• facebook
  • whatsapp
  • telegram

Education: విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు

ఈనాడు, అమరావతి: చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో సాగించిన అసంబద్ధ విధానాల వల్ల చాలా కోర్సులు, విభాగాలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. విద్యార్థుల నుంచి ఆదరణ లేదంటూ చాలా వర్సిటీల్లో కొన్ని కోర్సులను మూసివేయగా.. మరికొన్నింటిని ఇతర విభాగాల్లో విలీనం చేసేశారు. ఆర్ట్స్‌ విభాగంలో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. కోర్సులను మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మార్పు చేయకుండా డిమాండ్‌ లేదంటూ మూసివేయడం లేదా విలీనం చేశారు. కొత్తగా అధ్యాపక పోస్టుల మంజూరు అవసరం లేకుండా చేసేందుకే ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో విభాగాల హేతుబద్ధీకరణ పేరుతో విలీన ప్రక్రియ చేపట్టారు. ఒక విభాగాన్ని మరో దాంట్లో విలీనం చేసినప్పుడు ఆ స్థాయిలోనే అధ్యాపక పోస్టులు ఇవ్వాల్సి ఉండగా.. పని భారం లేదంటూ పోస్టులకు కోత వేశారు. ప్రతి ప్రోగ్రామ్‌కూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు సహాయ ప్రొఫెసర్లు ఉండాలి. ఒక్కో విభాగాన్ని ప్రత్యేకంగా ఉంచితే ఈ స్థాయిలో పోస్టులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో విలీనం చేశారు. ఒక విధానమంటూ లేకుండా సాగిన హేతుబద్ధీకరణతో వర్సిటీల పరిస్థితి దారుణంగా తయారైంది.


ఇష్టానుసారంగా కోర్సుల విలీనం..

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ విభాగాలను కలిపేశారు. ఈ మూడింటిని ఒక్క విభాగంగా నిర్ణయించారు. సైన్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సెంటర్‌ను భౌతికశాస్త్రం విభాగంలో, ఆర్కియాలజీని చరిత్ర విభాగంలో విలీనం చేశారు. ఇలా చేయడంతోపాటు పని భారం తక్కువగా ఉందంటూ కొన్ని పోస్టులను తీసేశారు. ఇలా ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే 200 అధ్యాపక పోస్టులను రద్దు చేశారు. గతంలో మంజూరు చేసిన పోస్టులను హేతుబద్ధీకరణతో పేరుతో మిగులుగా తేల్చి, ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు. 

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తమిళం, సంస్కృతాన్ని దూరవిద్య విభాగంలో కలిపేశారు. సోషల్‌వర్క్, మానవ హక్కులను సోషియాలజీ విభాగంలో చేర్చారు. ఇలా కలిపేసి పనిభారం లేదంటూ ఈ వర్సిటీలో 150 పోస్టులను రద్దు చేశారు. వీటిని ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు. 

‣ ఆచార్య నాగార్జున వర్సిటీలో పొలిటికల్‌ సైన్సు, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ను కలిపేశారు. సోషియాలజీ, సోషల్‌వర్క్‌ను ఒకే విభాగంలోకి తీసుకొచ్చారు. బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీలతోపాటు ఆర్థికశాస్త్రం, గ్రామీణాభివృద్ధిని విలీనం చేసేశారు. గ్రామీణాభివృద్ధి శాఖలో ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉండగా.. విభాగాలను కలిపేసి, పోస్టుల భర్తీలో గందరగోళం సృష్టించారు. 

‣ విక్రమసింహపురిలో ఎంబీఏ, కామర్స్‌ విభాగాలను కలిపేశారు. మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ విభాగాలను విలీనం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోనూ ఇదే విధానాన్ని పాటించారు. కామర్స్, మేనేజ్‌మెంట్‌ విభాగాలను విలీనం చేయగా.. ఆర్థిక శాస్త్రం, గ్రామీణాభివృద్ధి విభాగాలను కలిపేశారు. 

ద్రవిడ వర్సిటీలో ఎడ్యుకేషన్, మానవ వనరుల విభాగాలను విలీనం చేశారు. చరిత్ర, ఆర్కియాలజీ, కల్చర్‌ను ఒకే విభాగంగా ఏర్పాటు చేశారు. ఒక్క విభాగం ఇచ్చే పోస్టులనే కేటాయించారు. ఈ వర్సిటీలో 14 పోస్టులను మిగులుగా తేల్చి వీటిని ఇతర వర్సిటీలకు సర్దుబాటు చేశారు.


అటు.. ఇటు మార్పులతో అగాధం..

ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ద్రవిడ, జేఎన్‌టీయూ కాకినాడల్లో సిబ్బందికి పని భారం లేదంటూ కొన్ని పోస్టులను రద్దు చేశారు. ఆంధ్ర వర్సిటీలో 200, శ్రీవేంకటేశ్వరలో 150, ద్రవిడలో 14, జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ గురజాడల్లో ఒక్కొక్క పోస్టు చొప్పున గతంలో మంజూరు చేసిన వాటిని రద్దు చేశారు. విచిత్రమేమిటంటే గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలకు మంజూరు చేసిన పోస్టులను జేఎన్‌టీయూ గురజాడలో కలిపేశారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ అధికారి పోస్టులను అన్ని వర్సిటీల్లోనూ తొలగించారు. జేఎన్‌టీయూ అనంతపురానికి 10, కృష్ణాకు 48, ఆచార్య నాగార్జునకు 31, ఆదికవి నన్నయకు 59, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీకి 61, రాయలసీమకు 40, శ్రీపద్మావతి మహిళకు 51, శ్రీకృష్ణదేవరాయకు 3, ఉర్దూ వర్సిటీకి 32 చొప్పున అదనంగా కేటాయించారు. ఆదికవి నన్నయకు కొత్త, పాతవి కలిపి 128 పోస్టులు ఇచ్చినా అవి ఏ మూలకూ సరిపోవు. మరిన్ని కావాలని ఆ వర్సిటీ ఎప్పటి నుంచో కోరుతోంది. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.