• facebook
  • whatsapp
  • telegram

పాఠాలపై దృష్టి నిలవటంలేదా?

వర్షిణి సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదువుకోవాలనుకుంటుంది. కానీ పుస్తకం తెరవగానే రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది. ఏకాగ్రతను నిలపలేక ఇబ్బందిపడుతోంది. వరుణ్‌కు జ్ఞాపకశక్తి తక్కువ. పాఠాలను ఎప్పటికప్పుడు చదివినా వాటిని కొద్ది రోజుల్లోనే మర్చిపోతుంటాడు. చదివిన వాటినే మళ్లీ మళ్లీ చదవడంతో సమయమూ వృథా అవుతోంది. 

ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి లోపించడం...లాంటి సమస్యలతో వర్షిణి, వరుణ్‌ మాత్రమే కాదు ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారి కోసం నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వాటిని పాటిస్తే చక్కని ఫలితాలను పొందే అవకాశముందంటున్నారు. అవేమిటంటే... 

స్పైడర్‌ వెబ్‌ టెక్నిక్‌: సాలెగూడును పెన్సిల్, పెన్‌ లేదా చిన్న చెక్కముక్కతో ఒకసారి తాకి చూడండి. మీరు తాకిన వెంటనే సాలీడు గూడు అల్లడం మానేసి అంతరాయం కలిగిన వైపు చూస్తుంది. శత్రువు ఏదైనా తన మీద దాడి చేస్తుందేమోనని అనుమానపడుతుంది. ఆ తర్వాత మీరు గూడును పదేపదే తాకినా అది మిమ్మల్ని పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరిగ్గా ఇలాగే మీరు కూడా మారిపోవాలి. చదవడానికి కూర్చున్నప్పుడు రకరకాల అవాంతరాలు వస్తుంటాయి. కొన్ని నిమిషాలపాటు మీకు అంతరాయం కలిగినా వాటిని మర్చిపోయి చదవడానికి వీలుగా మీ మనసును సిద్ధం చేసుకోవాలి. మీరు చదువుకుంటుండగా కుటుంబ సభ్యుల మాటలు వినిపించవచ్చు. చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలూ మీకు అంతరాయం కలిగించవచ్చు. అయినా వాటి గురించి ఆలోచించకుండా మీ మనసును పుస్తకం మీదే నిలపాలి. 

కీ వర్డ్‌ టెక్నిక్‌: ఒక ప్రత్యేకమైన పదాన్ని ఎంచుకుని దాన్ని పదేపదే ఉచ్చరించడం ద్వారా కూడా అవాంతరాలను అధిగమించవచ్చు. ఎలాంటి పదాన్ని తీసుకోవాలనే విషయంలో నిబంధనలేమీ లేవు. ఉదాహరణకు మీరు చదవడానికి కూర్చోగానే కిందటి రోజు జరిగిన సంఘటనలో, స్నేహితులతో జరిపిన సంభాషణో గుర్తుకురావచ్చు. అలాంటప్పుడు వెంటనే మీరు ‘చదువు’ అనే పదాన్ని పదేపదే ఉచ్చరించాలి. తిరిగి మీరు చదవడం మొదలుపెట్టేంత వరకు ఈ పదాన్ని అనుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి అవాంతరాలూ ఎదురైనా చదువును కొనసాగించగలుగుతారు.

తగినంత నిద్ర: తగినంత నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవడం ద్వారా మెదడు చురుగ్గా, శక్తిమంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగని అదేపనిగా నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడమూ సరికాదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశమూ ఉంది. చదివేటప్పుడు మధ్యలో పావు గంటసేపు విరామం తీసుకుంటే మెదడు తాజాగా ఉండటమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అలాగే ధ్యానం చేయడం వల్ల కూడా ఏకాగ్రత పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. విశ్రాంతి తీసుకుంటునప్పుడు కూడా ప్రత్యేకమైన చిహ్నం, విగ్రహం గురించి మనసులో ఆలోచించవచ్చు. ఈ చిట్కాను ఎప్పుడైనా, ఎక్కడైనా పాటించవచ్చు. దీనివల్ల కూడా ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. 

చురుకుదనాన్ని పెంచే ఆటలు: సుడోకు, చెస్‌ లాంటివి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు ఏకాగ్రతను పెంచడానికీ తోడ్పడతాయి. దీంతోపాటుగా సొంతగా  నిర్ణయం తీసుకునే నైపుణ్యమూ అలవడుతుంది. కొన్ని రకాల వ్యాయామాల వల్ల శారీరక కండరాలు బలోపేతం అయినట్టుగానే క్రాస్‌వర్డ్‌ పజిల్స్, చిత్రాల పజిల్స్‌ నింపడం వల్ల మెదడూ చురుగ్గా మారుతుంది. వీటిని తరచూ ఆడటం వల్ల ఏకాగ్రతా పెరుగుతుంది. 

వ్యాయామాలు: శారీరక ఆరోగ్యం మానసికారోగ్యానికి తోడ్పడుతుంది. రకరకాల శారీరక సమస్యలతో ఇబ్బందిపడే వ్యక్తులు  శారీరక వ్యాయామాల ద్వారా ఏకాగ్రతను పెంచుకోవచ్చు. వేగంగా నడవడం, జంపింగ్‌ జాక్స్, పరుగు... ఇవన్నీ మెదడుకు తగినంత ఆక్సిజన్‌ను అందేలా చేస్తాయి. రోజూ వ్యాయామాలు చేయడం వల్ల శారీరక దార్ఢ్యంతోపాటు ఏకాగ్రతా పెరుగుతుంది. ప్రాణాయామ, యోగాసనాలు లాంటివి ఒత్తిడిని తగ్గించి చదువు మీద దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. 

పోషకాహారం: వ్యాయామాలతోపాటుగా పోషకాహారం తీసుకోవడమూ ఎంతో అవసరం. బెర్రీలు, బ్రకోలి, అవకాడోలు, చిరుధాన్యాలు, చేపలు, గుమ్మడి విత్తనాలు... ఇవన్నీ సానుకూల దృక్పథాన్ని పెంచుకోవటంలో పరోక్షంగా తోడ్పడతాయి. ఇలాంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఏకాగ్రతా పెరుగుతుంది. 
 

Posted Date: 04-08-2021


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం