• facebook
  • whatsapp
  • telegram

భావ వ్యక్తీకరణకు అత్యంత ప్రభావం

 ఆశావహ దృక్పథం అలవర్చుకుంటే అనుకూల ఫలితాలు ఎంతగా లభిస్తాయో కిందటి సంచికలో తెలుసుకున్నాం. 'సాఫ్ట్ స్కిల్స్‌లో మరో నైపుణ్యం' భావ వ్యక్తీకరణ. ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక విద్యలు చదివినవారు ఉద్యోగం పొందాలంటే ఈ నైపుణ్యం ఎంతో కీలక పాత్ర వహిస్తోంది! 

  చెప్పదల్చుకున్న విషయాన్ని ఎటువంటి సందిగ్ధతా, అయోమయమూ లేకుండా అవతలి వ్యక్తికి అందించడమే ప్రభావశీలమైన భావ వ్యక్తీకరణ. అంటే- స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో! ఒక సందేశాన్ని పంపినపుడు పంపిన వ్యక్తి, అందుకున్న వ్యక్తి కూడా సరైన రీతిలో దాన్ని అర్థం చేసుకోగలిగినపుడే అది సమర్థమైన కమ్యూనికేషన్ అవుతుంది. 

  అవతలి వ్యక్తికి చెప్పదలుచుకున్న విషయం సరైన రీతిలో చేరకపోతే ఏమవుతుంది? అది వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఎన్నో అవరోధాలు కలిగిస్తుంది. 

  50,000కు పైగా ఉద్యోగులున్న కొన్ని పెద్ద కంపెనీలు మేనేజర్లను నియమించుకునేటపుడు భావ ప్రకటనా నైపుణ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పాయి. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ కట్జ్ బిజినెస్ స్కూల్ చేసిన ఒక సర్వే ప్రకారం- మౌఖిక, రాతపూర్వకమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం (verbal and written communication skill) ఉద్యోగ విజయంలో ప్రముఖపాత్ర వహిస్తుందని తేలింది. 

విజయవంతమైన కెరియర్ నిర్మాణానికి ప్రభావశీలమైన భావ వ్యక్తీకరణ ఎంతో అవసరం. దీన్ని సాధించాలంటే... పంపుతున్న సందేశం ఏమిటి, ఎవరికి పంపుతున్నాం, గ్రహీత దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడన్న విషయంలో స్పష్టత అవసరం.
 

ఏడు సవాళ్ళు! 

The seven challenges work book రచించిన డెనిస్ రివర్స్ ప్రభావశీలమైన భావ ప్రకటన గురించి ఆ పుస్తకంలో వివరిస్తాడు. ఆ భావ వ్యక్తీకరణ నైపుణ్యం కోసం 7 సవాళ్ళను ఎదుర్కోవలసివుంటుందని చెప్తాడు.
 

1. శ్రద్ధగా, బాధ్యతగా వినడం : ఎదుటి వ్యక్తి చెప్పినదాన్ని శ్రద్ధగా విన్నంతమాత్రాన వారితో ఏకీభవిస్తున్నట్లు కాదు. అయినా సరే, మనం చెప్పినదాన్ని ఎదుటివారు వినాలంటే వారు చెప్పేది శ్రద్ధగా, బాధ్యతగా వినడం ఎంతో అవసరం. 
 

2. జాగ్రత్తగా వివరించడం : దేని గురించి సంభాషించాలనుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా వివరించాలి. ఎదుటి వ్యక్తికి సంభాషణలో పాత్ర కల్పిస్తే ఆ వ్యక్తి అభిప్రాయాలు తెలుసుకోవడానికీ, అతని సహకారం పొందడానికీ వీలవుతుంది.
 

3. స్పష్టంగా, సంపూర్ణంగా : తన భావాన్ని వీలైనంత స్పష్టంగా, సంపూర్ణంగా వివరించాలి. తన అనుభవాలను సైతం పూర్తిగా సమాచారాత్మకంగా ఉండేట్లు వివరించాలి. స్వీయ అవగాహనకు కూడా ఇది ఉపయోగం.
 

4. ఆశావహ ఫలితాలపై దృష్టి : విమర్శలనూ, ఫిర్యాదులనూ కూడా విజ్ఞప్తులుగా మార్చాలి. ఆశావహ ఫలితాలపై దృష్టి పెట్టి విజ్ఞప్తులు చేయాలి. గతంలో చేసిన పొరపాట్లపై కాకుండా వర్తమానంలో, భవిష్యత్తులో చేరబోయే విజయతీరాలపై దృష్టి కేంద్రీకరిస్తే సత్ఫలితాలు వస్తాయి.
 

5. అనుబంధ ప్రశ్నలకు ఆస్కారం : ప్రశ్నలు అడిగేటప్పుడు అవి ఎక్కువ సమాచారాన్ని రాబట్టే విధంగానే కాక, మరికొన్ని ముఖ్యమైన అనుబంధ ప్రశ్నలకు ఆస్కారం ఉండేలా చూసుకోవడం ముఖ్యం (open ended questions).
 

6. కృతజ్ఞత,అభినందిన : చేసిన పనిని గుర్తించడం, దానికి అభినందించడం, కృతజ్ఞత వ్యక్తం చేయడం ఉద్యోగుల మధ్య అయినా ఇంట్లో అయినా వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుస్తుంది.
 

7. నేర్చుకోవడంపై దృష్టి : పైన వివరించిన ఆరు విషయాలనూ దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉండేట్లు చూసుకోవాలి. ప్రతి సంభాషణనూ ఎదగడానికీ, నైపుణ్యం పెంచుకోవడానికీ దోహదం చేసే అవకాశంగా మలుచుకోవాలి.

ఇలా మెరుగుపరుచుకోవచ్చు

     భావ వ్యక్తీకరణ నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి కింది సూచనలు ఉపయోగపడతాయి.

*   ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉందనే విషయాన్ని గుర్తెరిగి ఉండటం అవసరం.

*   మీ ప్రవర్తనకు మీరే బాధ్యత వహించగలగాలి. పొరపాట్లకు బాధ్యత వహించడానికి వెనుకాడకూడదు. ఇతరులతో మీ ప్రవర్తన ఎలా ఉన్నదనే విషయం వారిని అడిగి తెలుసుకోవడం ఉపయోగకరం.

*   ఇతరులతో వ్యవహరించేటపుడు హావభావాలకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. మాటలూ చేతలూ ఒకదానితో ఒకటి ఏకీభవించకపోతే సాంఘిక వాతావరణంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

*   భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెంచుకోవడానికి ఉత్తమ మార్గం- శ్రద్ధగా వినడం! అవతలి వ్యక్తి చెప్పే విషయం మీద మధ్యలోనే స్పందించే తత్వానికి స్వస్తి చెప్పాలి. ఏకాగ్రతతో విని, విషయం అర్థం చేసుకోవాలి. మధ్యలోనే సలహాలూ, సూచనలూ ఇవ్వడానికీ, విమర్శలు రేపడానికీ ప్రయత్నించకూడదు.

*   ఈ నైపుణ్యం పెంచుకోవడం ఒకరోజులో సాధ్యమయ్యే పని కాదు. అనేక విషయాల మీద ఒకేసారి దృష్టి పెట్టడం కంటే ఒక నిర్దేశిత సమయంలో రెండు మూడు విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు వ్యక్తిగతంగా మీకున్న శక్తియుక్తుల సాయంతో సానుకూల ఫలితాలు సాధించాలి.

*   ఇతరులతో మీ ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, పరిశీలించుకుంటూ ఉండాలి. మీ ప్రతికూల ప్రవర్తనకు బాధ్యత వహించడం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం, సమస్యలను పరిష్కరించడం నేర్చుకోవడం, హావభావాలను మెరుగుపరుచుకోవడం... ఇవన్నీ ఎంతో ఉపయోగకరం.

చదవదగిన పుస్తకాలు

*  Communication Skills: Stepladders to success for the professional by Richard Ellis

*  The handbook of Communication Skills by Owen Hargie

*  101 ways to improve your communication skills instantly by Jo Condrill & Bennie Bough

Posted Date: 07-09-2020


 

భావ వ్యక్తీకరణ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం