకొన్న ఆర్థిక మందగమనమే అందుకు ముఖ్య కారణమని, అక్కడి నుంచి ఐటీ ప్రాజెక్టులు రావడం తగ్గిందని, ఆ ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడిందని వారు పేర్కొంటున్నారు.

డిసెంబరు గడిచినా ఈసారి 50 శాతంలోపే..

రాష్ట్రంలో ఏటా 50 వేల నుంచి 60 వేల మంది బీటెక్‌ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. వారిలో 35 వేల మంది వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా వివిధ ఐటీ కంపెనీల్లో కొలువులు సాధిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) గణాంకాలూ అదే విషయం చెబుతున్నాయి. రాష్ట్రంలోని 15-20 కళాశాలల్లోనే దాదాపు 10 వేల మంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు. ఏటా బీటెక్‌ చివరి సంవత్సరం తొలి సెమిస్టర్‌ ప్రారంభం కాగానే ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి. అంటే ఈసారి 2020-21 విద్యాసంవత్సరంలో బీటెక్‌లో చేరినవారిని ఐటీ/సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొలువుల్లో నియమించుకుంటాయి. అందుకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఏటా జులై నెలాఖరులో లేదా ఆగస్టులో ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి. ప్రముఖ కళాశాలల్లో 80-90 శాతం ప్లేస్‌మెంట్లు డిసెంబరుకు పూర్తవుతాయి. కేవలం 10-20 శాతం మందే మిగులుతారు. రెండో విడతలో జనవరి నుంచి మే వరకు కొన్ని కంపెనీలు వస్తుంటాయి. మిగిలిన కొంతమంది వాటికి ఎంపికవుతుంటారు. ఈసారి టాప్‌ కళాశాలల్లో డిసెంబరు నాటికి 50-55 శాతం మంది కూడా ఎంపిక కాలేదని ఆ కళాశాలల ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. మిగిలిన పలు కళాశాలల్లో 20-30 శాతంలోపే ప్లేస్‌మెంట్లు దక్కాయి. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 2 లక్షల మందిని వివిధ సంస్థలు నియమించుకుంటుండగా.. వారిలో దాదాపు 1.70 లక్షల మందిని టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, విప్రో, డెలాయిట్, యాక్సెంచర్, క్యాప్‌జెమినీ లాంటి సర్వీస్‌ కంపెనీలే నియమించుకుంటాయి. మిగిలిన వారిని కొత్త సాఫ్ట్‌వేర్లను రూపొందించే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్, సర్వీస్‌ నౌ, ఐబీఎం లాంటి కంపెనీలు తీసుకుంటాయి. ఈసారి సర్వీస్‌ కంపెనీలు నియామకాలకు ముందుకు రాకపోవడంతో ప్లేస్‌మెంట్ల సంఖ్య భారీగా పడిపోయింది.

వివిధ కళాశాలల్లో ఇదీ పరిస్థితి...

ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో డిసెంబరు నాటికి 70-80 శాతం ప్రాంగణ నియామకాలు పూర్తయ్యేవని.. ఈసారి 55 శాతం మందే ఎంపికయ్యారని ఆ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆచార్య శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. ఎక్కువ మందిని ఎంపిక చేసుకునే సర్వీస్‌ కంపెనీలు ఇంకా రాలేదని పేర్కొన్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో ఈసారి 536 మంది విద్యార్థులకుగాను డిసెంబరు నాటికి 216 మంది, ఇప్పటివరకు 285 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె.విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సాధారణంగా డిసెంబరు నాటికి 95 శాతం ప్రాంగణ నియామకాలు పూర్తవుతాయని, ఈసారి 60 శాతం వరకే అయ్యాయని వాసవి ఇంజినీరింగ్‌ కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి కిశోర్‌ తెలిపారు. తాజాగా టీసీఎస్‌ నియామకాలు ప్రారంభించడంతో కొంత ఆశ మొదలైందన్నారు. వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో యాక్సెంచర్‌ సంస్థ 300 మందిని ఎంపిక చేసుకుందని కళాశాల ప్రాంగణ నియామకాల డైరెక్టర్‌ డాక్టర్‌ పార్థసారథి తెలిపారు. టీసీఎస్‌ కూడా తాజాగా ఆన్‌లైన్‌ పరీక్ష(టీసీఎస్‌ ఎన్‌క్యూటీ) నిర్వహించిందని, ఫలితాలు రావాల్సి ఉందన్నారు. మొత్తానికి 50-55 శాతం మంది వరకు డిసెంబరు నాటికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. వచ్చే మే నాటికి కాగ్నిజెంట్, టీసీఎస్‌ కంపెనీల వల్ల 80 శాతం మందికి ఉద్యోగాలు రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలో డిసెంబరు (2022) నాటికి 70 శాతం నియామకాలు పూర్తయ్యాయని, ఈసారి 20 శాతం మాత్రమే అయ్యాయని స్టాన్లీ కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి ఆర్‌.ప్రవీణ్‌ తెలిపారు. ఇంకా కాగ్నిజెంట్, క్యాప్‌ జెమినీ, హెచ్‌సీఎల్‌ లాంటివి రావాల్సి ఉందని, ఈసారి ఎంపికల సంఖ్య తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. 
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.