• facebook
  • whatsapp
  • telegram

ఆహార భద్రతపై వాతావ‘రణం’!ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో వాతావరణ మార్పులు కీలకమైనవి. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణంలో వేగంగా పెను పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దానివల్ల ఆహార భద్రతకూ తీవ్ర ముప్పు పొంచి ఉంది.


వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వానలు అధికమయ్యాయి. మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేసవిలో ఠారెత్తించే ఎండలు, చలికాలంలో భీకర శీతల పవనాల విజృంభణ  వంటివన్నీ పర్యావరణ మార్పుల దుష్పరిణామాలే. ప్రాథమికంగా శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, పారిశ్రామికీకరణ తదితరాల వల్ల బొగ్గుపులుసు, హరిత గృహ వాయువులు వాతావరణంలోకి విపరీతంగా విడుదలవుతున్నాయి. దానివల్ల భూతాపం అధికమవుతోంది. వీటికి తోడు దట్టమైన అడవులు నానాటికీ తగ్గుతుండటం పర్యావరణాన్ని పెను ఇక్కట్లలోకి ఈడ్చుకుపోతోంది. భూతాపం కారణంగా ధ్రువప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోయి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. దానివల్ల భవిష్యత్తులో తీరప్రాంత నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పర్యావరణ మార్పుల వల్ల అనేక జీవులు ఆవాసాలను కోల్పోతున్నాయి. కొన్ని జీవజాతులు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. వాతావరణ విపరిణామాల వల్ల మానవ సంక్షేమం, ఆహార భద్రత సైతం ప్రమాదంలో పడుతున్నాయి. మారుతున్న వర్షపాతం, అనావృష్టి, చీడపీడల కారణంగా వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతున్నాయి.


ఆకలికేకల ముప్పు

మొక్కలకు సోకుతున్న చీడపీడలు, తెగుళ్ల వల్ల ప్రపంచార్థికానికి ఏటా 22,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.18 లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. కీటకాల దండయాత్రల వల్ల మరో 7,000 కోట్ల డాలర్ల  (సుమారు రూ.5.8 లక్షల కోట్లు) నష్టాన్ని ప్రపంచం చవిచూస్తోంది. చీడపీడలు, కీటకాలు వాతావరణ మార్పులకు త్వరితగతిన అలవాటుపడతాయి. ముఖ్యంగా వేడి పరిస్థితుల్లో అవి త్వరగా వృద్ధిచెంది, వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో వ్యవసాయంపై వాటి ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఎక్కువగా కనిపించే చిమ్మట పురుగులు ఆఫ్రికా, ఆసియాల్లో మొక్కజొన్న, ఇతర పంటలను నాశనం చేస్తున్నాయి. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల వాతావరణాల్లో వృద్ధిచెందే తెల్లదోమ వల్ల ఐరోపాలో టొమాటో పంటలు దెబ్బతింటున్నాయి. తేమతో కూడిన వాతావరణంలో కొకోవ్‌ (చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తారు) కాయలపై శిలీంధ్రాల కారణంగా నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. దానివల్ల కొకోవ్‌ ఉత్పత్తిలో కీలకంగా నిలిచే పశ్చిమాఫ్రికాలో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.  


వాతావరణ మార్పులు భారత్‌పైనా గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయి. దేశీయంగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉద్ధృతి ఇప్పటికే విపరీతమైంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 2015-22 మధ్య కాలంలో చీడ పీడల వల్ల పత్తి, చెరకు, గోధుమ, కొబ్బరి, వరి, అరటి, మామిడి, మొక్కజొన్న, సోయాబీన్‌, మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సస్య సంరక్షణ, నిల్వ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఖరీఫ్‌తో పోలిస్తే రబీ పంటలు అధికంగా చీడపీడల బారిన పడుతున్నట్లు వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూతాపం పెరిగేకొద్దీ నీటి లభ్యత తగ్గిపోతుంది. అదే సమయంలో పంటలకు నీటి అవసరం పెరుగుతుంది. ఒకవైపు చీడపీడల ముట్టడి, మరోవైపు సాగునీటి కొరత తదితరాలన్నీ పంటల దిగుబడిని దెబ్బతీస్తాయి. అంతిమంగా ఇది ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. దిగుబడులు తగ్గడం వల్ల ఆహార ధాన్యాల ధరలు ఇతోధికమవుతాయి. దానివల్ల పేదలకు వాటి కొనుగోలు భారంగా మారి ఆకలి కేకలు విజృంభించే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులను తట్టుకొనేలా దేశీయ వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకోకపోతే భారత్‌లో గోధుమ దిగుబడులు 2050 నాటికి 19శాతం, 2080 నాటికి 40శాతం తగ్గుతాయని అంచనా. వర్షాధార భూముల్లో వరి ఉత్పత్తి 2050 నాటికి 20శాతం, 2080 నాటికి 47శాతం, నీటిపారుదల సదుపాయం ఉన్న క్షేత్రాల్లో వరి దిగుబడి అయిదు శాతం దాకా తరుగుపడుతుందని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఆహార అభద్రతను నిలువరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు సాగాలి.


సమర్థ చర్యలు

సాగులో తెగుళ్లు, చీడపీడల ప్రభావాలను సమర్థంగా తగ్గించడానికి రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యంలో ప్రభుత్వాలు క్రియాశీల చర్యలు తీసుకోవాలి. నేల, నీరు, గాలి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా పంటల నమూనాలను ప్రవేశపెట్టాలి. చీడపీడల ఉద్ధృతి కారణంగా విచ్చలవిడిగా పురుగుమందులు వాడటం వల్ల నేల విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. పంట ఉత్పత్తుల్లోకీ ఆ అవశేషాలు చేరి మానవ ఆరోగ్యాన్ని గుల్లచేస్తాయి. అందువల్ల చీడపీడల నివారణకు ప్రకృతి సిద్ధ పద్ధతులను ఆవిష్కరించాలి. వాటిపై అన్నదాతలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. వాతావరణ మార్పులను తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేయడం మరో ప్రధాన అంశం. సమధిక నిధులతో వీటిపై పరిశోధనలను జోరెత్తించాలి. నేల ఆరోగ్యాన్ని పెంచడానికి పంట మార్పిడి, సేంద్రియ విధానాలను రైతులు అవలంబించాలి. నీటి వనరులను సంరక్షించడానికి సమర్థమైన నీటిపారుదల వ్యవస్థలను తీర్చిదిద్దాలి. ముఖ్యంగా వాతావరణ మార్పులపై పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.


సవాళ్లను తట్టుకొనేలా..

పర్యావరణ మార్పులను కట్టడి చేసేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించాయి. సౌర, పవన, జలవిద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై అవి అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంపైనా దృష్టి సారించాయి. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలను అవి అవలంబిస్తున్నాయి. భారత్‌ సైతం వాతావరణ మార్పులపై జాతీయ కార్యప్రణాళికలో భాగంగా సుస్థిర వ్యవసాయం కోసం జాతీయ కార్యక్రమం (ఎన్‌ఎంఎస్‌ఏ) ప్రారంభించింది. వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకొనేలా భారత వ్యవసాయాన్ని తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ముఖ్యంగా, పర్యావరణ మార్పుల పెను విపత్తులు పోనుపోను మరింతగా కోరలు సాచకూడదంటే- కర్బన ఉద్గారాల కట్టడికి నిర్దేశించుకున్న లక్ష్యాలను తప్పకుండా చేరుకునేలా ఆయా దేశాలు నిజాయతీగా కృషి చేయాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - ఆఫ్రికాల బలమైన బంధం

‣ ప్రజాస్వామ్యం తీరుతెన్నులు

‣ పకడ్బందీగా సుస్థిరాభివృద్ధి

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ జీ20.. భారత్‌ ముద్ర!

‣ మహిళాభివృద్ధిలో మనమెక్కడ?

‣ జమిలి బాటలో సవాళ్ల మేట

Posted Date: 19-09-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని