• facebook
  • whatsapp
  • telegram

మహానగరాల్లో మాయగాళ్లు

పేట్రేగుతున్న ఆర్థిక నేరాలు

జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గతేడాదికి సంబంధించి విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక దేశంలోని నగరాల్లో పెచ్చుమీరుతున్న ఆర్థిక నేరాల తీరుతెన్నులను కళ్లకు కట్టింది. నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా ఎదుగుతున్న కొద్దీ వాటిలో ఆర్థిక నేరాల సంఖ్యా ఏటికేడాది పెరిగిపోతోంది. ఆర్థిక నేరాల రేటు (ఒక ఏడాదిలో లక్ష జనాభాకు నమోదైన నేరాల)లో దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలుస్తూ దుష్కీర్తిని మూటగట్టుకుంటున్నాయి. రెండు మూడేళ్లుగా జైపుర్‌, లఖ్‌నవూ, పట్నా వంటి ద్వితీయ శ్రేణి నగరాలు సైతం వీటితో పోటీపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోయంబత్తూర్‌, చెన్నై, సూరత్‌, పుణే, కాన్పుర్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌, కోల్‌కతాలు ఆర్థిక నేరాల్లో జాతీయ సగటు రేటు 23ను మించిపోయాయి. నాగ్‌పుర్‌, కోచి దానికి చేరువలో ఉన్నాయి. దేశం మొత్తం మీద నిరుడు సుమారు 1.45 లక్షల ఆర్థిక నేరాలు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కొవిడ్‌ కారణంగా ఇవి 12శాతం తగ్గాయని నివేదిక తెలిపింది. రాష్ట్రాల పరంగా చూస్తే 18 వేలకు పైగా నేరాలతో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉండగా, 16 వేలకు మించిపోయిన నేరాలతో ఉత్తర్‌ ప్రదేశ్‌ రెండో స్థానం, సుమారు 13వేల నేరాలతో తెలంగాణ మూడో స్థానాన్ని ఆక్రమించాయి. ఆర్థిక నేరాల రేటు (34.6) పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అస్సాం, కేరళ తరవాతి స్థానాలను ఆక్రమించాయి. నగరాల్లో జరిగే ఆర్థిక నేరాల్లో మోసం, నకిలీలు, ఆస్తులు, నిధుల నేరపూరిత దుర్వినియోగం, దొంగ సంతకాలు వంటవి అధికంగా ఉన్నాయి.

నిపుణుల కొరత

సైబర్‌ నేరాల్లో ఆర్థిక కోణం ఉన్నా, వాటి సంక్లిష్టత దృష్ట్యా ఎన్‌సీఆర్‌బీ వాటిని వేరుగా గుర్తించింది. సైబర్‌ నేరాల్లో దేశ ఐటీ రాజధాని బెంగుళూరుదే అగ్రస్థానం. సైబర్‌ నేరాల రేటులో బెంగుళూరు (104) మొదటిస్థానాన్ని ఆక్రమించగా- లఖ్‌నవూ (50), హైదరాబాద్‌ (33) తరవాతి స్థానాల్లో నిలిచాయి. సైబర్‌ నేరాల జాతీయ సగటు(16)తో పోలిస్తే ఇవి చాలా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది దేశంలోని 19 పెద్ద నగరాల్లో మొత్తం 18,657 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే సైబర్‌ నేరాల్లో దాదాపు 87శాతం వృద్ధి కనిపించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం వంటి చోట్లా ఇవి అధికమవుతున్నాయి. బ్యాంకింగ్‌ నేరాల కేసుల్లో దాదాపు 97శాతం ఒక్క హైదరాబాద్‌లోనే చోటుచేసుకొన్నాయి. ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలవడం ఆందోళనకరం. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఏడువేలకు పైగా ఆర్థిక నేరాలు వెలుగుచూశాయి.

ఆర్థిక నేరాలను అదుపు చేయడానికి సాంకేతిక నిపుణులతో కూడిన సమర్థ యంత్రాంగం అవసరం. సీబీఐ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటివి దేశంలో ఆర్థిక నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వీటి నియంత్రణకు ప్రత్యేక విభాగాలున్నాయి. సైబర్‌ నేరాలపై పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో ‘సైౖబర్‌ ల్యాబ్‌’లను నెలకొల్పుతోంది. ఆర్థిక నేరాల విచారణకు హైదరాబాద్‌లో ప్రత్యేక న్యాయస్థానం ఉంది. వీటి నియంత్రణకు నెలకొల్పిన శాఖలన్నింటిలో నిపుణులైన సిబ్బంది కొరత వేధిస్తోంది. అపహరణకు గురైన సొమ్ము మొత్తాన్ని నిర్ధారించడం, తిరిగి రాబట్టడం ఆర్థిక నేరాల పరిశోధన, విచారణలో క్లిష్టమైన అంశాలు. ఇందుకోసం సాంకేతిక, ఆర్థిక నిపుణుల సహకారం అవసరం. ప్రభుత్వాలు ఆర్థిక నేర నియంత్రణ శాఖల్లో ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఐటీ, సమాచార విశ్లేషణ నిపుణులను తప్పనిసరిగా నియమించాలి. న్యాయస్థానాల్లో ఆర్థిక నేరాల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ జాప్యం నేరస్తులకు కోరలు మొలిచేందుకు కారణమవుతోంది.

అప్రమత్తత అవసరం

సులభ మార్గాల్లో వేగంగా డబ్బు సంపాదించి, ఎదిగిపోవాలన్న ఆకాంక్ష ఆర్థిక నేరాలకు పురికొల్పేలా చేస్తోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక సాంకేతికతల్లో సిద్ధహస్తులైన వారే ఒక బృందంగా ఏర్పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. దేవగఢ్‌ వంటి చోట్ల సైబర్‌ మోసాల శిక్షణ సంస్థలను సైతం నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికతల సహాయంతో సామాన్యులను, వ్యవస్థలను మాయచేసి ఎడాపెడా దోచుకుంటున్నవాళ్ల ఆట కట్టించాలంటే నేరస్తుల గుర్తింపు, సత్వర విచారణ, కఠిన శిక్షల అమలు వరకు అన్నీ సవ్యంగా, త్వరితగతిన జరగాలి. నేరస్తులు చొరబడటానికి అవకాశం లేని విధంగా సాంకేతిక వ్యవస్థలను తీర్చిదిద్దాలి. సైబర్‌ నేరాలు, దాడులను అరికట్టడానికి దాదాపు లక్ష మంది సైబర్‌ భద్రత నిపుణులు అవసరమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీరి కొరతను అధిగమించడానికి శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. ఇటువంటి నేరాలపై నిత్యం ప్రజలను అప్రమత్తం చేయాలి. సమర్థ, సుశిక్షిత నేర నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేరాలకు కారణమయ్యే సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలపైనా దృష్టి సారించాలి. అప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుంది. వ్యక్తుల సురక్షిత జీవనానికి దారులు ఏర్పడతాయి.

తీవ్ర నష్టం

దేశంలో ఆర్థిక నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సైబర్‌ నేరాల వలలో చిక్కి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, గ్రామాలకు సైతం విస్తరిస్తున్నాయి. ఆర్థిక నేరాలు ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన రుణయాప్‌ల కుంభకోణం వేల మంది జీవితాల్లో కల్లోలం సృష్టించింది. కొంత మంది ఆత్మహత్యలకు కారణమయింది. చిట్‌ఫండ్‌, బ్యాంకింగ్‌ మోసాలు ఎంతో మంది ఆశల్ని నీరుగారుస్తున్నాయి. ఈ ఏడాది సీబీఐ నమోదు చేసిన 107 కేసుల్లో 68 బ్యాంకింగ్‌ మోసాలకు సంబంధించినవే. కొత్త రూపాల్లో పన్ను ఎగవేతలతో ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతోంది. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి బయటపెట్టిన పండోరా పత్రాలు పన్నుల ఎగవేతకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాల్ని వెల్లడి చేశాయి. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ నుంచి దేశ వ్యాప్తంగా సైబర్‌ పిండారీలు చేస్తున్న దోపిడీపై ఇటీవల కథనాలు వెలువడ్డాయి.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తైవాన్‌ ఆక్రమణకు డ్రాగన్‌ తహతహ

‣ ప్రజల విజయమిది!

Posted Date: 08-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం