• facebook
  • whatsapp
  • telegram

TOEFL exam: టోఫెల్‌ పరీక్ష ఇక రెండు గంటల్లోపే..

* విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త నిర్ణయం.. 

* ‘ఈనాడు’తో టోఫెల్‌ గ్లోబల్‌ హెడ్‌ ఒమర్‌ చిహాన్‌ ముఖాముఖి 
 


ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు టోఫెల్‌ పరీక్షను రెండు గంటల్లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు టోఫెల్‌ సంస్థ గ్లోబల్‌ హెడ్‌ ఒమర్‌ చిహాన్‌ తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నదే తమ లక్ష్యమన్నారు. భారత్‌ నుంచి ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని.. 2030 నాటికి అది 5 లక్షలకు చేరే అవకాశాలున్నట్లు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా అత్యంత కట్టుదిట్టంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా ఇతరులు టోఫెల్‌ పరీక్ష పాస్‌ చేయిస్తామని, అభ్యర్థి లేకుండా అర్హత పరీక్ష ధ్రువపత్రం ఇప్పిస్తామంటే నమ్మొద్దని సూచించారు. జులై 10న  హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఒమర్‌ చిహాన్‌ టోఫెల్‌ పరీక్ష తీరుతెన్నులు, మార్పులు, చేర్పులపై ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.

ఆంగ్లభాష అర్హత పరీక్షలతోపాటు ఇతర పరీక్షల నిర్వహణలో ప్రస్తుతం ఎలాంటి ధోరణి కొనసాగుతోంది ?

టోఫెల్‌ సహా ఇతర పరీక్షల నిర్వహణలో విశ్వవ్యాప్తంగా సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థుల తెలివితేటలు, ఆలోచన విధానాలను నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో విద్యార్థులు చదువుకున్న సబ్జెక్టులతోపాటు వారి ఐచ్ఛికాంశాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తున్నారు.

ఆన్‌లైన్‌ విధానంలోనే ఆంగ్లభాషా నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా?

ఆంగ్లభాషలో నైపుణ్యం సాధించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతంలో 3 గంటల పాటు నిర్వహించే పరీక్షను.. విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రెండు గంటల్లోపే రాసేలా మార్పులు చేశాం. ప్రతి విద్యార్థి గరిష్ఠంగా 116 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం వేర్వేరు దేశాల విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా, ఐరోపాలకు వెళ్తుండగా.. ఆయా దేశాలపై కాకుండా మీరు ఎక్కువగా భారత్‌పైనే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు?

ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో చదువుకుంటున్న యువకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం లక్షలమంది అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, జర్మనీలను ఎంచుకుంటున్నారు. వారందరికీ ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పెంచేందుకు, టోఫెల్‌ ధ్రువపత్రంతో సులభంగా వారు విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ మా కార్యకలాపాలను విస్తరిస్తున్నాం.

అమెరికా, కెనడాలతో పాటు ఐరోపా దేశాల్లోని విశ్వవిద్యాలయాలు భారత్‌లోని పలు విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అక్కడి విద్యార్థులు ఇక్కడికి, ఇక్కడి విద్యార్థులు అక్కడికి వెళ్లనున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్‌లో ఎలాంటి ఫలితాలిస్తాయి ?

విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లోని యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం శుభ పరిమాణం. భారత విద్యార్థులతో పోల్చుకుంటే.. విదేశీ విద్యార్థులకే ఎక్కువ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఎందుకంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, విభిన్నమైన జీవనశైలులు, ఆచార వ్యవహారాలు.. ముఖ్యంగా కష్టపడే మనస్తత్వం విదేశీ విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిజీవితంలో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

టోఫెల్‌ పరీక్షలో మాస్‌ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడం, పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. పరీక్ష నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టలేరా?

టోఫెల్‌ పరీక్షలో ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష సమగ్రత, నిర్వహణను ఇప్పటివరకూ ఎవరూ తప్పుపట్టలేదు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కార్యచరణ రూపొందించాం. భవిష్యత్తులో మేం తీసుకుంటున్న చర్యలు అందరికీ తెలియజేస్తాం.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.