• facebook
  • whatsapp
  • telegram

సందేహించొద్దు.. సాధిద్దాం!

* కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు


కొత్త సంవత్సరంలో ఓ నెల గడిచిపోయింది. ఈ ఏడాది ‘ఇలా చేయాలి, అలా చేయకూడదు’ అనుకుంటూ ఎన్నో తీర్మానాలు చేసుకునే ఉంటారు కదా... కొందరు ఎంతో శ్రద్ధగా వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరేమో ఇదంతా తమ వల్ల అవుతుందా, కాదా అని సందేహిస్తుంటారు. అలాంటివారిలో మీరూ ఉన్నారా?  


తెల్లవారుజామునే నిద్ర లేవాలనే తీర్మానాన్ని సాధారణంగా ఎంతోమంది విద్యార్థులు పెట్టుకునే ఉంటారు. ‘అసలే చలికాలం. ఆపై పొద్దున్నే నిద్ర లేవడం.. ఇది మన వల్ల అయ్యేపని కాదులే’నని వదిలిపెట్టేయడానికి ఇప్పటికే కొంతమంది సిద్ధంగానూ ఉండి ఉండొచ్చు. ఇలాంటప్పుడే.. బద్ధకంతో ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఇంటికి చాలా దూరంగా ఉండే కాలేజీకి సమయానికి చేరుకోవడానికి పరుగులు పెట్టాలి. కిక్కిరిసిన బస్సుల్లో ఫుట్‌బోర్డ్‌ మీద వేలాడుతూ కాలేజీకి చేరుకోవాలి. లేదా గాలితో పోటీపడుతూ బైక్‌ నడుపుతూ వెళ్లాలి. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడే అవకాశమూ లేకపోలేదు. ఇన్ని అనర్థాలకు మూలం..బద్ధకం వల్ల ఆలస్యంగా నిద్ర లేవడమే కదా? కాబట్టి దాన్ని వదిలిపెట్టి తీర్మానించుకున్నట్టుగానే ప్రభాత వేళ ముందుగా నిద్ర లేవడానికి అన్నివిధాలా ప్రయత్నించాలి. 


ఇన్‌స్టాలోనో, ఎక్స్‌లోనో స్నేహితులు పెట్టిన సూర్యోదయం ఫొటోలను చూసి సంతోషంగా ఎన్నోసార్లు లైక్‌లు కొట్టివుంటారు. వాటిని ఇతరులకూ పంపించేవుంటారు కదా! అలాకాకుండా మీరు స్వయంగా ఉషోదయాన్ని చూసి ఆస్వాదించడానికి ప్రయత్నించండి. మంచు తెరలను తొలగించుకుని ఉదయించే భానుడిని చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ సుందర దృశ్యాన్ని చూసిన ఆనందంలో రోజువారీ పనులను ఉల్లాసంగా, ఉత్సాహంగా పూర్తిచేయగలుగుతారు.  


ఇలా వేకువనే లేచి.. సంతోషంగా ఉన్న సమయంలోనే అర్థం కాకుండా.. కష్టంగా అనిపించే పాఠాలను చదువుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల అప్పటివరకూ ఇబ్బందిపెట్టిన అంశం కాస్తా చక్కగా అర్థమవుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే నోట్సు రాసుకోవాలి. తర్వాత అధ్యాపకులనో, ఆ సబ్జెక్టు బాగా తెలిసిన స్నేహితులనో అడిగి వాటిని నివృత్తి చేసుకోవచ్చు.


 అనుమానం వద్దు 


బద్ధకం తర్వాత తీర్మానాల అమలుకు మరో బద్ధ శత్రువు.. అనుమానం. ఎంతో ఉత్సాహంగా ప్రయత్నాలను మొదలుపెట్టినప్పటికీ మరోపక్క ‘ఇవన్నీ మనవల్ల ఎక్కడ అవుతాయ’నే సందేహం పీడిస్తుంటుంది. ఆ తర్వాత అదే పెరిగి పెద్దదై సంకల్పం నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది కూడా. ‘ఎప్పటినుంచో అనుకున్నా కానివి ఇప్పుడు మాత్రం ఏం అవుతాయిలే’ అని నిట్టూర్చేలానూ చేస్తుంది. కాబట్టి చేయలేనేమో, కాదేమో.. అనే అనుమానాలను వదిలేసి.. చేయగలమనే నమ్మకంతోనే కొత్త పనులను మొదలుపెట్టాలి. ముందుగా మిమ్మల్ని   మీరు గట్టిగా నమ్మితేనే ఆచరించడానికి దృఢంగా ప్రయత్నించగలుగుతారు. 


ఉదాహరణకు కొన్ని సబ్జెకులు అంత ఆసక్తిగా లేకపోవచ్చు. కిందటి సంవత్సరం వాటిల్లో తక్కువ మార్కులూ వచ్చి ఉండొచ్చు. ఈ ఏడాది కూడా పరిస్థితిలో మార్పు ఉండదనే నిర్ణయానికి వచ్చేయకూడదు. ఆ సబ్జెక్టులు నిజంగానే అంత కష్టంగా ఉంటే ఎవరికీ ఒంటబట్టవు కదా. ఆ సబ్జెక్టుల్లోనే మీ స్నేహితులకు మంచి మార్కులూ వచ్చి ఉండొచ్చు. అంటే లోపం మీ ఆలోచనా విధానంలోనే ఉంది. ఆ సబ్జెక్టులు మీకు ఎప్పటికీ అర్థంకావనే ఆలోచనను పక్కన పెట్టేయాలి. వాటిలో వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను నోట్సు రాసుకుని, సమయం దొరికినప్పుడల్లా పునశ్చరణ చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాల్లోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు చదవడం సాధన చేయాలి. ఇలాచేస్తే వాటిల్లోనూ ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది.


 ప్రతికూల ఆలోచనలు


ఒక పని చేయాలి అని మీరు సంకల్పించుకోగానే.. ‘నువ్వు చేయలేవేమో.. నీ వల్ల కాదేమో’ అనే మాటలు మీకు వినిపించవచ్చు. అంటే.. అంతర్వాణి (ఇన్నర్‌ వాయిస్‌) ప్రతికూల ఆలోచనలతో మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూనే ఉంటుంది. దాన్ని అధిగమించి సానుకూల ఆలోచనలు చేస్తూ ముందుకు వెళితేనే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. 


పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి గత ఏడాది బాగానే కష్టపడ్డారు. అయినా అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయారు. ఇక ఈ ఏడాది కూడా అదే కొనసాగుతుందనే అనుమానం పెట్టుకోకూడదు. లోపం గ్రహించి సవరించుకోవడానికి కృషిచేయాలి. ఈ విషయంలో సీనియర్ల, అధ్యాపకుల సూచనలు కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా పదేపదే వచ్చే ప్రతికూల ఆలోచనలతో నిరుత్సాహం కలగకుండా జాగ్రత్తపడాలి. మనం చేసే ఏ పనికైనా పునాది.. మన ఆలోచనలే. అవి ప్రతికూలంగా ఉంటే.. పునాది బలహీనపడుతుంది. దానిపైన ఎంత పెద్ద ఆశల సౌధాన్ని నిర్మించినా అది ఏదో ఒకరోజు కూలిపోకతప్పదు. 


తీర్మానాల అమలుకు అవసరమైన స్ఫూర్తిని నింపుకోవాలి. ప్రణాళిక వేసుకోవడంతో పాటు దాన్ని కచ్చితంగా అమలుచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు చేసుకున్న తీర్మానాల గురించి స్నేహితులకు ఒకమాట చెప్పి.. వారి సలహాలూ తీసుకోవచ్చు. అనుకూలంగా ఉన్నవాటిని ఎంచుకుని ఆచరించవచ్చు కూడా.  


 స్వీయ ప్రేరణ...


తీర్మానాల అమలుకు అవసరమైన ప్రేరణ కోసం పూర్తిగా ఇతరుల మీదే ఆధారపడకూడదు. మీ బలాలూ, బలహీనతలు గురించి మీకే బాగా తెలుస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా అవసరమైన సానుకూల సూచనలను ఇచ్చుకోవడం ద్వారా స్ఫూర్తిని పొందొచ్చు. లేదా మరోవిధంగానూ ప్రయత్నించవచ్చు. ప్రముఖులు చెప్పిన స్ఫూర్తిదాయకమైన కొటేషన్లూ ఇందుకు ఉపయోగపడతాయి. వాటిని కంటికి కనిపించేలా పెట్టుకోవచ్చు. లేదా స్ఫూర్తిని నింపే వీడియోలు చూడటం వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. ప్రముఖుల జీవిత చరిత్రలు చదివినా ఎంతో ఉపయోగం. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని, ఓటములను తట్టుకుని వారు సాధించిన విజయాలు ఎంతోమందికి ప్రేరణ కలిగిస్తాయి. క్రికెట్‌ బాల్‌ కొనుక్కోవడానికి డబ్బుల్లేని కుటుంబం నుంచి వచ్చి.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాళ్లూ ఉన్నారు. రాత్రులు పానీపూరీ అమ్ముతూ పగలు క్రికెట్‌ సాధన చేసిన క్రీడాకారులూ ఉన్నారు. తరచి చూస్తే వీరందరి జీవితాలూ స్ఫూర్తి పాఠాలే. 


చివరగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. గమ్యాన్ని చేరుకోవాలనే ఆతృతలో దాని సాధన కోసం చేసే ప్రయాణాన్ని చాలామంది పట్టించుకోరు. వారి ఆలోచనలన్నీ అంతిమ ఫలితం చుట్టూనే తిరుగుతుంటాయి. ముందుగా లక్ష్య సాధన దిశగా చేసే ప్రయాణాన్నీ ఆస్వాదించగలగాలి. అలాంటప్పుడు చేసే ప్రయత్నాలన్నీ అతి కష్టంగా, శిక్షలా అనిపించవు.


ఎక్కువ మార్కులు సాధించడం అనేది విద్యార్థుల అంతిమ ఫలితం. పరీక్ష అనేది వాటిని సంపాదించడానికి అవసరమైన ప్రయాణం లాంటిది. దీన్ని ఆస్వాదించగలిగితే అనుకున్న మార్కులు సంపాదించడం కష్టం కాదు. అలాకాకుండా పరీక్ష అంటేనే భయపడి.. విపరీతమైన ఒత్తిడికి గురైతే ఫలితాలూ తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. 


ఉద్యోగార్థులనే ఉదాహరణగా తీసుకుంటే.. విజయం సాధిస్తారనే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూకు హాజరవుతారు. దాంట్లో ఫలితం ప్రతికూలంగా వచ్చిందని ఆ తర్వాత ముఖాముఖికి హాజరుకావడం మానేయలేరు కదా. ఈ ప్రక్రియను ఆస్వాదించగలిగితే మరోసారి ఎంపికయ్యే అవకాశమూ ఉంటుంది. సానుకూల ఫలితాలు రావాలని ప్రయత్నించినప్పుడు.. దాని కోసం చేసే ప్రయాణమూ సంతోషంగానే సాగాలి. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రత్యేక కోర్సులు

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Posted Date: 01-02-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం