• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రత్యేక కోర్సులు

* ఫిబ్రవరి 5 దరఖాస్తుకు గడువు


ఇంజినీరింగ్‌తోపాటు వైవిధ్యమైన ఇతర కోర్సులను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఎన్నో ఏళ్ల నుంచీ నడుపుతోంది. ఈ సంస్థ అందించే మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) వాటిలో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఇటీవల ఆ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. క్యాట్‌-2023 స్కోరు, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో బహుళజాతి సంస్థల్లో మేటి ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు! 



బిజినెస్‌ అనలిటిక్స్, మాస్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎంఎంఎస్‌టీ), ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంబీఏ.. కోర్సులు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే అవకాశం ఉంది. వీటిలో పలు కోర్సుల్లోకి యూజీలో ఇంజినీరింగ్‌ లేదా సాంకేతిక విద్య అభ్యసించినవారిని తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంబీఏ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఇంజినీరింగ్‌ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ అవకాశాలు దక్కించుకోవచ్చు.   


 ఎంహెచ్‌ఆర్‌ఎం  


మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం) కోర్సును ఖరగ్‌పూర్‌ ఐఐటీ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తోంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థలకు అవసరమయ్యే మానవ వనరుల నిపుణులను అందించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 4 సెమిస్టర్లు. ఇందులో చేరినవారు ప్రముఖ సంస్థల్లో మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌)లో ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 


అర్హత: నాలుగేళ్ల బ్యాచిరల్‌ డిగ్రీ లేదా ఏదైనా పీజీలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం యూజీ చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. క్యాట్‌ 2023 స్కోరు తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 80, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ 72, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 53.33 పర్సంటైల్‌ క్యాట్‌ స్కోర్‌ కటాఫ్‌గా నిర్ణయించారు. అకడమిక్‌ నేపథ్యం, క్యాట్‌ స్కోరులతో షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. 


గత ఏడాది ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారికి రూ.23 లక్షల గరిష్ఠ వార్షిక వేతనంతో సంస్థలు తీసుకున్నాయి. సగటు వేతనం రూ.15.40 లక్షలు పొందారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా సంస్థలు వీరికి స్టైపెండ్‌ అందిస్తున్నాయి. గరిష్ఠ స్టైపెండ్‌ రూ.2.40 లక్షలు కాగా సగటు స్టైపెండ్‌ రూ.1.26 లక్షలు. ట్యూషన్‌ ఫీజు రూ.5 లక్షలు. దీనికి వసతి, భోజనం, ఇతర ఖర్చులు అదనం. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.  


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: మార్చిలో.

ఫలితాల ప్రకటన: ఏప్రిల్‌ 25 నుంచి మే 5లోగా.


  ఎంబీఏ  

అర్హత: ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సైన్స్‌/ఎకనామిక్స్‌/ కామర్స్‌ల్లో మాస్టర్‌ డిగ్రీతో పాటు యూజీలో మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌ చదివివుండాలి. ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏ అవసరం. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక: క్యాట్‌-2023లో స్కోరు తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు 90, ఓబీసీలు 81, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 60 పర్సంటైల్‌ ఉండాలి. ఈ స్కోరుతోపాటు అకడమిక్‌ ప్రతిభ, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. తుది ఎంపికలో అప్లికేషన్‌ రాటింగ్‌ 20, క్యాట్‌ స్కోరు 40, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు మార్చిలో నిర్వహిస్తారు. ఫలితాలు మేలో వెలువడతాయి. రెండేళ్ల ఎంబీఏ కోర్సు రెసిడెన్షియల్‌ విధానంలో కొనసాగుతుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రాంగణంలోని వినోద్‌ గుప్తా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ కోర్సు అందిస్తుంది. 4 సెమిస్టర్లు ఉంటాయి. కోర్సు ఫీజు మొత్తం సుమారు రూ.13 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ట్యూషన్‌ ఫీజు మినహాయిస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికి 200 సీట్లు కేటాయించారు. 

ఇక్కడ ఎంబీఏ విద్యార్థులకు బహుళజాతి సంస్థలు రూ. 1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు స్టైపెండ్‌ అందిస్తున్నాయి. వీరు సగటున రూ.18 లక్షల వార్షిక వేతనం, గరిష్ఠంగా రూ.32 లక్షలు పొందారు. వీరిని ఎక్కువగా బహుళజాతి, ఐటీ, సాంకేతిక సేవలు అందించే సంస్థలు నియమించుకుంటున్నాయి.    

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 5

ఇంటర్వ్యూలు: మార్చిలో.

ఫలితాల ప్రకటన: మే నెలలో.

వెబ్‌సైట్‌: www.iitkgp.ac.in/mhrm

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Posted Date: 01-02-2024


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌