• facebook
  • whatsapp
  • telegram

ఒప్పంద సేద్యంలో లొసుగుల రాజ్యం

ఒప్పంద సేద్యంలో రైతులకు ఆదాయం పెరగకపోగా, నష్టాలు ఎదురవుతున్నాయి. అన్నదాతల అమాయకత్వం ఆసరాగా సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు అనేక రకాలుగా ఒప్పందాలు చేసుకుంటూ పంటలు సాగు చేయించి వారిని మోసగిస్తున్నారు. ఈ విషయంలో కర్షకులకు ప్రభుత్వాలు రక్షణగా నిలవాల్సిన అవసరం ఉంది. 

గతంలో కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల్లో ఒకటి ఒప్పంద సేద్యానికి సంబంధించింది. దాని అమలు వల్ల కలిగే లాభనష్టాలపై రైతులు, కంపెనీలు, ఇతర వర్గాల నుంచి అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తాయి. ఉత్తర భారతానికి చెందిన రైతులు ఆ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించడంతో, వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కొత్తగా తెచ్చిన మూడు చట్టాలు రద్దయినందువల్ల దేశంలో ఒప్పంద సేద్యం అమలులో లేదనుకోకూడదు. పాత చట్టాల ప్రకారం దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆ పద్ధతి కొనసాగుతోంది. అయితే, పత్తి విత్తన పంటను పండించాలని ఒప్పందం చేసుకున్న ప్రైవేటు కంపెనీలు మోసగించాయని ఇటీవల తెలంగాణలో రైతులు ధర్నాలు చేసినా వారికి ఎలాంటి సహాయం అందలేదు. పాత చట్టాలను సైతం సక్రమంగా అమలు చేయడంలో రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం అన్నదాతలకు శాపంగా మారింది.

నాణ్యత లేదనే సాకుతో...

ఎవరైనా వ్యాపారి లేదా కంపెనీ రైతుతో నిర్దిష్టంగా ఒక పంటను సాగుచేయించి తిరిగి కొంటామని ఒప్పంద పత్రం రాయించుకొనే విధానాన్ని ‘ఒప్పంద సేద్యం’గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రైతులతో ఒప్పందాలు చేసుకునే వ్యాపారులు, కంపెనీల ప్రతినిధులు పలు మోసాలకు పాల్పడుతున్నారు. రైతుకు, కంపెనీకి జరిగే ఒప్పందం ప్రైవేటు వ్యవహారంగా భావిస్తూ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. దాంతో చివరకు పేద రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు పత్తి, వరి, ఇతర పంటల విత్తనాలను తెలుగు రాష్ట్రాల్లో రైతులతో ప్రైవేటు కంపెనీలు ఈ ఒప్పంద పద్ధతిలో సాగు చేయిస్తున్నాయి. కానీ, ఎంత ధర చెల్లించి పంటను తిరిగి కొంటామనే దానిపై ముందుగా స్పష్టత ఇవ్వడం లేదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఇష్టారీతిన నచ్చిన ధరలకు కొంటున్నాయి. కొనడం ఇష్టం లేకపోతే ‘నాణ్యత బాగాలేదు’ అనే ముద్ర వేసి తిరస్కరిస్తున్నాయి. పంట సాగుకోసం కంపెనీ ముందుగా ఇచ్చే విత్తనాలు నాసిరకంగా ఉండి, పైరు ఎదగక రైతు నష్టపోతే ఒప్పందం చేసుకున్న సంస్థలు ముఖం చాటేస్తున్నాయి. పత్తి విత్తనాలపై ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నా, రైతులకు అందులో కనీసం మూడోవంతు సొమ్ము సైతం అందడం లేదు. విత్తన పంటలన్నీ ఒప్పంద సేద్యం కింద పండిస్తున్నవే అయినా రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. తెలంగాణలో పత్తి విత్తనాలు పండించే రైతులతో కంపెనీలు నేరుగా ఒప్పందాలు చేసుకోకుండా మధ్యలో స్థానిక నేతలు, వ్యాపారులను దళారులుగా పెట్టుకుంటున్నాయి. కంపెనీ అనధికార ప్రతినిధి పేరుతో ఈ దళారులే రైతులతో ఒప్పందాలు చేసుకుని పంటను సాగు చేయిస్తున్నారు. ధర లేదా ఇతరత్రా ఏ విషయంలోనైనా తేడా వస్తే ముఖం చాటేస్తున్నారు. సంబంధిత దళారులతో రైతులు గొడవ పడినా ఎలాంటి పరిహారం దక్కడం లేదు. రాతపూర్వక ఒప్పందాలు లేకుండానే ఈ పద్ధతిలో సాగు చేయిస్తుండటం సమస్యగా మారింది. మోసపోయిన రైతు కోర్టుకు వెళ్ళినా ఒప్పందం పక్కాగా లేనందువల్ల కంపెనీలపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉండటం లేదు. ఒప్పందం చేసుకుని పంట నాణ్యతను బట్టి ధర చెల్లిస్తామని కంపెనీలు ముందుగా చెబుతున్నా, పంట పండి విక్రయానికి తెచ్చాక నాణ్యత బాగాలేదంటూ ధర తగ్గించి మోసగిస్తున్నాయి. చక్కెర మిల్లులు ఎంతోకాలంగా దేశంలో చెరకు పంటను ఒప్పంద సేద్యం విధానంలో రైతులతో పండిస్తున్నాయి. చెరకును అమ్మిన రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించకుండా ఏటా వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి కర్షకులను నానా అవస్థలకు గురిచేస్తున్నాయి. పామాయిల్‌కు సంబంధించి ప్రభుత్వ మిల్లుల్లో వచ్చే ఉత్పత్తి శాతం ఆధారంగా ధర ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో ఆయిల్‌ పాం ఒప్పంద సేద్యం రైతులకు ప్రయోజనకరంగా మారింది. ప్రతి పంట ఒప్పంద సేద్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకోవడం లేదు.

పటిష్ఠ వ్యవస్థలు కీలకం

న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌ వంటి చిన్నదేశాల్లో సైతం ఒప్పంద సేద్యం పక్కాగా సాగుతోంది. కంపెనీలు రైతులతో ఒప్పంద సేద్యం చేయిస్తే వారిని కాపాడేందుకు పలు దేశాల్లో పటిష్ఠమైన చట్టాలుఉన్నాయి. భారత్‌లో ఒప్పంద సేద్యంపై పకడ్బందీ చట్టం లేకపోవడం పెద్ద సమస్య. పైగా, ఉన్న శాసనాలనూ సరిగ్గా అమలు చేయడం లేదు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న విత్తన కంపెనీలు పంటలను ఒప్పంద సేద్యం విధానంలోనే పండిస్తున్నా, ఆ వివరాలేవీ రాష్ట్ర వ్యవసాయశాఖ వద్ద లేవు. ప్రతి రైతు వేసే పంట, సాగు విస్తీర్ణం వంటి వివరాలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తున్నందువల్ల అది ఒప్పంద సేద్యమా కాదా అనే వివరాలను సైతం వ్యవసాయ, ఉద్యానశాఖలు సేకరించాలి. పంట నాణ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వమే వ్యవసాయ మార్కెట్లలో ప్రయోగశాలలు ఏర్పాటుచేస్తే రైతులకు మేలు కలుగుతుంది. నాణ్యత నిర్ధారణను తటస్థ సంస్థతో చేయించడమూ అన్నదాతలకు ప్రయోజనకరమే. రైతులతో చేసుకునే ఒప్పందాన్ని పక్కాగా మార్కెటింగ్‌, వ్యవసాయశాఖల అధికారుల వద్ద నమోదు చేయిస్తే మరింత పారదర్శకత వస్తుంది. ఒప్పంద సేద్యంలో రైతు నష్టపోతే ఫిర్యాదు చేసిన పది రోజుల్లోగా న్యాయం జరిగేలా పటిష్ఠమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఆయా కంపెనీల నుంచి నిర్ణీత రుసుము వసూలు చేసి ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఒప్పంద సేద్య ప్రక్రియలో రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తే కంపెనీలు, వ్యాపారుల మోసాలతో రైతులకు ఆవేదనే మిగులుతుంది.

పక్కాగా కొనుగోళ్లు

మధ్యప్రదేశ్‌లో మూడు బడా కంపెనీలు సంయుక్త కన్సార్షియంగా ఏర్పడి చేయించిన ఒప్పంద సేద్యంతో రైతులు లాభపడ్డారని జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ అధ్యయనంలో తేలింది. పంట సాగుకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ఇతర యంత్ర సామగ్రి వంటివన్నీ ఆ కంపెనీలు సమకూర్చి, పంటను తిరిగి పక్కాగా కొనడంతో రైతుల ఆదాయం పెరిగినట్లు వెల్లడైంది. అదేవిధంగా పంజాబ్‌లో టమాటా, బాస్మతి, వేరుసెనగ, కర్ణాటకలో బార్లీ పంటలను సైతం ఒప్పంద సేద్యం కింద రైతులతో సాగుచేయించిన సంస్థలకు, రైతులకు లాభాలు దక్కాయి. ఇలాంటి విధానాలు అన్నిచోట్లా అమలవ్వాలి.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మడ అడవులకు మరణ శాసనం

‣ ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

‣ పర్యావరణ పరిరక్షణ... పుడమికి సంరక్షణ!

‣ పొరుగుపై చైనా దూకుడు

‣ జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం