• facebook
  • whatsapp
  • telegram

సాగు యాంత్రీకరణతో గిట్టుబాట

ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణ కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాక్టర్లు మొదలుకొని కృత్రిమ మేధ వరకు అది విస్తరిస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు యాంత్రీకరణ అందుబాటులో లేకుంటే అసమానతలు మరింత పెరుగుతాయని ఇటీవల ఓ నివేదిక విశ్లేషించింది.

ఉత్తర అమెరికా, ఐరోపాలోని అధిక ఆదాయ దేశాలు 1960ల నాటికే వ్యవసాయంలో యాంత్రీకరణను సాధించాయి. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో అది తక్కువగా జరిగింది. 2005 నాటికి జపాన్‌లో సగటున వెయ్యి హెక్టార్ల సాగుభూమికి 400 కంటే ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి. ఘనాలో ఆ నిష్పత్తి కేవలం 0.4. ఆఫ్రికాలో సహారా ఎడారికి దక్షిణాన ఉన్న దేశాల్లో ఇప్పటికీ వ్యవసాయం సంప్రదాయ పద్ధతిలోనే సాగుతోంది. ఇది ఉత్పాదకతను పరిమితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆహార వ్యవస్థల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి యాంత్రీకరణ ఎలా తోడ్పడుతుందో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ‘ఆహార, వ్యవసాయ స్థితిగతుల నివేదిక-2022’ పరిశీలించింది. వ్యవసాయంలో లాభాలను పెంచుకోవడం, నష్టాలను తగ్గించుకోవడంపై విధాన రూపకర్తలకు అది పలు సిఫార్సులు చేసింది. ఆయా ప్రాంతాల్లో యాంత్రీకరణకు సహాయపడటానికి అద్దె యంత్రాలు కీలకపాత్ర పోషిస్తాయని నివేదిక అభిప్రాయపడింది.

సాంకేతిక పురోగతి లేకుండా, ఉత్పాదకత ఇతోధికం కాకుండా పేదరికం, ఆకలి, ఆహార అభద్రత, పోషకాహారలోపం నుంచి కోట్ల సంఖ్యలో ప్రజలకు విముక్తి కల్పించలేమని ఎఫ్‌ఏఓ డైరెక్టర్‌ జనరల్‌ క్యూ డాంగ్యూ వ్యాఖ్యానించారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 950 కోట్లకు చేరుకుంటుందని ఎఫ్‌ఏఓ అంచనా. వారిని పోషించడానికి ఆహార ఉత్పత్తిని కనీసం 70శాతందాకా పెంచాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆహార ఉత్పత్తిని రెట్టింపు చేసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు యాంత్రీకరణ మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అయితే, యాంత్రీకరణ వల్ల వ్యవసాయంలో తలెత్తే ప్రతికూల ప్రభావాలనూ ఎఫ్‌ఏఓ నివేదిక ప్రస్తావించింది. గ్రామీణ కార్మికులు సమృద్ధిగా ఉన్న చోట యాంత్రీకరణ నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉంది. విధాన నిర్ణేతలు అలాంటి ప్రాంతాల్లో యాంత్రీకరణకు రాయితీలను నిరాకరించాలని నివేదిక సూచించింది. రైతులు యాంత్రీకరణను అందిపుచ్చుకోవడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, దానివల్ల ఉపాధి కోల్పోయే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు సామాజిక రక్షణ కల్పించాలని వివరించింది.

సామాజిక, ఆర్థిక కోణంలో భారత్‌లో వ్యవసాయ రంగం కీలకమైంది. ఇది భారీ సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో రైతులు సాగుకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏటికేడు పెట్టుబడి పెరిగిపోతోంది. పురుగుమందులు, రసాయన ఎరువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కూలీల ఖర్చు అధికమైంది. కొన్ని ప్రాంతాల్లో కూలీల కొరత వేధిస్తోంది. భూసార క్షీణత, తుపానులు, కరవులు వంటి విపత్తులు, అస్థిరమైన ధరలు, మౌలిక వసతుల లేమి వంటివీ కర్షకులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. దాంతో పంట విరామం ప్రకటిస్తున్న సందర్భాలూ చోటుచేసుకుంటున్నాయి. సాగు సమస్యల పరిష్కారానికి యాంత్రీకరణ ఉత్తమ మార్గం. ఇది పెట్టుబడులను తగ్గిస్తుంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి ఆధునికతవైపు అడుగులు వేసేందుకు ప్రణాళికాబద్ధమైన చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి. దేశీయంగా చిన్న, సన్నకారు రైతులే 85శాతానికి పైగా ఉన్నారు. వారందరినీ యాంత్రీకరణవైపు మళ్ళించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే.

ఆధునిక వ్యవసాయంలో రోబోలు, డ్రోన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలూ కీలకమవుతున్నాయి. విత్తనాలు విత్తే దగ్గర నుంచి పంట కోత దాకా ప్రతి దశలోనూ వాడేందుకు యంత్రాలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దేశంలోని పేదరైతులకు అవి చౌకగా అందుబాటులో ఉండాలి. అందుకోసం ప్రభుత్వాలు రాయితీలను అందించాలి. లేనిపక్షంలో ప్రాథమిక సహకార సంఘం లేదా రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా వాటిని అందుబాటులో ఉంచాలి. మన రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులు కావడంతో వాటిని ఉపయోగించడమూ వారికి సమస్యే. అందువల్ల వాటిని వినియోగించడంలో సరైన శిక్షణ ఇవ్వాలి. యంత్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిపుణులను అందుబాటులో ఉంచాలి. వీటితోపాటు దేశంలో వ్యవసాయ పరిశోధనలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరమూ ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాన్ని ఇందులో కీలక భాగస్వామిని చేయాలి. అలాగే ప్రకృతి విపత్తులను, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించడమూ తప్పనిసరి. తద్వారా రైతుల ఆదాయం ఇతోధికమవుతుంది.

- డి.ఎస్‌.బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీఎస్టీ సరళీకరణకు సమయమిది

‣ చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

‣ డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

Posted Date: 21-12-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని