• facebook
  • whatsapp
  • telegram

అందుకుందాం ఐటీ ఉద్యోగం! 

‣ జాబ్‌ స్కిల్స్‌- 2024
 


ఏఐతో పాటు క్లౌడ్‌ కంప్యూటింగ్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ వంటి  ఐటీ విభాగాలు యువతను ‘రా రమ్మ’ని ఆహ్వానిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలతో ఉద్యోగ కల్పనలో అగ్రగామిగా ఉన్న ఐటీ రంగంలోకి ప్రవేశించడం ఎలా అన్నదే ప్రధాన ప్రశ్న. లక్షల్లో వేతనాలను అక్షయపాత్రలా అందించే  ఐటీ జాబ్‌ అయాచితంగా రాదు. సమాజంలో మంచి పేరున్న సాఫ్ట్‌వేర్‌ కొలువు ఊరికే చేతికి చిక్కదు.   ఇందుకోసం కొన్ని అంచెలు దాటాలి. అడ్డు కంచెలను అధిగమించాలి!  


అప్రమత్తత... ఉలికిపాటు! ...ప్రస్తుత ఐటీ రంగానికి వర్తించేవి ఇవే. ఆర్థిక మాంద్యం చాపకింద నీరులా చుట్టుముడుతుందేమోనన్న కలవరం అమెరికా ఐటీ మార్కెట్టును ఉలికిపాటుకు గురి చేసింది. దీంతో అప్రమత్తతతో పరిశ్రమ అడుగులు వేయడం మొదలుపెట్టింది. అంతే తప్ప వాస్తవానికి మాంద్యం ఛాయల్లేవని అమెరికా ఫెడరల్‌ రిసెర్చ్‌ ఛైర్‌ జెరోమ్‌ పోవెల్‌ మార్చిలో వాషింగ్టన్‌ పి.జి.లో జరిగిన ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంలో స్పష్టం చేశారు. అయినా గతంలో ఆర్థిక మాంద్యాలు, ఆపత్కాల సంక్షోభాలు చవిచూసిన వాణిజ్య కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. కొత్త ప్రాజెక్టుల జోలికి పోవడం లేదు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను కొంతకాలం పక్కనబెట్టి ఉన్న వ్యాపారంపై దృష్టి లగ్నం చేస్తున్నాయి.  అమెరికా కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్లపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీలు అక్కడి మార్కెట్‌నూ, ఆదేశ ఆర్థిక పరిస్థితినీ నిశితంగా గమనిస్తూ నియామకాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అమెరికాను మాంద్యం కమ్ముకుంటే ఆ ప్రభావం భారత్‌పై పడి కనీసం పది శాతం ఎగుమతులకు గండిపడుతుంది. దేశ జీడీపీలో ఒక శాతం వృద్ధిని మనం కోల్పోతాం. అందుకే దేశ ఐటీ మార్కెట్‌లోనూ ఈ అప్రమత్తత... ఉలికిపాటు!  ఆ బెంగ కాస్తా తొలగిపోతే... రెక్కలు విప్పబోతున్న ఆర్థిక మాంద్యపు రాబందు వెనక్కి మళ్లిపోతే... అమెరికన్‌ కంపెనీలు ఒక్క సారిగా జూలు విదిలిస్తాయి. తమ అమ్ములపొదిలోని కొత్త ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తాయి. ఆపై భారత మార్కెట్లోనూ ఒక్కసారిగా చలనం వస్తుంది. మళ్లీ నియామకాలు ఉవ్వెత్తున లేస్తాయి.  


    ఢోకా లేదు  

దాదాపు 20 బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయంతో పటిష్ఠమైన సౌధం నిర్మించుకున్న ఐటీ మార్కెట్టుకు ఏ చింతా లేదు. నాస్కామ్‌ లెక్కల ప్రకారం 55 లక్షలమంది ఐటీ నిపుణులు వివిధ కంపెనీల్లో సేవలందిస్తున్నారు. ఇందులో 36 శాతం మహిళా శక్తి కావడం విశేషం. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్‌ మహేంద్ర వంటి భారతీయ ఐటీ కంపెనీలు లక్షల ఉద్యోగులతో విరాజిల్లుతున్నాయి. పైపెచ్చు ఎప్పటికప్పుడు ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలు తలుపులు కొడుతూనేవున్నాయి.  


భారత ఐటీ మార్కెట్టుకు ఇప్పుడున్న ఆదాయానికి తోడు కొత్తగా పురివిప్పుతున్న కృత్రిమ మేధ (ఏఐ) 8 బిలియన్ల డాలర్ల మార్కెట్‌ను తీసుకొచ్చింది. పైపెచ్చు ఈ ఏఐ వ్యయాలు ఏటా 40 శాతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. డిజిటల్‌ ప్రింట్‌ రంగంలో రారాజులా వెలుగొందుతున్న అమెరికా కంపెనీ జెరాక్స్‌. తమ అకౌంట్‌ను ఎన్నో ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న టీసీఎస్‌కు అదే కంపెనీ నుంచి కొత్త ఏఐ అవకాశం వచ్చింది. ఈ బాధ్యతను స్వీకరించిన టీసీఎస్‌ రాబోయే మూడేళ్లపాటు ఆ కంపెనీ ఉత్పత్తుల్లో ఏఐ అనువర్తనాలను తీసుకువస్తోంది.  


     తొలి అడుగు.. డిగ్రీ    

కొన్ని పొజిషన్లకు కొన్ని అనివార్య అవసరాలుంటాయి. ఐటీ రంగం సాంకేతిక పరిజ్ఞానపు పునాదిపై నిలబడింది. అందువల్ల ఈ రంగంలో ప్రవేశించి నిలదొక్కుకోవాలనుకునేవారికి అనివార్యంగా బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్‌ అధ్యయనం, టెక్నాలజీ కోర్సుల పరిచయం ఈ రంగంపై ఆసక్తి, విజ్ఞానం, నైపుణ్యం నేర్చిస్తాయి. ఐటీ ఉద్యోగాలు ఆఫర్‌ చేసే దాదాపు అన్ని కంపెనీలూ ఐటీలో బ్యాచిలర్‌ డిగ్రీని ఆశిస్తాయి. ఉదాహరణకు ఐటీ, కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ వంటి సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్‌తో అభ్యర్థి దరఖాస్తు చేస్తే వెంటనే కంపెనీ పరిశీలనలోకి వెళ్లే అవకాశం ఉంది.  


     ఆపై.. ఇంటర్న్‌షిప్‌    

ఏ డిగ్రీ చదివినా, ఏ కోర్సు చేసినా ఆ సర్టిఫికెట్‌తో మనుగడ సాగించలేని రోజులివి. చేసిన కోర్సు ద్వారా అలవర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించాలి. ఆ స్కిల్స్‌ కంపెనీకి ఉపయోగపడాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన బ్యాచిలర్‌ డిగ్రీ, ఆసక్తి ఉన్న సబ్జెక్టుపై ఇంటర్న్‌షిప్‌ అవకాశం కోసం అన్వేషించాలి. ఇంటర్న్‌షిప్‌ అభ్యర్థికి నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. చేసిన కోర్సు వినియోగాన్ని నేర్పిస్తుంది. సముపార్జించిన నైపుణ్యాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. తప్పులు చేసినా సవరించుకునే వీలునిస్తుంది. మూడు నెలలు, ఆరు నెలలు- ఇలా ఎంత ఎక్కువకాలం ఇంటర్న్‌షిప్‌ అవకాశం వస్తే అంత మంచిది. ఈ విషయంలో చేయకూడదనిది ఒక్కటే...కేవలం ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోసం మాత్రం చేయకూడదు. అలాచేస్తే డిగ్రీ, ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్లు రెండింటినీ బీరువాలో భద్రపరచుకొని మురిసిపోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు.


      నైపుణ్యాలకు పదును   


పదునైన చిన్న చాకు అయినా కావలసిన పని కానిచ్చేస్తుంది. అదే పొడవాటి బంగారం కత్తి అందానికీ, ఆడంబరానికీ తప్ప చేసే పని ఏమీ ఉండదు. బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంటర్న్‌షిప్‌లు రెజ్యూమెలో ధగధగలాడితే సరిపోదు. వాటి ద్వారా వచ్చే నైపుణ్యాలు నిగ నిగలాడాలి. ఐటీ రంగంలో ప్రొఫెషనల్‌గా రాణించాలంటే వైవిధ్యమైన నైపుణ్యాలు అవసరం. హార్డ్, సాఫ్ట్‌ స్కిల్స్‌ తప్పనిసరి. చేసే ఉద్యోగాన్ని బట్టి  మళ్లీ ఈ నైపుణ్యాలు మారుతుంటాయి. సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో నిమగ్నమయ్యే ఉద్యోగికి తగిన కోడింగ్‌ నైపుణ్యాలుండాలి. ఐటీ ప్రొఫెషనల్‌గా పదికాలాల పాటు మనుగడ సాగించాలంటే కోడింగ్‌పై తిరుగులేని పట్టుతోపాటు నెట్‌వర్క్‌ వ్యవస్థాపన, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, క్లౌడ్‌ మైగ్రేషన్, డేటా మైనింగ్, రోబోటిక్స్, ఎన్‌స్రిప్టింగ్, గ్రాఫిక్‌ డిజైన్, ట్రబుల్‌ షూటింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాలుండాలి. అంటే ఇవన్నీ ఉండాలని అర్థం కాదు. ఉద్యోగార్థి ఆశిస్తున్న పొజిషన్‌ని బట్టి వీటిలో వర్తించే నైపుణ్యాలు సముపార్జించివుండటం తప్పనిసరి.  

వీటిని హార్డ్‌ స్కిల్స్‌గా పరిగణిస్తే చేసే పొజిషన్‌ ఏదైనా అనివార్యంగా ఉండాల్సిన కమ్యూనికేషన్, మ్యాథమెటికల్, రీజనింగ్, సమస్యా పరిష్కార కౌశలాల్లో అనుభవం గడించాలి. లేకపోతే సబ్జెక్టులో ఎంత సాధికారత ఉన్నా ఈ సాఫ్ట్‌ స్కిల్‌్్సÄలో వెనుకబడిపోతే ఉద్యోగంలో చతికిలపడే ప్రమాదం ఉంది.  


     వెబ్‌సైట్‌.. యాప్‌   

ప్రతి పనికీ పైసలు రాలాలన్న దృక్పథం ఉండకూడదు. సమాజం ద్వారా మనం నేర్చుకున్నవాటిని తిరిగి సమాజానికి ఇవ్వడంలో ఆనందాన్ని ఆస్వాదించాలి. ఇది మంచి కెరియర్‌ ప్రారంభానికి వర్తిస్తుంది. సాధారణంగా కంపెనీలు అభ్యర్థి రెజ్యూమెలో పని అనుభవం కోసం వెతుకుతుంటాయి. ‘ఎవరైనా ఉద్యోగం ఇస్తేనే కదా ఎక్స్‌పీరియన్స్‌ వచ్చేది!’ అని వితండవాదం చేయకుండా అందుకు మార్గాలు అన్వేషించాలి. ఆదాయంతో సంబంధం లేకుండా అభ్యర్థి తన నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని వెతుక్కోవాలి. సాధారణంగా స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలకు ఈ అవసరం ఉంటుంది. ఐటీ నైపుణ్యాలు నేర్చుకున్న అభ్యర్థి వారికో వెబ్‌సైట్‌ రూపొందించి ఇవ్వవచ్చు. మొబైల్‌ యాప్‌ చేసి అందివ్వవచ్చు. దాని ద్వారా గణించిన అనుభవాన్ని రెజ్యూమెలో సగర్వంగా పేర్కొనవచ్చు. నైపుణ్యాల ప్రదర్శనకు ఉచిత, స్వచ్ఛంద సంస్థల వేదికలను వినియోగించడం ద్వారా ఇటీవల అనేకమంది ఉద్యోగార్థులు హెచ్‌ఆర్‌ ప్రతినిధులను ఆకర్షిస్తున్నారు. 


    పేరు ఏదైనా, పొజిషన్‌ వేరైనా..

ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అంతర్భాగం. ఐటీ ప్రొఫెషనల్‌ బహుముఖ    పరిశ్రమల్లో పనిచేసే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు సేవలందించవచ్చు.   ఫైనాన్స్‌ కంపెనీలకు అవసరం కావచ్చు. ఫార్మా కంపెనీల్లోనూ, విద్యాసంస్థల్లోనూ చేరవచ్చు. ఎక్కడ ఐటీ సేవలు అవసరమో అక్కడ సాఫ్ట్‌వేర్‌ వృత్తి నిపుణుడికి చోటు ఉంటుంది. కంపెనీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ల రూపకల్పన, గతంలో రూపొందించిన సాఫ్ట్‌వేర్ల నిర్వహణతో సహా నెట్‌వర్క్‌ సృష్టి, పర్యవేక్షణ, భౌతికంగా కంప్యూటర్ల, సర్వర్ల బాగోగులు చూడటం ఐటీ ప్రొఫెషనల్‌ పని.  


  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, వెబ్‌ డెవలపర్, డేటా ఆర్కిటెక్ట్, కంప్యూటర్‌ ప్రోగ్రామర్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సపోర్ట్‌ స్పెషలిస్ట్, క్వాలిటీ అస్యూరెన్స్‌ టెస్టర్, ఐటీ టెక్నీషియన్, నెట్‌వర్క్‌ ఇంజినీర్, యూజర్‌ ఎక్స్‌పర్‌మెంట్స్‌ డిజైనర్, కంప్యూటర్‌ అనలిస్ట్‌...


ఇలా పేరు ఏదైనా, పొజిషన్‌ వేరైనా అన్నీ ఐటీ ప్రొఫెషనల్‌ సేవలందించే ఉద్యోగాలే. స్థూలంగా చెప్పాలంటే ఐటీ పరిశ్రమ మహాసముద్రం వంటిది. మనకెంత నీరు కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. ఎంత సామర్థ్యం ఉంటే అంత భాగాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే సాగరంలోకి ప్రవేశించాలన్నా, సముద్రంపై పట్టు సాధించాలన్నా ఎంతో సన్నద్ధత కావాలి. కొన్ని అనివార్యతలు ఆకళింపు చేసుకోవాలి. మరికొన్ని నైపుణ్యాలను మచ్చిక చేసుకోవాలి. ఇంకొన్ని అభిలషణీయాలను ఆహ్వానించాలి.  


     సమ్‌థింగ్‌ స్పెషల్‌  

మందిలో మెరవాలంటే మీకో ప్రత్యేకత ఉండాలి. సమూహంలో విడిగా కనిపించాలంటే సమ్‌థింగ్‌ స్పెషల్‌ కావాలి. అందరూ కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసేవారే. అందరూ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ ఆశించేవారే. మరి వారందరిలో ప్రత్యేకత కనిపించాలంటే కాస్త అదనపు శ్రమకు సిద్ధపడాలి. సాధారణంగా డిగ్రీ సమయంలో వెరైటీ సబ్జెక్టులను చదివి ఉంటారు. వీటి నుంచి స్వీయ ఆసక్తి ఆధారంగా ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, ఐటీ మేనేజింగ్‌ వంటి నిత్య అవసరాలపై ఫోకస్‌ చేస్తూ నైపుణ్యాలు పెంచుకుంటే ప్లేస్‌మెంట్స్‌ సమయంలో ప్రయోజనం. లేదంటే... మార్కెట్లో ప్రస్తుతం బాగా అవసరమైన ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా సైన్స్‌ వంటి వాటిలో ప్రత్యేక నైపుణ్యాలు అలవర్చుకున్నా మిగతా వాటికంటే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.  


     పైమెట్టూ ఎక్కేస్తే పోలా!   

ఐటీ రంగంలో విస్తృత కార్యకలపాలు నిర్వహించే కొన్ని కంపెనీలు అభ్యర్థి, బ్యాచిలర్‌ డిగ్రీతో సంతృప్తి చెందడం లేదు. ఒకవేళ సంతృప్తి చెందినా చిన్నా చితకా పొజిషన్‌తో సరిపెడుతున్నాయి. మంచి పోస్టు కావాలంటే పీజీ డిగ్రీతో రావాలంటున్నాయి. అవకాశం ఉండి, ఆర్థిక స్థోమత సహకరిస్తే ఆసక్తిగల సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు పూర్తిచేయడం లాభిస్తుంది. అయితే పీజీకి సబ్జెక్టు ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తన కెరియర్‌ లక్ష్యం, తాను రాబోయే ఐదేళ్లపాటు పనిచేయాలనుకుంటున్న డొమైన్‌ (ఫీల్డ్‌), తనకున్న నిజమైన ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని పీజీ కోర్సును ఎంచుకోవాలి. ఉదాహరణకు నెట్‌వర్క్‌ నిర్మాణాలపై ఆసక్తి, నిర్వహణ జిజ్ఞాస, నెట్‌వర్క్‌ల భద్రతపై అనురక్తి ఉంటే సైబర్‌ సెక్యూరిటీతో పీజీ చేయడంవల్ల కోరుకున్న కెరియర్లో  ప్రవేశం సులభంగా లభిస్తుంది.  


ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్, డేటా ఇంజినీరింగ్‌ వంటి ఆసక్తి గల సబ్జెక్టులతో పాటు రెగ్యులర్‌గా కంప్యూటర్‌ సైన్స్, ఐటీ కోర్సులు చేయవచ్చు.  


ఇప్పటివరకూ ప్రస్తావించినవన్నీ ఐటీలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. సబ్జెక్టులో బలంగా ఉంటే ఉద్యోగ సాధనలో ఏ అవరోధాలు ఎదురైనా అవలీలగా అధిగమించవచ్చు. అయితే వీటితోపాటు కొన్ని సాంకేతికేతర విషయాలపై అవగాహన ఉంటేనే ఐటీ రంగంలో ఉద్యోగాన్వేషణ కొలిక్కి వచ్చేది...మంచి కెరియర్‌ను సొంతం చేసుకోగలిగేది!  


 

యస్‌.వి. సురేష్‌

సంపాదకుడు, ఉద్యోగ సోపానం


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Posted Date: 04-07-2024


 

కోడింగ్‌