• facebook
  • whatsapp
  • telegram

సమయపాలనకు ఆరు చిట్కాలు!

అకడమిక్‌ సక్సెస్‌కు కొన్ని సూచనలు 


సమయపాలన విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం.. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు టైమ్‌ సరిపోవడం లేదంటూ పనుల్లో వెనకపడి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ప్రతిష్ఠాత్మక ‘హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం’ మెరుగైన సమయపాలనకు కొన్ని చిట్కాలను సూచించింది.


క్యాలెండర్‌ తయారీ: ముందుగా ప్రణాళిక రచించుకోవడం ద్వారా అనుకోకుండా ఎదురయ్యే టాస్కులను విజయవంతంగా పూర్తి చేయొచ్చు. డెడ్‌లైన్లు, పరీక్షలు, సోషల్‌ ఈవెంట్లు, ఇతర కమిట్‌మెంట్ల గురించి తెలియజేసేలా పూర్తిస్థాయిలో క్యాలెండర్‌ తయారు చేసుకోవాలి. కంటికి కనిపించేలా పెట్టుకోవడం గానీ లేదా డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉంచడం కానీ చేయాలి. అనుకున్న వెంటనే చూసే మాదిరిగా దీన్ని అమర్చుకోవాలి. 


రిమైండర్లు: అవసరానికి అనుగుణంగా రిమైండర్లు సెట్‌ చేసుకోవాలి. అలారం, ఫిజికల్‌ ప్లానర్లు, డిజిటల్‌ అలెర్ట్స్‌ వంటివి చిన్న చిన్న టాస్కులను సైతం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడతాయి. బిజీ టైమ్‌లో ఏ చిన్న పనీ మిస్‌ అవ్వకుండా ఇవి చూసుకుంటాయి. 


పర్సనలైజ్డ్‌ షెడ్యూల్‌: ప్రతి ఒక్కరి దిన చర్య విభిన్నంగా ఉంటుంది. దానికి తగిన విధంగా షెడ్యూల్‌ తయారుచేసుకోవాలి. దీనిలో ఒక రోజులో చేయాల్సిన టాస్కులన్నీ వివరాలతో సహా రాసుకోవాలి. తరగతులు, స్టడీ సెషన్లు, ఇతర యాక్టివిటీలన్నీ ఇందులో ఉండాలి. ఇది రూపొందించుకునేముందు మన శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. 


టూల్స్‌ వినియోగం: మన పనికి తగిన విధంగా ఉపయోగపడేలా ఆర్గనైజేషన్‌ టూల్స్‌ను వినియోగించుకోవచ్చు. ఇవి ఫిజికల్‌ ప్లానర్స్‌ లేదా డిజిటల్‌ యాప్స్‌ అయినా కావొచ్చు. క్యాలెండర్‌ను దీర్ఘకాలిక ప్రణాళిక కోసం ఉపయోగించుకుని, ఈ టూల్స్‌ను అప్పటికప్పుడు చేసే టాస్కులకు ఉపయోగించుకోవచ్చు. 


టాస్కుల ప్రయారిటీ: పనుల ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు.. కొంత సమయం తీసుకుని ఏది ముందో ఏది వెనుకో బేరీజు వేసుకోవాలి. సులభంగా అయిపోయేవి, వేగంగా పూర్తి కావాల్సిన వాటిని ముందు వరుసలో పూర్తి చేసి.. తర్వాత మిగతావాటికి వెళ్లాలి. 


మీకోసం కొంత: ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ.. మన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మానసిక ప్రశాంతతనూ, ఆరోగ్యాన్నీ అందించేలా నచ్చిన పనులను చేయాలి. ఏదైనా హాబీ ఎంచుకోవడం, నలుగురితోనూ కలవడం, హాయిగా కాసేపు రిలాక్స్‌ అవ్వడం.. ఇవన్నీ ముఖ్యం. వీటి ద్వారా తిరిగి రీఛార్జ్‌ అవ్వగలం.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

Posted Date: 28-06-2024


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం