• facebook
  • whatsapp
  • telegram

చిత్తడి నేలలకు గడ్డుకాలం

* పర్యావరణంపై పెనుప్రభావం

దేశంలోని చిత్తడి నేలలు శరవేగంగా కనుమరుగైపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ నేలలు ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో 35శాతానికి పైగా తగ్గిపోయాయని నివేదికలు చాటుతున్నాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తికి, నీటివనరుల పరిశుభ్రతకు, వరదలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు మురుగును నియంత్రించడానికి, విభిన్న రకాల వృక్ష, జీవజాతుల పెరుగుదలకు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు చిత్తడినేలలు. ఆక్రమణల చెరలో చిక్కి ఇవి నానాటికీ కుంచించుకుపోతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో జీవవైవిధ్యం కనుమరుగు కావడంతోపాటు ఆహారం, నీటి కొరతా తలెత్తుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

ఉనికికే ఎసరు

దేశంలోని చిత్తడినేలలు, మడ అడవులు, ప్రవాళ మృత్తికలు, బురద నేలల పరిరక్షణలో సహకారం అందించే లక్ష్యంతో ఈ శాఖ భారత చిత్తడి నేలల (వెట్‌ల్యాండ్స్‌ ఆఫ్‌ ఇండియా) పోర్టల్‌ను ప్రారంభించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల రెండో తేదీన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల (ఈఎఫ్‌సీసీ) శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన చిత్తడి నేలల నివేదిక- వాటి ఆక్రమణలు, కాలుష్యం, పూడిక వంటి సమస్యలను ప్రస్తావించింది. ఈఎఫ్‌సీసీ శాఖ సూచన మేరకు ఉపగ్రహాల సహకారంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2006 నుంచి అయిదేళ్లపాటు జాతీయ చిత్తడి నేలల గణన చేపట్టింది. రాష్ట్రాల వారీగా వాటి పటాలను రూపొందించింది. ‘దేశవ్యాప్తంగా 7.57 లక్షల చిత్తడి నేలలను గుర్తించి, మ్యాపింగ్‌ చేశాం. వాటి విస్తీర్ణం 1.52 కోట్ల హెక్టార్లు. మన దేశ విస్తీర్ణంలో చిత్తడి నేలల వాటా 4.63 శాతం’ అని 2019లో కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది.

వాతావరణ మార్పులు, ఆక్రమణలు, కాలుష్యం, వాటి పరిధిలో చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటు, ఇతర నిర్మాణాలు చిత్తడి నేలల ఉనికికి సవాలుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 95వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సులో గత దశాబ్ద కాలంలో ఏకంగా 20 వేల హెక్టార్ల చిత్తడి నేలలు చేపల చెరువులుగా మారిపోయాయని, వాటి వ్యర్థ జలాలతో ఈ మంచినీటి సరస్సు మురుగుకాసారంగా మారిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ సరస్సు పరిధిలో రోడ్లు, భవనాల నిర్మాణంతో దాని రూపురేఖలే మారిపోయాయని ఆ నివేదిక వెల్లడించింది. చేపల చెరువుగట్ల ఏర్పాటు, సరస్సు భూభాగంలో మూడు ప్రధాన రోడ్ల నిర్మాణం కొల్లేరులో మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. వ్యవసాయ భూముల నుంచి వచ్చే నీటి ప్రవాహాల కారణంగా వర్షాకాలంలో నాలుగైదేళ్లకోసారి వరదలొచ్చి భారీ ఆర్థిక నష్టం సంభవిస్తోంది. రసాయనాల సాంద్రత పెరిగిపోతుండటంతో సరస్సులోని నీటి నాణ్యత దెబ్బతిని చేపలు, పక్షులకు ముప్పుగా పరిణమిస్తోంది. కొల్లేరుకు ఒకప్పుడు వందల సంఖ్యలో విదేశీ పక్షులు వలస వచ్చేవి. ప్రస్తుతం అవి పదుల సంఖ్యకు పరిమితమవడం ఈ ప్రభావమేనని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చుట్టూ ఉన్న 200దాకా చేపల చెరువుల నుంచి కలుషిత జలాలు పులికాట్‌ సరస్సులో కలుస్తున్నాయి. వాటిలోని రసాయనాలు సరస్సు స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయి. అందుకే దాని చుట్టూ రెండు కిలోమీటర్ల బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని ఈఎఫ్‌సీసీ మంత్రిత్వశాఖ ఆదేశించింది.

సమష్టి కృషి అవసరం

కేంద్ర ప్రభుత్వం 2017లో చిత్తడి నేలల (పరిరక్షణ, నిర్వహణ) నిబంధనలు తీసుకొచ్చింది. రెండున్నరేళ్ల వరకు వాటి అమలుపై రాష్ట్రాలకు ఎలాంటి సమాచారం అందించలేదు. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా గతేడాది ఆ నిబంధనలను ప్రకటించింది. చిత్తడి నేలల జాబితా తయారుచేసి, వాటి పరిధిలో చేపట్టకూడని కార్యకలాపాలను నిర్దేశించింది. ఈ తరహా భూముల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో చిత్తడి నేలల ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలని, మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులతోపాటు పౌరులనూ ఇందులో భాగస్వాములను చేయాలని సూచించింది. చిత్తడి నేలల ఆవరణం, మత్స్యసంపద, నీటి వనరులు, అక్కడి ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఉన్న నిపుణులకు ఈ సంస్థలో చోటు కల్పించాలని తెలిపింది. ఈ సంస్థ ప్రతిపాదిత చిత్తడి నేలల్లో ఏయే కార్యకలాపాలు నిషేధమో నిర్ణయించాలని, వాటి పరిరక్షణకు వ్యూహాలు రూపొందించి అమలు చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక విభాగానికి నోడల్‌ శాఖగా బాధ్యతలు అప్పగించి, చిత్తడి నేలల పరిరక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చూడాలని సూచించింది. ఈ ప్రాధికార సంస్థ నిర్వహణకు మానవ వనరులను, నిధులను కేటాయించాలని తెలిపింది. ఈ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం రాష్ట్రాలకు కొంత నిధులిస్తోంది. జలసంబంధ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ కోసం జాతీయ ప్రణాళిక కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో 160 చిత్తడి నేలల సంరక్షణకు రూ.1,063 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులైలో రాజ్యసభలో వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ కీలకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో ముందుకెళ్లడంతో పాటు పౌరుల్లోనూ పర్యావరణ స్పృహ పెరిగితేనే చిత్తడి నేలల పరిరక్షణ సాధ్యమవుతుంది.

వేగంగా కనుమరుగు

ఆంధ్రప్రదేశ్‌లో 2.16 లక్షల హెక్టార్ల పరిధిలో తొమ్మిది ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఉన్నట్లు భారత చిత్తడి నేలల పోర్టల్‌ వెల్లడించింది. ఇందులో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సుకు అరడజను ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సహజ జలవనరుల వ్యవస్థను ఇష్టారీతిగా మార్చడం, పూడిక, కాలుష్యం, చేపల చెరువులు, దురాక్రమణలు వంటివి దీనికి ముప్పుగా పరిణమించాయి. కేరళలోని వెంబనాడ్‌ సరస్సు నుంచి ఒడిశాలోని చిలుకా సరస్సు దాకా, దేశవ్యాప్తంగా హిమాలయ పర్వత సానువుల వరకు విస్తరించి ఉన్న చిత్తడి నేలలన్నీ ఆక్రమణల పాలిటో, కాలుష్యం, పర్యావరణ మార్పుల బారినో పడుతున్నాయి. అందుకే అడవుల కంటే వేగంగా అవి అంతరించిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. 1700 సంవత్సరం నుంచి దేశంలో 87శాతం చిత్తడి నేలలు ఆక్రమణలకు గురయ్యాయి. గడిచిన మూడు దశాబ్దాల్లోనే వాటిలో 30శాతానికి పైగా కనుమరుగు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

Posted Date: 26-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం