• facebook
  • whatsapp
  • telegram

స్పష్టంగా.. సమర్థంగా!  

తరగతి గదిలో లెక్చరర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటాడు అవినాష్‌. కానీ వాటిలో వచ్చే సందేహాలను అడిగి తెలుసుకోవడానికి సంకోచిస్తుంటాడు. సందేహాలను వ్యక్తం చేసే విధానం తెలియక తికమక పడుతుంటాడు.  డిగ్రీ పూర్తిచేసి ఇంటర్వ్యూలకు హాజరవుతోంది మౌనిక. అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో ఒత్తిడికి గురై తడబడుతుంది. విశ్లేషణాత్మకంగా ఆలోచించే నేర్పు ఉన్నా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా  వెల్లడించడంలో విఫలమవుతోంది.

అవినాష్, మౌనికలను గమనిస్తే... వీరిద్దరూ భావ వ్యక్తీకరణ సామర్థ్యం అంతగా లేక ఇబ్బందిపడుతోన్న విషయం అర్థమవుతుంది. విమర్శనాత్మకంగా ఆలోచిస్తూ, శ్రద్ధగా వింటూ, కలసికట్టుగా పనిచేస్తూ విద్యార్థి దశ నుంచీ ఈ నైపుణ్యాన్ని అలవరుచుకోవచ్చు. ఇంకా ఏయే మార్గాల్లో దీన్ని మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుందాం. 

ప్రాథమిక నైపుణ్యం: విద్యార్థులు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు, ఉద్యోగులు.. వీరందరికీ భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఎంతో అవసరం. ఆలోచనలు, అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకోవాలన్నా ఈ నైపుణ్యం ఉండాల్సిందే. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్‌ ఉండటం, ఎదుటివ్యక్తి ఏదైనా సమాచారాన్ని అడిగినప్పుడు ప్రతిస్పందించడం, వివిధ అంశాలను సంక్షిప్తంగా సూటిగా తెలియజేయడం.. ఇవన్నీ భావవ్యక్తీకరణ సామర్థ్యం కిందకే వస్తాయి. విద్యార్థుల్లో ఈ నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ప్రత్యేకంగా వీడియోలున్నాయి. వీటిని చూడటం ద్వారా కూడా భావవ్యక్తీకరణను పెంచుకోవచ్చు. వీడియోలో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు... దాన్ని మధ్యలోనే ఆపి వాళ్లు ఏమి మాట్లాడుకుంటున్నారో ముందుగానే ఊహించవచ్చు. తర్వాత మీ ఆలోచన సరైందో కాదో పరిశీలించుకోవచ్చు. 

టెక్నాలజీని ఉపయోగించుకోవాలి: ఆడియో బుక్స్, కొన్ని రకాల యాప్‌ల వాడకం ద్వారా భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆడియో బుక్స్‌ ద్వారా కొన్ని పదాలను ఎలా పలకాలో తెలుసుకోవచ్చు. ఆడియోతోపాటు కొన్ని పదాలను ఉచ్చరిస్తూ కూడా నేర్చుకోవచ్చు. అలాగే వివిధ రకాల పదబంధాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. అందుబాటులో కొన్ని ఉచిత యాప్‌లను ఉపయోగించుకుని కిండర్‌గార్టెన్‌ విద్యార్థుల నుంచి టీనేజర్ల వరకు భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు.  

గ్రూప్‌ ప్రెజంటేషన్లు: విద్యార్థులు బృందంగా ఏర్పడటం ద్వారానూ మాట్లాడటం, రాయడంలోని మెలకువలను నేర్చుకోవచ్చు. చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాదు వివిధ రకాల ప్రజంటేషన్ల ద్వారా భావ వ్యక్తీకరణను పెంచుకోవచ్చు. 

విశ్లేషించుకోవాలి: అభిప్రాయాలు, ఆలోచనలను విశ్లేషించడం నేర్చుకోవాలి. విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీపట్టకుండా అర్థంచేసుకుంటూ చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల చదివిన అంశాలన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పే నేర్పు అలవడుతుంది. 

నిర్మాణాత్మక విమర్శ: ఒక అంశాన్ని ఎంచుకుని దాన్ని పైకి చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. చదివినదాన్ని రికార్డు చేసుకుంటే లోపాలు తెలుస్తాయి. తర్వాత వాటిని సరిచేసుకోవచ్చు. లేదా ఒక ప్రత్యేకాంశం గురించి వివరించినప్పుడు తమ లోపాలను చెప్పమని సహ విద్యార్థులను అడగొచ్చు. వాళ్లు చేసే నిర్మాణాత్మక విమర్శల మూలంగా మీ బలాలు, బలహీనతల గురించి ఒక అవగాహనకు రావచ్చు. వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుని వ్యక్తీకరణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 

తెలుసుకుంటూ: ఏదైనా చదువుతున్నప్పుడు దాంట్లో తెలియని పదాలు లేదా వాక్యాలు ఉండొచ్చు. అప్పుడు వెంటనే వాటికి అర్థాలు తెలుసుకోవాలి. అలాగే పుస్తకం చదువుతున్నప్పుడు అందులోని వాక్య నిర్మాణం సంక్లిష్టంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు ఆ వాక్యాన్ని మరింత సులువుగా ఎలా రాయొచ్చో ఆలోచించాలి. ఎదుటివారికి మీ అభిప్రాయాలు, ఆలోచనలను మరింత సులభంగా, అర్థవంతంగా తెలియజేయడానికి ప్రయత్నించాలి.

శ్రద్ధగా వినాలి

భావ వ్యక్తీకరణ అంటే.. ఎదుటివారికి అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడటం మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ శ్రద్ధగా వినడం కూడా ఈ నైపుణ్యం కిందికే వస్తుంది. సాధారణంగా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు వింటుంటారు కదా. అలా విన్న విషయాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో ఎవరికివాళ్లు విశ్లేషించుకోవాలి. వింటున్నప్పుడు కొన్ని సందేహాలూ వస్తుంటాయి. తర్వాత వాటన్నింటికీ సమాధానాలను రాబట్టాలి.

Posted Date: 13-08-2021


 

భావ వ్యక్తీకరణ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం