• facebook
  • whatsapp
  • telegram

విదేశీ విద్యకు ఉపకార వేతనాలు

అమ్మాయిలకు ప్రత్యేకంగా..

విదేశాలకు వెళ్లి చదవాలని చాలామంది విద్యార్థులకు ఉంటుంది. అయితే ఖర్చుల భయంతో వెనకాడుతుంటారు. కానీ నిజంగా ఉన్నత విద్యపై ఆసక్తి, కష్టపడి చదివే అలవాటు ఉంటే.. స్కాలర్‌షిప్‌లు ఇటువంటి వారికి ఎంతగానో సహకరిస్తాయి. అలా ఫారిన్‌ వెళ్లే విద్యార్థుల కోసం సిద్ధంగా ఉన్న ఉపకారవేతనాలు ఏంటో మనమూ చూద్దాం.

విదేశాలకు వెళ్లాలంటే అంత సులభమైతే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి సమయాల్లో స్కాలర్‌షిప్స్‌ ఉపయోగపడతాయి. చాలా సంస్థలు విద్యార్థులకు ఇటువంటి ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకుని అవకాశం ఉన్నవాటికి దరఖాస్తు చేయడం ద్వారా అర్హత మేరకు ప్రయోజనం పొందవచ్చు. స్కాలర్‌షిప్స్‌ అనేవి విద్యార్థుల సమర్థత, మార్కులు, ఇతర అర్హతలను పరిశీలించి ఇస్తారు. ఇవి ఖరీదైన ఉన్నత విద్యను తక్కువ ఖర్చుతో అందేలా సహాయం చేయగలవు. ట్యూషన్‌ ఫీజు, వసతి, రవాణా ఖర్చులు ఇందులో ఇస్తారు. విదేశాల్లో చదవడం వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ ఉపయోగపడుతుంది. ఇతర దేశాలకు వెళ్లడం ద్వారా విభిన్నమైన సంస్కృతుల గురించి తెలుసుకునే వీలుంటుంది, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపడతాయి.

ఉపకారవేతనాల్లో రకాలు..

విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. కొన్ని దేశాలను బట్టి ఇస్తారు. మరికొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు ఫౌండేషన్లు, కార్పొరేట్‌ కంపెనీలు ఇస్తుంటాయి. ఇలా ఇచ్చే స్కాలర్‌షిప్‌లు ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన, అణగారిన వర్గాలకు ఇచ్చేవిగా ఉంటాయి. అకడమిక్‌ లక్ష్యాలు, ఆర్థిక అవసరాలకు తగిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

వెతకడం ఎలా?

మన ప్రొఫైల్‌కు సరిపడా స్కాలర్‌షిప్‌ వెతకడం, తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవడం అవసరం. స్కాలర్‌షిప్‌ డేటాబేస్‌ కోసం, గవర్నమెంట్‌ అందించే వాటి గురించి, అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే ఫండ్స్‌ గురించి తెలుసుకోవడం ద్వారా సరిగ్గా ప్రణాళిక వేసుకోవచ్చు. కెరియర్‌ గైడెన్స్‌ ఆఫీస్, ప్రొఫెసర్స్, అకడమిక్‌ అడ్వైజర్స్‌ వంటి వారి ద్వారా ఈ సమాచారం సేకరించవచ్చు. ఇదే సమయంలో దరఖాస్తుల గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. దానికి తగిన విధంగా ముందు నుంచే దరఖాస్తులు సిద్ధం చేసుకోవాలి.

ఇలా చేయొచ్చు..

స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసినప్పుడు కమిటీకి బలమైన, ఆసక్తికరమైన ప్రొఫైల్‌ను అందించడం అవసరం. అకడమిక్‌ రికార్డ్, విజయాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, పర్సనల్‌ స్టేట్‌మెంట్‌.. ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎంచుకున్న సబ్జెక్టులో మనకున్న ఆసక్తి, దాన్ని అభ్యసించడంలో అందుకున్న మెట్లు.. అన్నీ రాయవచ్చు. స్కాలర్‌షిప్‌ ఇచ్చే సంస్థ విధివిధానాలు, అంచనాలకు తగినట్టుగా ప్రొఫైల్‌ను దరఖాస్తులో ఆవిష్కరించాలి. మెంటర్స్, అధ్యాపకుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని దరఖాస్తును మెరుగుపరచాలి.

అర్హతలు

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయడానికి ఇచ్చే సంస్థ, దాని ఉద్దేశాన్ని బట్టి అప్లికేషన్‌ పద్ధతి మారుతుంది. ఇస్తున్న దేశం, ఇతర అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఈ కింది విషయాలను పరిగణిస్తారు. 

మార్కులు: మంచి మార్కులు పొంది ఉండటం చాలా స్కాలర్‌షిప్పులకు ఉండాల్సిన మొదటి అర్హత. సంస్థ నిర్దేశించిన విధంగా ఉత్తమ స్కోర్లు వచ్చి ఉండాలి. 

సబ్జెక్టు: కొన్ని స్కాలర్‌షిప్‌లు ప్రత్యేకంగా కొన్ని కొన్ని సబ్జెక్టులు చదివే వారికి ఇస్తారు. స్టెమ్‌ సబ్జెక్టులు (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్‌) వంటివి చదివేవారికి కొన్ని సంస్థలు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. 

నేషనాలిటీ - సిటిజన్‌షిప్‌: మరికొన్ని స్కాలర్‌షిప్‌లు ప్రత్యేకంగా కొన్ని దేశాల వారికి, ప్రాంతాల వారికి ఇస్తారు. ఇటువంటివి ప్రభుత్వాలు, ఆర్గనైజేషన్లు, యూనివర్సిటీలు వంటివి ప్రత్యేకంగా కొన్ని దేశాల విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇస్తారు. 

భాష: స్కాలర్‌షిప్‌ ఇచ్చే దేశంలో వాడే భాషనుబట్టి... కొన్ని సంస్థలు ఆ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ అడుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌ వంటి పరీక్షల్లో నెగ్గాలి.

ఆర్థిక అవసరం: కొన్ని స్కాలర్‌షిప్‌లు ప్రత్యేకంగా విద్యార్థి ఆర్థిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. విదేశాల్లో చదివే అర్హత, బలమైన ఆర్థిక అవసరాలు రెండూ ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఆర్థిక అవసరాన్ని నిరూపించే ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. 

నాయకత్వ లక్షణాలు - ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌: స్కాలర్‌షిప్‌లు తరచూ ఉత్తమ నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి, చదువుతోపాటు ఇతర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారికి ఇస్తారు. విద్యార్థి క్లబ్స్‌లో పాల్గొనడం, వాలంటీర్లుగా చేయడం, ఆటల్లో ప్రావీణ్యం చూపడం ద్వారా ఇది సాధించవచ్చు.

రిసెర్చ్‌ అనుభవం: గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ స్కాలర్‌షిప్స్‌ కోసం రిసెర్చ్‌ అనుభవం ఉండాలి. ఇందుకు తగిన రుజువులు చూపించాలి. ఇంతకుముందు చేసిన రిసెర్చ్‌ ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, లెటర్‌ ఆఫ్‌ రికమెండేషన్స్‌ వంటివి ఇవ్వొచ్చు. 

పర్సనల్‌ స్టేట్‌మెంట్‌ లేదా వ్యాసం: స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తుల్లో చాలావరకూ దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లతోపాటు పర్సనల్‌ స్టేట్‌మెంట్స్, వ్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. తమ ఉద్దేశం, లక్ష్యాలు, విదేశాల్లో చదవడం పట్ల ఆలోచనలను చెప్పాలి. బలాలు, అనుభవం, స్కాలర్‌షిప్పులకు ఏవిధంగా అర్హులో వివరించగలగాలి.

రికమెండేషన్‌ లెటర్‌: చాలా స్కాలర్‌షిప్‌లకు ప్రొఫెసర్లు, టీచర్లు, ఇతరుల వద్ద నుంచి రికమెండేషన్‌ లెటర్లు తీసుకురావాలి. మన మార్కులు - వ్యక్తిత్వాన్ని గురించి, అందుకున్న విజయాల గురించి, మనం ఏవిధంగా ఆ ఉపకారవేతనానికి అర్హులమో చెప్పేవారుండాలి.

1. బాట్‌ అండ్‌ బాల్‌ గేమ్‌ విమెన్స్‌ స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌ - ఏదైనా అమెరికన్‌ వర్సిటీలో స్పోర్ట్స్‌ సంబంధిత డిగ్రీ చదువుతున్న వారికి 1,000 డాలర్లు ఇస్తారు.

2. ఎంఐటీ - జరాగోజా విమెన్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఎస్‌సీఎం స్కాలర్‌షిప్‌ - ఎంఐటీలో జరాగోజా లాజిస్టిక్స్‌ సెంటర్‌లో చదివే ఏ అమ్మాయి అయినా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

3. ఏఐఈటీ మైనారిటీస్‌ అండ్‌ విమెన్‌ ఏఐ కోర్సు స్కాలర్‌షిప్‌ - నల్లజాతీయులు, ఆసియన్లు, అమెరికన్‌ ఇండియన్లు, మహిళా విద్యార్థినులకు ఇస్తారు.

4. కార్టియర్‌ విమెన్స్‌ ఇనిషియేటివ్‌ అవార్డ్‌ -  మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు అంతర్జాతీయ స్కాలర్‌షిప్స్‌ ఇవి.

5. సెంట్రల్‌ కాలిఫోర్నియా ఏషి‡యన్‌ పసిఫిక్‌ విమెన్‌ స్కాలర్‌షిప్‌ - ఏసియా, పసిఫిక్‌ ఐలాండ్స్‌ నుంచి వచ్చేవారికి ఇస్తారు. మంచి అకడమిక్‌ నేపథ్యం, ఆర్థిక అవసరం ఉండాలి. యూఎస్‌ యూనివర్సిటీల నుంచి చదివేవారై ఉండాలి. 

6. మార్సియా సిల్వర్‌మాన్‌ మైనారిటీ స్టూడెంట్స్‌ అవార్డు - మైనారిటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులకు అందిస్తారు.

7. ఎంఎంఎంఎఫ్‌ ఎడ్యుకేషన్‌ గ్రాంట్స్‌ - ఏ దేశానికి చెందిన అమ్మాయి అయినా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

విదేశాల్లో చదివే విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు

భారత ప్రభుత్వం ఇచ్చేవి..

ఫుల్‌బ్రైట్‌ - నెహ్రూ మాస్టర్స్‌ ఫెలోషిప్స్‌: అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న, తెలివైన విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ ఇది. ఫిలాంత్రపిస్ట్, భవిష్యత్తు నాయకులకు ఇస్తారు. తమ ప్రజల ఎదుగుదలకు సహాయపడేవారిని దీని ద్వారా ప్రోత్సహిస్తారు. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ అండ్‌ నీడ్‌ బేస్డ్‌ 

ప్రయోజనం: ట్యూషన్‌ ఫీజు, లివింగ్‌ కాస్ట్, రవాణా ఖర్చులు, జె-1 వీసా సదుపాయం, యాక్సిడెంట్‌- సిక్‌నెస్‌ కవరేజ్‌ 

అర్హత: 3 ఏళ్ల కమ్యూనిటీ సర్వీస్‌ అనుభవం, 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ.

ఫుల్‌బ్రైట్‌ - నెహ్రూ డాక్టోరియల్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌: యునైటెడ్‌ స్టేట్స్‌ - ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ దీన్ని భారత విద్యార్థులకు అందజేస్తుంది. రిసెర్చ్‌లో కొంత భాగాన్ని అమెరికాలో చేయాలి.

సబ్జెక్టు: పీహెచ్‌డీకి అనుబంధ సబ్జెక్టు తీసుకోవాలి.

కాలవ్యవధి: 6 నుంచి 9 నెలలు.

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

అర్హత: ఏదైనా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పీహెచ్‌డీ ఉండాలి, థీసిస్‌ సబ్మిట్‌ చేయాలి.  

ప్రయోజనాలు: జె-1 వీసా సపోర్ట్, నెలవారీ స్టైపెండ్, యాక్సిడెంట్‌ అండ్‌ సిక్‌నెస్‌ కవరేజ్, రానూ, పోనూ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.

నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌: విదేశాల్లో చదివే విద్యార్థులకిచ్చే వాటిలో బాగా పేరుమోసినది. తక్కువ ఆదాయ వనరులు కలిగిన విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీలు, భూమిలేని కూలీలు, ఇతర వెనుకబడిన పేదలను విదేశాల్లో చదివించాలనే ఆలోచనతో ఇస్తున్నారు. 

కాలవ్యవధి: 2 ఏళ్లు.

టైప్‌: నీడ్‌ బేస్డ్‌. 

అర్హత: 

1. మైనర్‌ కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి. 

2. చదివిన ఆఖరి డిగ్రీలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. 

3. 35 ఏళ్లలోపు వారై ఉండాలి. 

4. ఒక్కరి కంటే ఎక్కువ తోబుట్టువులు ఉండకూడదు. 

5. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.6 లక్షల్లోపు ఉండాలి. 

ప్రయోజనాలు: ఒకేసారి 15,400 అమెరికన్‌ డాలర్లు ఇస్తారు. దాంతోపాటు ట్యూషన్‌ ఫీజు, పుస్తకాల ఖర్చు, విమాన టికెట్లు, వసతి ఖర్చులు, మెడికల్‌ ఇన్సూరెన్స్, వీసా ఫీజు ఇస్తారు.

ఎరాసమస్‌ ముండస్‌ జాయింట్‌ మాస్టర్స్‌ డిగ్రీ: యూరోపియన్‌ యూనియన్‌ ద్వారా ఇది లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ చదివే భారతీయ విద్యార్థులకు పూర్తి ఖర్చులు ఇస్తారు. ఏ దేశస్థులైనా అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు. 

కాలవ్యవధి: 1 నుంచి 2 ఏళ్లు.

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

అర్హత: గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత. 

ప్రయోజనాలు: నెలకు 1100 నుంచి 1200 యూరోలు ఇస్తారు. ట్యూషన్‌ ఫీజు, లైబ్రరీ, ఇన్సూరెన్స్‌ వంటివన్నీ లభిస్తాయి.

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి స్కాలర్‌షిప్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తుంది. విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అందిస్తున్నారు. 

అర్హత: 

ఆదాయం: కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. 

అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్‌ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వెళ్లే విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 

కుటుంబం నుంచి ఒక్క విద్యార్థి మాత్రమే దీనికి అర్హులు. 

డిగ్రీలో 60శాతం మార్కులు వచ్చి ఉండాలి. జీఆర్‌ఈ/జీమాట్‌ - ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టుల్లో ప్రావీణ్యం ఉండాలి. 

స్కాలర్‌షిప్‌ గ్రాంట్‌: రూ.20 లక్షల వరకూ లేదా కాలేజీ అడ్మిషన్‌ లెటర్‌లో ఇచ్చినది ఏది తక్కువైతే అది. ఒకవైపు ఎకానమీ టికెట్, వీసా ఛార్జీలు..

అగతా హారిసన్‌ మెమోరియల్‌ ఫెలోషిప్‌: భారత ప్రభుత్వం ఇస్తుంది. మానవాభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఇది పొందిన విద్యార్థి.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకి సమానంగా ఉంటారు.      

సబ్జెక్టు: హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్‌. 

కాలవ్యవధి: మొదటి ఏడాది.. విద్యార్థి ప్రదర్శనను బట్టి రెండేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంటుంది. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

అర్హత: 

1. పీహెచ్‌డీ వరకూ 60 శాతం మార్కుల కంటే ఎక్కువ పొంది ఉండాలి.  

2. 30 నుంచి 40 ఏళ్లలోపు వారై ఉండాలి. 

3. 3 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి.

ప్రయోజనాలు: లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ - సెయింట్‌ ఆంటొనీ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్‌ దొరుకుతుంది. దాదాపు 30,000 యూరోలు, ప్రయాణ ఖర్చులు ఇస్తారు.

అమెరికాలో చదివేవారికి..

టాటా స్కాలర్‌షిప్‌: టాటా ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన స్కాలర్‌షిప్‌ ఇది. చదువుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచే విద్యార్థులకు ఇస్తారు. 

టైప్‌: నీడ్‌ బేస్డ్‌ అండ్‌ కాలేజ్‌ స్పెసిఫిక్‌ 

అర్హత: భారత పౌరుడై ఉండాలి, స్కూల్‌లో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి, ఎక్కడా ఇయర్‌ గ్యాప్స్‌ ఉండకూడదు, టోఫెల్‌ స్కోరు 100 - ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు 7 వచ్చి ఉండాలి.

ఏఏయూడబ్ల్యూ ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్‌: అమెరికన్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ విమెన్‌ (ఏఏయూడబ్ల్యూ) ద్వారా మహిళలకు మాత్రమే ఇచ్చే స్కాలర్‌షిప్‌ ఇది. అమెరికన్లు కానివారు, సిటిజన్‌షిప్‌ లేనివారికి, ఫుల్‌టైం  చదువు, లేదా రిసెర్చ్‌ చేసేవారికి ఇస్తారు. గత కొన్నేళ్లుగా 150కు పైగా దేశాల్లో 3,600 మంది మహిళలు దీని ద్వారా ప్రయోజనం పొందారు. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్

అర్హత: ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ ప్రూఫ్‌. 

ప్రయోజనం: మాస్టర్స్‌/మొదటి ప్రొఫెషనల్‌ డిగ్రీ: 20,000 డాలర్లు. డాక్టోరియల్‌: 25,000 డాలర్లు, పోస్ట్‌ డాక్టోరియల్‌: 50,000 డాలర్లు

మైక్రోసాఫ్ట్‌ స్కాలర్‌షిప్స్‌ (అండర్‌గ్రాడ్యుయేట్‌): యూఎస్, కెనడా, మెక్సికోల్లో కంప్యూటర్‌ సైన్స్‌ లేదా స్టెమ్‌ కోర్సులు చదివే విద్యార్థులకు ఇది ఇస్తారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ పట్ల అధిక ఆసక్తి ఉన్నవారినే ఇవి వరిస్తాయి. అభ్యర్థి ప్రదర్శనను బట్టి ట్యూషన్‌ ఫీజు పూర్తిగా/ పాక్షికంగా చెల్లిస్తారు. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్

అర్హత: 4 ఏళ్ల బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం, మంచి మార్కులు.

ఆస్ట్రేలియాలో..

జాన్‌ ఆల్‌రైట్‌ ఫెలోషిప్‌ (జేఏఎఫ్‌): ఆస్ట్రేలియన్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఏసీఐఏఎస్‌ఆర్‌) దీన్ని అందిస్తుంది. భారత్‌లో వ్యవసాయ సంబంధిత అంశాలు, పంటల వంటి వాటిపై పరిశోధన చేసేవారికి ఇస్తారు. 

టైప్‌: ఫెలోషిప్‌ అండ్‌ రిసెర్చ్‌ 

అర్హత: పీహెచ్‌డీలో నమోదై ఉండాలి, మంచి మార్కులు ఉండాలి. ముఖ్యమైన అవసరాలన్నింటికీ ఇస్తారు.

ఎండీవర్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌: ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎండీవర్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌ని అందిస్తుంది. కాబోయే నాయకులను తయారుచేయడం దీని లక్ష్యం.  

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ అండ్‌ ఫెలోషిప్‌ 

అర్హత: ఉత్తమ మార్కులు, 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. 

ప్రయోజనం: 2,72,500 ఆస్ట్రేలియన్‌ డాలర్లు ఇస్తారు.

యూకేలో..

ఫెలిక్స్‌ స్కాలర్‌షిప్‌: ఇండియా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి యూకేకు వచ్చే విద్యార్థుల కోసం ఉద్దేశించినది. ఫుల్‌టైం మాస్టర్స్‌ లేదా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ చదివేవారికి అందిస్తారు. ఆక్స్‌ఫర్డ్, రీడింగ్, స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటెల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (ఎస్‌ఓఏఎస్‌) సంస్థల్లో చదివేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

టైప్‌: మెరిట్, నీడ్‌ బేస్డ్‌. 

అర్హత: భారత పౌరులై ఉండాలి, భారతీయ వర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ చేసి ఉండాలి. 

ప్రయోజనం: వంద శాతం ట్యూషన్‌ ఫీజు, ఖర్చులకు 15,000 నుంచి 16,000 యూరోలు, విమానయానం.

రోడ్స్‌ స్కాలర్‌షిప్‌: ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో ఫుల్‌టైం పీజీ చేసేవారికి ఇస్తారు. ఉన్నత వ్యక్తిత్వం, ఉత్తమ సేవాగుణం, అకడమిక్‌ ప్రతిభ ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యం. 

అర్హత: అకడమిక్‌ ప్రతిభ, ఏదైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీలో నైపుణ్యం, నిజాయతీ, ధైర్యం, సమాజం పట్ల బాధ్యత. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

భారత పౌరుడై, ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేసి ఉండాలి. 

ప్రయోజనం: ట్యూషన్‌ ఫీజు.

స్టైపెండ్‌: 1,515 యూరోలు.

షివనింగ్‌ స్కాలర్‌షిప్‌: యూకేలో ఏదైనా యూనివర్సిటీలో ఒక ఏడాది పీజీ చేసే ఉత్తమ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఈ ఉపకారవేతనం అందిస్తుంది. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

నిబంధనలు: స్కాలర్‌షిప్‌ కాలవ్యవధి అయిపోగానే స్వదేశానికి తిరిగి రావాలి, రెండేళ్ల పని అనుభవం ఉండాలి, యూకే వర్సిటీ నుంచి ఆఫర్‌ లెటర్‌ వచ్చి ఉండాలి. 

ట్యూషన్‌ ఫీజు, వసతి, విమానయాన టికెట్లు ఇస్తారు.

గ్లోబల్‌ స్టడీ అవార్డ్‌: ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఐడెంటిటీ కార్డ్‌ (ఐఎస్‌ఐసీ) ద్వారా దీన్ని అందిస్తున్నారు. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

అర్హత: ఐఈఎల్‌టీఎస్‌ రాసి ఉండాలి, మనుగడలో ఉన్న ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఐడెంటిటీ కార్డు లేదా ఇంటర్నేషనల్‌ యూత్‌ ట్రావెల్‌ కార్డు ఉండాలి. 

ప్రయోజనం: 10,000 యూరోల వరకూ ఇస్తారు. 

గ్రేట్‌ స్కాలర్‌షిప్‌: దీని ద్వారా ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, సదరన్‌ ఐలాండ్‌లలో 49 వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు 10,000 యూరోల వరకూ అందిస్తున్నారు. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ అండ్‌ యూనివర్సిటీ స్పెసిఫిక్‌ 

అర్హత: భారత పౌరుడై జాబితాలో ఉన్న వర్సిటీల్లో చదువుతూ ఉండాలి.

కెనడాలో..

కెనడా మెమోరియల్‌ స్కాలర్‌షిప్‌: కెనెడియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చదివేవారికి ఇస్తారు. ఇతరుల ప్రయోజనాల కోసం పాటుపడేవారిని గుర్తించి దీని ద్వారా ప్రోత్సహిస్తారు. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌ 

అర్హత: సమాజానికి సేవ చేయడం - మంచి అకడమిక్‌ ప్రతిభ.

ప్రయోజనం: 10,000 కెనెడియన్‌ డాలర్లు (ఒక్కసారి)

ఓంటారియో గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌: యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో, ప్రావిన్స్‌ ఆఫ్‌ ఓంటారియో కలిసి దీన్ని అందిస్తున్నాయి. 

టైప్‌: మెరిట్‌ బేస్డ్‌గా ఇస్తారు. 

అర్హత: టొరంటో యూనివర్సిటీల నుంచి ఫుల్‌టైం డిగ్రీ చదివి.. మంచి మార్కులు తెచ్చుకుని ఉండాలి. 

ప్రయోజనం: 5,000 కెనెడియన్‌ డాలర్ల నుంచి 15,000 కెనెడియన్‌ డాలర్ల వరకూ ఇస్తారు.

కెనెడియన్‌ కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌: అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చదివే ఇండియన్‌ విద్యార్థులకు ఇస్తారు. కెనడా ప్రభుత్వం ద్వారా ఫండ్‌ వస్తుంది.

శాస్త్రి ఇండో-కెనెడియన్‌ ఇన్‌స్టిట్యూట్‌: కెనడాలో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టోరియల్‌ పీహెచ్‌డీ చేసిన భారతీయ విద్యార్థులకు ఇస్తారు. ట్యూషన్‌ ఫీజు, వసతి - ఇతర ఖర్చులు ఇస్తారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో 205 ఇంజినీర్‌ కొలువులు

‣ ఇంటర్‌ కోర్సు వివరాలివిగో..

‣ వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

‣ బెస్ట్‌ కెరియర్.. బ్యాంకింగ్‌ టెక్నాలజీ

‣ జనరేషన్‌ ‘జడ్‌’ జాబ్స్‌తో నయా ట్రెండ్‌!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

Posted Date: 16-06-2023


 

తాజా కథనాలు

మరిన్ని