• facebook
  • whatsapp
  • telegram

ITI: ఐటీఐల్లో బోధకుల కొరత

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో మొత్తం 11 ట్రేడ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఏటా 360 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మంజూరైన బోధకుల పోస్టులు 26 కాగా.. పనిచేస్తున్నవారు 11 మంది మాత్రమే. కీలకమైన డిప్యూటీ టెక్నికల్, సహాయ టెక్నికల్‌ అధికారుల పోస్టులు 21 ఉండగా.. తొమ్మిది మందే ఉన్నారు. అరకొర సిబ్బంది, మారుతున్న కోర్సులకు అనుగుణంగా కొత్తగా నియామకాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే పట్టణంలోని పిల్లలమర్రి ప్రభుత్వ ఐటీఐలో మొత్తం 11 బోధన పోస్టులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు అధ్యాపకుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా, అందుబాటులోని ట్రేడ్లకు అనుగుణంగా బోధన సిబ్బంది లేరు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా.. వాటిని బోధించేందుకు పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. గత పదేళ్ల కాలంలో ఐటీఐల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల్లో కొందరి క్రమబద్ధీకరణ మినహా కొత్త పోస్టులు భర్తీ కాలేదు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ తర్వాత ప్రభుత్వ ఐటీఐలకు మంజూరైన పోస్టుల్లో సగానికిపైగా ఖాళీగానే ఉన్నాయి. 

బోధన సిబ్బంది నియామకంతోనే నైపుణ్య శిక్షణ లక్ష్యం సాకారం..

పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 65 ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రా (ఏటీసీ)లుగా మార్చుతూ.. అక్కడి విద్యార్థులకు స్వల్ప, దీర్ఘకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే ఐటీఐల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. వీటిలో మొత్తం 38 ట్రేడ్‌లు కొనసాగుతున్నాయి. వీటిని బోధించేందుకు మంజూరైన పోస్టులు 1,295 ఉండగా.. రెగ్యులర్, ఒప్పంద అధ్యాపకులతో కలిపి 657 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుత బోధకుల్లోనూ ఎక్కువ మంది పాత టెక్నాలజీ, ట్రేడ్‌లను బోధిస్తున్నవారే ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త ట్రేడ్‌లు మంజూరైనా.. వాటి బోధనకు పోస్టులు భర్తీ కాలేదు. కొత్త ట్రేడ్‌లలో దాదాపు 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో ఏటా కొత్త ప్రవేశాలపై ప్రభావం పడుతోంది. నైపుణ్య శిక్షణ కోసం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా టాటా సంస్థ ప్రతినిధులు విద్యార్థులతో పాటు సంబంధిత ట్రేడ్‌లలో బోధకులకు శిక్షణ అందిస్తారు. అయితే ఎవరికి శిక్షణ ఇప్పించాలన్న విషయమై ఉపాధి కల్పన శాఖలో సందిగ్ధం నెలకొంది. పాత టెక్నాలజీపై బోధన చేస్తున్నవారికి ఇవ్వాలా? లేదా ఉన్నత సాంకేతిక విద్య అర్హతలు కలిగిన పట్టభద్రులను నియమించి.. వారికి ఇవ్వాలా? అన్న విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. టాటా ప్రాజెక్టు అమలులో భాగంగా కనీసం 400 మంది నియామకం చేపడితేనే లక్ష్యం నెరవేరుతుందని ఉపాధి కల్పన శాఖ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. 



మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.