• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ బ‌డ్జెట్ 2024-25

ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తామని చెబుతున్న కొత్త ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే సంక్షేమ రంగానికి ఓటాన్‌ ఎకౌంట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు, సంక్షేమ పథకాలకు అత్యధిక నిధులు కేటాయించింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు రూ.2.05 లక్షల కోట్లలో 25 శాతం(రూ.53,196 కోట్లు) ఆరు గ్యారంటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులు గత బడ్జెట్‌లో లేనివి. వీటికి అధికంగా నిధులు కేటాయించినప్పటికీ.. ఇతర ప్రాధాన్య రంగాలకూ పెద్దపీట వేసింది. గ్యారంటీ హామీల తరవాత గ్రామీణాభివృద్ధి - పంచాయతీరాజ్‌శాఖ, సాగునీటి పారుదల, విద్యుత్‌ శాఖలకు కేటాయింపుల్లో ప్రాధాన్యమిచ్చింది. ఈ మూడు రంగాలకు గత బడ్జెట్‌ కన్నా నిధుల కేటాయింపులు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా చూపినా ఖర్చు చేయలేదని, రాష్ట్ర రాబడులను వాస్తవాలకు దగ్గరగా అంచనా వేసి.. దానికి అనుగుణంగా  ఓటాన్‌ ఎకౌంట్‌లో నిధులు కేటాయించినట్లు సర్కారు తెలిపింది. ప్రస్తుత బడ్జెట్‌ మొత్తం రూ.2.90 లక్షల కోట్లుండగా.. అందులో రూ.15 వేల కోట్లకు పైగా తగ్గించి ఓటాన్‌ ఎకౌంట్‌ను రూ.2.75 లక్షల కోట్లకే రూపొందించినట్లు వివరించింది. రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లలో గత పద్దులో పేర్కొన్న మొత్తం కన్నా తగ్గించడం అరుదు. కానీ, గత బడ్జెట్‌లో వేసిన అంచనాల మేరకు ఆదాయం రానందువల్ల కొత్త బడ్జెట్‌ను వాస్తవానికి దగ్గరగా రూపొందించామని ఆర్థికశాఖ తెలిపింది. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌ను రూపొందిస్తే పథకాలకు కేటాయించిన నిధులు పూర్తిగా వ్యయమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.



కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లపై ఆశల్లేక..

రాష్ట్ర ఆదాయానికి కీలక వనరుగా భావించే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు తగ్గించుకుంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో పెద్దగా నిధులు రాకపోవడంతో.. కొత్త బడ్జెట్‌లో ఈ పద్దు కింద వచ్చే ఆదాయాన్ని రూ.21 వేల కోట్లకు తగ్గించింది. గత బడ్జెట్‌లో ఇది రూ.41 వేల కోట్లు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2023-24) బడ్జెట్‌లో కేంద్రం నుంచి రూ.41 వేల కోట్ల వరకూ గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని గత ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఇప్పటివరకూ కేవలం రూ.13,953 కోట్లే వచ్చాయి. గతేడాది(2022-23) రూ.13,179 కోట్లే వచ్చాయి. కేంద్రం పెద్దగా నిధులు విడుదల చేయనప్పుడు ఈ పద్దు కింద అధికంగా నిధులు వస్తాయని బడ్జెట్‌లో చూపడం ఎందుకని కొత్త ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.21,075 కోట్లే వస్తాయని అంచనా వేశారు. ఈ పద్దు కింద గత బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా రూ.20 వేల కోట్లు తగ్గించేయడం వల్లనే మొత్తం బడ్జెట్‌ కూడా గత బడ్జెట్‌ రూ.2.90 లక్షల కోట్లతో పోలిస్తే రూ.2.75 లక్షల కోట్లకు తగ్గిందని తెలుస్తోంది.

 



భూముల అమ్మకంపై ఆశలు

రాష్ట్ర ఆదాయంలో పన్నులపై వచ్చే రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు, పన్నేతర రాబడి అత్యంత కీలకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడి కింద రూ.22,808 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. అంతే మొత్తం వచ్చింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేలం, మద్యం టెండర్ల వేలం వంటి వాటి వల్ల లక్ష్యాన్ని సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ పద్దు కింద రూ.20,658 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. భూముల అమ్మకం ద్వారా ఈ మొత్తం సమకూరేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది.


పన్నుల ద్వారా పెరుగుతున్న రాబడి

జీఎస్టీ, అమ్మకపు పన్ను, ఎక్సైజ్‌ సుంకాల రాబడి క్రమంగా పెరుగుతోంది. పన్నులపై గతేడాది(2022-23)లో రూ.1.06 లక్షల కోట్లు, ఈ ఏడాది రూ.1.18 లక్షల కోట్ల రాబడి రాగా.. వచ్చే ఏడాది(2024-25లో) ఏకంగా రూ.1.38 లక్షల కోట్లకు పైగా వస్తుందని ఓటాన్‌ ఎకౌంట్‌లో పేర్కొన్నారు. పన్నుల రాబడి రూ.20 వేల కోట్లు పెరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వచ్చే సొమ్ము కూడా గతేడాది రూ.19,668 కోట్లుండగా.. ఈ ఏడాది రూ.23,216 కోట్లు దాటింది. వచ్చే ఏడాది రూ.25,639 కోట్లకు చేరుతుందని తాజా అంచనా. మొత్తమ్మీద రాష్ట్ర రెవెన్యూ రాబడి గతేడాది రూ.1.59 లక్షల కోట్లుండగా.. ఈ ఏడాది మరో రూ.18,822 కోట్లు పెరిగి రూ.1.78 లక్షల కోట్లు దాటినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదే ఒరవడితో వచ్చే ఏడాది మరో రూ.27 వేల కోట్లకు పైగా పెరిగి రూ.2.05 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్‌డీపీ), వార్షిక ఆదాయం.. భారీగా పెరుగుతుండటంతో ఆరు గ్యారంటీ హామీలు, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి నిధుల కొరత ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తప్ప మిగతా ఆదాయాలన్నీ పెరుగుతున్నందువల్ల గ్యారంటీ హామీల అమలుకు, సంక్షేమ పథకాలకు నిధుల లోటు ఉండదని ధీమాగా ఉంది.


 

భారీగా పెరిగిన ఆర్థిక ద్రవ్యలోటు

రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రాబడులు, వ్యయాలకు మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతుండటంతో ఆర్థిక ద్రవ్యలోటూ పెరుగుతోంది. గతేడాది ఆర్థిక ద్రవ్యలోటు రూ.32,556.50 కోట్లుండగా.. ఈ ఏడాది రూ.33,785.83 కోట్లకు, వచ్చే ఏడాది ఏకంగా రూ.53,227.82 కోట్లకు పెరుగుతుందని ఓటాన్‌ ఎకౌంట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా రుణాలు సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. ద్రవ్యలోటును అధిగమించేందుకు.. వచ్చే ఏడాది రూ.68,585 కోట్ల రుణాలు సేకరిస్తే రాష్ట్ర ఆదాయం రూ.2,74,186.71 కోట్లకు చేరుతుంది. అయితే ఖర్చులు రూ.2,75,890.69 కోట్లు ఉండనుండటంతో రూ.1703.97 కోట్ల లోటు ఏర్పడుతుంది.


త్వరలోనే గృహజ్యోతి..

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి ద్వారా అర్హులైనవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించేందుకు ముందడుగు వేశాం. గృహజ్యోతికి త్వరలోనే విధివిధానాలను రూపొందించి అమలుచేస్తాం. మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతు, యువ, ఎస్సీ-ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లను అమలుచేస్తాం. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

ప్రధాన రంగాలకు కేటాయింపులు (రూ. కోట్లలో)

పంచాయతీరాజ్‌  40,080

నీటిపారుదల  28,024

సాంఘిక సంక్షేమం  21,874

విద్యారంగం  21,389

వ్యవసాయం  19,746

విద్యుత్‌ సంస్థలు  16,825
 

ప్రజాస్వామ్యం రుచి చూస్తున్న స్వేచ్ఛా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటే లక్ష్యంగా సంక్షేమ పథంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. గుణాత్మక మార్పుతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇందుకు ఎంతటి కష్టాన్నైనా భరిస్తామని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని పేర్కొన్నారు. ప్రజలకు, పాలకులకు మధ్య ఇనుప కంచెను తొలగించడంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు దుబారా ఖర్చులు తగ్గించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు తమకు అడ్డుకావన్నారు. కాళేశ్వరం లాంటి నిరర్థక ఆస్తులు పెంచుకుంటూ తెలంగాణ ప్రజలపై భారం మోపడం ఈ ప్రభుత్వ విధానం కాదని పేర్కొన్నారు. శాసనసభలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా శనివారం ఆయన ప్రసంగించారు.


‘‘బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీల అమలును ప్రారంభించాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి అదనంగా నిధులిస్తున్నాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. 6 హామీల కోసం 1.29 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్‌ హామీలపై ప్రజలకున్న విశ్వాసం దీనిద్వారా స్పష్టమవుతోంది.

కాళేశ్వరంపై విచారణ..

పదేళ్లలో నీటిపారుదల రంగం ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉండగా.. గత ప్రభుత్వ తప్పిదాలు ప్రగతి అవరోధాలుగా మారాయి. ‘మాకు తెలిసిందే వేదం’ అన్నట్లు వ్యవహరించడంతో సాగునీటి, ఆర్థిక రంగాలు అతలాకుతలమయ్యాయి. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. రూ.లక్షల కోట్ల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతలోపం, అవినీతి, అనాలోచిత నిర్ణయాలపై విచారణ జరిపిస్తామని మాటిచ్చాం. ఆ దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కేటాయింపుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తాం. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రాణహిత-చేవెళ్ల సహా తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులు పూర్తి చేయనున్నాం.


రైతులకు రుణమాఫీ..

రైతు రుణమాఫీని అమలు చేయబోతున్నాం. ప్రతి పంటకు మద్దతుధర ఇస్తాం. గతంలో రైతుబంధు పథకంతో అనర్హులు, పెట్టుబడిదారులు ఎక్కువ లాభం పొందారు. నిబంధనలను పునఃసమీక్షించి రైతుభరోసా కింద అర్హులైన రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పీఎం ఫసల్‌ బీమాయోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా అమలుచేస్తాం. కౌలు రైతులకూ రైతు భరోసా, పంటల బీమా వర్తింపజేస్తాం. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేలా కొత్తగా విత్తన విధానం తీసుకువస్తాం. ఆయిల్‌పామ్‌ సాగు అదనంగా లక్ష ఎకరాలు పెంచుతాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

పంచాయతీలకు నిధులు..

పంచాయతీలకు సకాలంలో నిధులందించి గ్రామాభ్యుదయానికి బాటలు వేస్తాం. గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ కింద రూ.35,752 కోట్లు ఖర్చుచేసినా రాష్ట్రంలో రక్షిత మంచినీళ్లందని గ్రామాలెన్నో ఉన్నాయి. ఈ పథకంలో లోపాలను సవరించి, ప్రక్షాళన చేయకుంటే ప్రజాధనం వృథా అవుతుంది. అందుకే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్థికసంఘం నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి సిఫార్సుల మేరకు నిధులిస్తాం. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

యువత భవితకు మాదీ గ్యారంటీ..

గత ప్రభుత్వ చర్యలతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆశలు కోల్పోయారు. వారి భవిష్యత్తుకు మేం గ్యారంటీ ఇచ్చాం. ఈ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ తయారుచేసి నియామకాల ప్రక్రియను ప్రారంభించాం. మెగా డీఎస్సీ, 15వేల మంది కానిస్టేబుళ్ల నియామకం, గ్రూప్‌-1లో ఉద్యోగాల భర్తీ చేపట్టాం. గత ప్రభుత్వం ఒక్క గ్రూప్‌-1 నియామకం కూడా చేయలేదు. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేశాం. కాంగ్రెస్‌ తెచ్చిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తాం.


వ్యవస్థల ప్రక్షాళన..

హైదరాబాద్‌ అభివృద్ధితో సృష్టించిన సంపద కొందరు అధికారులు, నాయకుల కోసం కాదు.. ప్రజలందరికీ చెందాలనేది మా లక్ష్యం. అందుకే పాలనాపరంగా అన్ని సంస్థలు, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం. తెలంగాణ ప్రజల కల నెరవేర్చినందుకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కృతజ్ఞతలు. అమరవీరులకు నివాళి. ఈ ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికింది. మేడారం జాతర ఘనంగా నిర్వహించేందుకు రూ.110 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రజావాణి ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నాం. పేదలకు ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు ఇస్తాం. అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తగిన నిధులు అందుబాటులో ఉంచుతాం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మాదకద్రవ్యాలు అనే మాట లేకుండా చేస్తాం. కొత్త హైకోర్టు భవనానికి వంద ఎకరాల భూమిని కేటాయించాం’’ అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.


కీలక ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తాం

బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.28,024 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ ప్రభుత్వ దూరదృష్టిని చాటుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇప్పటికే ప్రకటించినట్లుగా తక్కువ వ్యయంతో పూర్తయ్యే.. ఎక్కువ ఆయకట్టును సృష్టించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తాం. పాలమూరు- రంగారెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పూర్తి చేస్తాం. ఏఎమ్మార్పీ-ఎస్సెల్బీసీ, కల్వకుర్తి, జవహర్‌ నెట్టెంపాడు, రాజీవ్‌ భీమా, కోయిల్‌ సాగర్‌, ఎస్సారెస్పీ-ఇందిరమ్మ వరద కాలువ, దేవాదుల, కుమురం భీం, చిన్న కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం. రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాలకు సాగు నీరందించేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిచేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పునాది వేసింది. బడ్జెట్‌లో దూరదృష్టి, సమతుల్యత ప్రదర్శించారు. గత పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని భారాస ప్రభుత్వం నాశనం చేసింది. వారి అనాలోచిత విధానాలతో సాగునీటి రంగం, వ్యవసాయం దెబ్బతిన్నాయి. గుత్తేదారులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించదు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో నాణ్యత లోపాలు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించాం. బాధ్యులను విచారించి శిక్షిస్తాం. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.500కు ఎల్‌పీజీ సిలిండరు అందజేస్తామన్న హామీని.. పౌరసరఫరాల శాఖ ద్వారా విజయవంతంగా ప్రజలకు చేరుస్తాం’’ అని ఉత్తమ్‌ తెలిపారు.


 

‘మహాలక్ష్ముల’కు మద్దతు

బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం సజావుగా సాగేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ పథకం కోసం ఆర్టీసీకి ఎన్ని నిధులు ఇస్తారన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబరు 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలుచేస్తున్న ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 15.50 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ‘జీరో’ టికెట్లతో ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టంచేసింది. నెలకు రూ.300 కోట్ల చొప్సున అదనపు నిధులు మంజూరు చేసినట్లు వివరించింది.

2024-25లో రూ.7,400 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరినట్లు సమాచారం. ఇందులో రూ.5,084 కోట్లు మహాలక్ష్మి పథకం జీరో టికెట్లకు... మిగతా మొత్తం విద్యార్థుల బస్‌పాస్‌ సబ్సిడీ రీయింబర్స్‌మెంట్‌, సంస్థకు ప్రభుత్వ ఆర్థిక సహకారం, కొత్త బస్సుల కొనుగోలుకు నిధుల వంటివి ఉన్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్‌లో వీటిపై స్పష్టత రానుందని సమాచారం.
 


మూసీ మెరిసేలా రూ.వెయ్యి కోట్లు

రాష్ట్ర పురపాలకశాఖకు ప్రభుత్వం రూ.11,692 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే నిధులు స్వల్పంగా పెరిగాయి. పురపాలక సంఘాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. తొలి మూడు నెలలకు రూ.3,860 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లు కేటాయించగా... సమగ్ర ప్రణాళికలు సిద్ధమైన తరవాత, తగిన రీతిలో నిధులు సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూసీ పరిధిని వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాదచారుల జోన్‌, పీపుల్స్‌ ప్లాజాలు, పాతనగరంలోని హెరిటేజ్‌, హాకర్స్‌ జోన్లతో పాటు చిన్నారుల థీమ్‌ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా ఉంది. పురపాలక శాఖకు మునుపటి బడ్జెట్‌లో కేటాయింపులు రూ.11,372 కోట్లు కాగా ఈసారి మరో రూ.320 కోట్లు పెంచారు.


అభివృద్ధి వికేంద్రీకరణ

హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని పట్టణ ప్రాంతంగా, ఔటర్‌ రింగు రోడ్డు నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్‌ జోన్‌గా,  ప్రాంతీయ రింగ్‌ రోడ్డు అవతల నుంచి మిగిలిన భాగాన్ని గ్రామీణ జోన్‌గా విభజించాలని నిర్ణయించింది. ఆయా జోన్లకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేందుకు యోచన చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది.


 

యుద్ధ ప్రాతిపదికన ప్రాంతీయ రింగ్‌రోడ్డు పనులు

ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.14,305 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు రూ.4,768 కోట్ల కేటాయింపులు చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నదులు, వాగులపై వంతెనలను నిర్మించడం ద్వారా అనుసంధానత కల్పిస్తామని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల కార్యాలయాలను పూర్తిచేస్తామని తెలిపింది. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాంతీయ రింగ్‌రోడ్డు భూసేకరణకు అవసరమైన నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.



తగ్గిన జీఎస్డీపీ వృద్ధిరేటు
 



ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) వృద్ధిరేటు 11.3 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. బడ్జెట్‌ సందర్భంగా ఉపముఖ్యమంత్రి జీఎస్డీపీ, తలసరి ఆదాయం వివరాలను వెల్లడించారు. 2022-23లో జీఎస్డీపీ రూ.13,02,371 కోట్లుగా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.14,49,708 కోట్లుగా పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022-23లో జీఎస్డీపీ వృద్ధిరేటు 14.7 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది. జాతీయ వృద్ధిరేటు కంటే రాష్ట్ర వృద్ధిరేటు 2.4. శాతం ఎక్కువగా ఉన్నా గత ఏడాదికంటే వృద్ధిరేటు క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం అంచనా రూ.3,43,287. గతేడాది రూ.3,09,912 కంటే పెరిగినా తలసరి ఆదాయం వృద్ధిరేటు తగ్గింది. మరోవైపు ఆర్థిక వృద్ధిరేటు(6.5శాతం) గత ఏడాది(7.5శాతం) కంటే ఒక శాతం తగ్గింది. తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. 2023 డిసెంబరులో రాష్ట్ర ధరల సూచీ 6.65 శాతం కాగా దేశ సగటు 5.69 శాతం. అధిక ద్రవ్యోల్బణ రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.

ప్రాథమిక రంగాల్లో కీలకమైన వ్యవసాయరంగం పంటల స్థూల విలువ 6.8 శాతం తగ్గింది. 2022-23తో పోలిస్తే రూ.49,059 కోట్ల నుంచి ప్రస్తుతం 45,723 కోట్లకు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, పంటలు కీలకదశలో ఉన్న ఆగస్టు, అక్టోబరులో వర్షపాతం బాగా తగ్గడం ఇందుకు కారణం.


వైద్య, ఆరోగ్యానికి తగ్గిన నిధులు

వైద్య ఆర్యోగ్యశాఖకు బడ్జెట్‌లో నిధులు తగ్గాయి. ఈ శాఖకు ప్రభుత్వం రూ.11,500 కోట్లు కేటాయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో (రూ.12,161 కోట్లు) పోలిస్తే ఈ దఫా సుమారు రూ.661 కోట్ల మేర తగ్గినట్లయింది. నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలను ఈ ఏడాది పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. నిమ్స్‌ విస్తరణలో భాగంగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేయనున్నట్లు పేర్కొంది. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని, శాఖలో నియామకాలను తగిన కాలపరిమితిలో పూర్తిచేస్తామంది. ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు ఇస్తామని, నూతన వైద్య కళాశాలల్లో సిబ్బందిని నియమించడంతో పాటు వనరులను సమకూరుస్తామని హామీ ఇచ్చింది. నియోజకవర్గానికి ఒక నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రుల స్థాయి పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.పది లక్షలకు పెంపు వంటి హామీల అమలుకు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, జూనియర్‌ డాక్టర్లకు సకాలంలో వేతనాలు ఇచ్చేందుకు అదనపు నిధులు అవసరమని వైద్య,ఆరోగ్యశాఖ ఇటీవల ప్రతిపాదించింది.  రూ.15 వేల కోట్లు కేటాయించాలని కోరింది.



40% ప్రాజెక్టులకు.. 60% పాత బాకీలకు..

రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో అత్యధికభాగం రుణాలు, వడ్డీలు తిరిగి చెల్లించడానికే వెచ్చించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఈ రంగానికి రూ.28,024 కోట్లు ప్రతిపాదించగా, ఇందులో కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణానికి అసలు, వడ్డీ తిరిగి చెల్లించేందుకు రూ.17,113 కోట్లు నిర్దేశించారు. అంటే మొత్తం సాగునీటి బడ్జెట్‌లో అసలు, వడ్డీ చెల్లింపునకే 60 శాతానికి పైగా కేటాయించినట్లయ్యింది. జీతభత్యాలు పోను పనులు, భూసేకరణ, పునరావాసం మొదలైన వాటికి మరో రూ. 9,377 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొద్దిపాటి పనులు పెండింగ్‌ ఉన్న ప్రాజెక్టుల్లో ఆయకట్టుకు నీరందేలా పూర్తిచేయడానికి ప్రాధాన్యమిచ్చారు. 2023-24 బడ్జెట్‌ కంటే రూ.1,039 కోట్లు అదనంగా కేటాయించారు.



కోరినదాని కంటే కొంత తగ్గించి..

ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సగానికి పైగా కాళేశ్వరం ఎత్తిపోతలకు తీసుకున్న రుణానికి అసలు, వడ్డీ తిరిగి చెల్లించడానికే కేటాయించగా, పనులకు రూ.2,500 కోట్లు ఇచ్చింది. రూ.6,000 కోట్లు కావాలని సంబంధిత ఇంజినీర్లు ప్రతిపాదించారు. అంచనా వ్యయంలో సుమారు 50 శాతం ఇప్పటికే ఖర్చు చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.1,400 కోట్లు ఇచ్చారు. ఈ పథకానికి రూ.4,000 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. మరో రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే కానీ పూర్తి కాని ఈ ప్రాజెక్టుకు తాజా కేటాయింపులు అవసరాలకు తగ్గట్లుగా లేవు. రూ.2,000 కోట్లు కోరిన సీతారామ ఎత్తిపోతలకు రూ.900 కోట్లు ఇచ్చారు. ఈ పథకం పూర్తికి కూడా మరిన్ని నిధులు అవసరం. 


ఆనాటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం

2004లో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో అత్యధికం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ, కల్వకుర్తి, ఎల్లంపల్లి మొదటిదశ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, వరదకాలువ, నీల్వాయి, కుమురం భీం, దేవాదుల తదితర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువకు రూ.400 కోట్లు, డిండి ఎత్తిపోతలకు రూ.300 కోట్లు, సాగర్‌కు రూ.100 కోట్లు నిర్దేశించారు. కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, ఆర్డీఎస్‌ తదితర ప్రాజెక్టులకు కేటాయింపు కొంత పెరిగింది. సీఎం  సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆయకట్టుకు నీరిచ్చేందుకు చేపట్టనున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలకు  రూ.300 కోట్లు కావాలని ప్రతిపాదించినా ప్రత్యేకంగా నిధులివ్వలేదు. 2012లో ఈ పథకానికి పరిపాలనపరమైన అనుమతి ఇచ్చినా పనులు చేపట్టలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు రూ.600 కోట్లు కావాలని కోరినా, డ్యాం సేఫ్టీ కింద కేంద్రం ద్వారా వచ్చే రూ.75 కోట్లు మినహా ఎలాంటి నిధులూ ఇవ్వలేదు. చిన్ననీటి వనరులకు రూ. 818 కోట్లు కేటాయించారు.

వచ్చే రెండేళ్లలో పలు ప్రాజెక్టులను పూర్తి చేసి పెండింగ్‌ జాబితాలో లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన నేపథ్యంలో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తున్నా, గతంలో లాగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలకే 50 శాతానికి పైగా నిధులు లభించాయి.
 


ఐటీకి రెండింతల నిధులు

ఐటీ బడ్జెట్‌ రెండింతలు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు, రాయితీలు తదితర రంగాలకు నిధులు గణనీయంగా పెరిగాయి. 2023-24లో ఐటీ బడ్జెట్‌ రూ.365.54 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.774 కోట్లకు ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో  పటిష్ఠమైన ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించింది.

రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణ మాఫీ చేయబోతున్నాం.

‘మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే’ అని చెప్పిన మహాత్మా జ్యోతిబా ఫులే అడుగుజాడల్లో నడిచేందుకు సంకల్పించుకున్న ప్రభుత్వం మాది. ఈ దిశలోనే మేం బీసీ డిక్లరేషన్‌ ఇచ్చి తెలంగాణలోని వెనుకబడిన ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ముందుకు వెళ్తున్నాం.

‘‘నేటి పిల్లలు.. రేపటి పౌరులు. జాతి భవిష్యత్తు నిర్మించేది వాళ్లే. వారిని జాగ్రత్తగా.. ప్రేమగా పెంచాలి’’ అని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ చెప్పారు. ఆ సూక్తిని పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది.


పశుసంవర్ధకశాఖకు రూ. 1,993 కోట్లు

బడ్జెట్లో పశుసంవర్ధకశాఖకు ప్రభుత్వం రూ.1,993.45 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.1,730 కోట్లను కేటాయించగా దాని కంటే అదనంగా రూ.263 కోట్ల కేటాయించారు.  గొర్రెల పంపిణీ, చేపల పంపిణీలతో పాటు మరికొన్ని పథకాలు ఆ శాఖ పరిధిలో ఉండగా వాటి కేటాయింపు వివరాలు వెల్లడి కాలేదు.  పశువైద్య విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ వీసీ లేక ఇన్‌ఛార్జి వీసీతో నడుస్తోంది. నియామకాలు జరగక అనేక పోస్టుల్లో విశ్రాంత అధికారులు, ఇన్‌ఛార్జులే కొనసాగుతున్నారు. ప్రస్తుతం పశుసంవర్ధకశాఖ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది.


పింఛన్ల సాయం రెట్టింపు

కొత్త బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థలకు నిధులు పెరిగాయి. 2023-24 బడ్జెట్‌లో ఈ విభాగాలకు కేటాయింపులు రూ.31,426 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.8,654 కోట్లు పెంచి రూ.40,080 కోట్లు కేటాయించారు. ‘అభయహస్తం’ అమలుకు భారీగా నిధుల అవసరం దృష్ట్యా ఆ మేరకు పెరుగుదల కనిపించింది. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోంది. సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగుల పింఛను రూ.3,016 చొప్పున ప్రతి నెలా చెల్లిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు ఈ మొత్తాలను వరుసగా రూ.4,000, రూ.6,000 చొప్పున ఇవ్వడానికి పెన్షన్‌ బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో  ఈ పథకానికి రూ.10 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం అమలుకు రూ.4,500 కోట్లు కేటాయించారు. మొత్తంగా పెన్షన్లు, ఆర్థికసాయం కేటాయింపులు రూ.26,500 కోట్లకు పెరిగాయి.



పక్కా రహదారులకు ప్రాధాన్యం

రహదారి సౌకర్యం లేని 3,177 ఆవాసాలకు పక్కా రోడ్లను నిర్మించాలని, 922 గ్రామాలతో వాటిని అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.4,904 కోట్లు కేటాయించింది. 2023-24లో ఇచ్చిన రూ.3,123 కోట్లతో పోలిస్తే.. రూ.1,786 కోట్లు పెంచారు.
 


మహిళా సంఘాలకు చేయూత

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. రుణాల రికవరీ రేటుతో పాటు ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తులు, వివిధ వ్యాపారాలకు మంచి డిమాండ్‌ ఉంటోంది. గ్రామాల్లో ప్రస్తుతం 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లో 46.68 లక్షల మంది సభ్యులున్నారు.



ఉపాధి హామీకి రూ.1,700 కోట్లు

ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,700 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి కృషి సించాయీయోజన (పీఎంకేఎస్‌వై), రూర్బన్‌ పథకం, గ్రామీణ జీవనోపాధి మిషన్‌, దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనకు రూ.408 కోట్లు, స్వచ్ఛభారత్‌ గ్రామీణ మిషన్‌కు రూ.97.51 కోట్ల కేటాయింపులు చేశారు.


 

మిషన్‌ భగీరథకు రూ.600 కోట్లు

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటి సరఫరాకు మిషన్‌ భగీరథ పథకం కింద రూ.600 కోట్లు కేటాయించారు. జిల్లా పరిషత్‌లకు రూ.256 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.187 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.366 కోట్ల గ్రాంట్లతో పాటు గౌరవవేతనాలు, కేంద్ర పథకాలకు వాటా కింద మొత్తం రూ.2,830 కోట్ల కేటాయింపులు చూపారు.


ఆలయం ఆకర్షించేలా..

పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించనుంది. రాష్ట్రంలో ఈ రంగానికి ఉన్న విస్తృత అవకాశాలను వివరిస్తూ.. వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికల్ని బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఈ మేరకు టెంపుల్‌ టూరిజం విధానాన్ని తీసుకురావడంతో పాటు.. అటవీ ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దడానికి సిద్ధం అవుతోంది. బడ్జెట్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖలకు రూ.205.33 కోట్లు కేటాయించారు.

దేవాదాయ శాఖతో కలిసి టెంపుల్‌ టూరిజం విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివచ్చేలా ఆయాచోట్ల సౌకర్యాలను పెంచేందుకు నిర్ణయించింది. నాగార్జునసాగర్‌, కొలనుపాక దేవాలయం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం వంటి ప్రదేశాలను తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేసి.. ఆలయ విశిష్టతను మరింత పెంచేలా చర్యలు చేపడతారు. పరిసరాల్లో ఉన్న శిథిల ఆలయాలను పునరుద్ధరించేందుకు కార్యాచరణ చేపడతారు.
రాష్ట్రంలో పర్యాటక శాఖకు చెందిన వృథాగా పడివున్న విలువైన ఆస్తులను ఆదాయమార్గంగా మలుచుకోవడంపై దృష్టి సారించారు. ఈ మేరకు అనువైన అటవీ ప్రాంతాలను గుర్తించి.. పర్యావరణహిత పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతారు. వాటిని ఐటీ పరిశ్రమతో అనుసంధానిస్తారు.



అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

తెలంగాణ విద్యాశాఖకు బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. 2023-24లో రూ.19,093 కోట్ల నిధులను ఇవ్వగా... ఈ ఏడాది అవి రూ.21,389 కోట్లకు పెరిగాయి. ఇందులో పాఠశాల విద్యకు 17,931.42 కోట్లు, ఉన్నత విద్యకు 2,959.10 కోట్లు, సాంకేతిక విద్యకు 487.64 కోట్లు కేటాయించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద 2024-25 విద్యాసంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లను వెచ్చిస్తామని, మండలానికో పాఠశాల చొప్పున ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఉస్మానియా సహా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలకోసం మరో రూ.500 కోట్లను కేటాయించింది.



ఐటీఐల నవీకరణ

రాష్ట్ర సాంకేతిక విద్యను పటిష్ఠం చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికిగాను రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర అధికారుల బృందాలతో అధ్యయనం చేయించి ప్రణాళికను రూపొందిస్తామని తెలిపింది. అన్ని ప్రభుత్వ ఐటీఐలకు కొత్త సాంకేతిక పరికరాలు అందించడం, ఐటీఐ సీట్ల పెంపు, శిక్షణ పొందిన విద్యార్థులు వందశాతం ఉద్యోగాలు పొందేలా ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించింది.


నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు

నైపుణ్య విశ్వవిద్యాలయా(స్కిల్‌ యూనివర్సిటీ)లను ఏర్పాటు చేసి, రాష్ట్ర అధికారుల అధ్యయన బృందం సూచించిన అత్యున్నత విధానాలను ఆ వర్సిటీల్లో అమలు చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు బోధనరుసుము, ఉపకారవేతనాలు సకాలంలో అందిస్తామని ప్రకటించింది.



ఇంటికి ‘వెలుగు’

ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు అమలుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా ‘గృహజ్యోతి’ పథకానికి ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.2,418 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఉచిత విద్యుత్తు అమలు కోసం విద్యుత్‌ రంగానికి రూ,16,825 కోట్లు ఇచ్చింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.11 వేల కోట్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ.5,825 కోట్లు పెంచింది. ప్రస్తుతం రాయితీ పద్దు కింద ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లకు నెలకు రూ.958 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి రూ.1,402 కోట్ల చొప్పున నెలనెలా విడుదల చేసేలా కేటాయింపులను పెంచడం విశేషం.



అర్హులెవరో తేలితేనే..

నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం 81.54 లక్షల కుటుంబాల వారు ఇటీవల దరఖాస్తులిచ్చారు. మరోవైపు  సుమారు 90 లక్షల కుటుంబాలు నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తున్నట్లు అంచనా. వీరిలో రేషన్‌కార్డు, ఆధార్‌, ఫోన్‌ నంబరు అనుసంధానమై ఉన్నవారిని తొలుత ఎంపిక చేయనున్నారు. ‘అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేశాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. పథకం అమలు ప్రారంభమైన నెల రోజుల తర్వాత బిల్లులు జారీ అయితే నెలనెలా ఏ మేరకు నిధులు అవసరమవుతాయనే అంచనా వస్తుంది. అప్పటివరకు ప్రస్తుతం కేటాయించిన రూ.2,418 కోట్లు ఈ పథకానికి వినియోగిస్తాం. పూర్తిస్థాయి బడ్జెట్‌లో అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తాం’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



సంక్షేమం... సమగ్రం!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో ఆ వర్గాలకు రూ.45,449 కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌తో పోల్చితే ఇది రూ.12వేల కోట్లు అధికం. గిరిజనుల సంక్షేమానికి ఏకంగా రూ.13,313 కోట్ల నిధులు దక్కగా, బీసీల సమగ్రాభివృద్ధికి రూ.8 వేల కోట్లు, మైనార్టీలకు రూ.2,262 కోట్లు కేటాయించారు.  సంక్షేమ గురుకులాలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దాలని  ప్రభుత్వం నిర్ణయించింది.

2023-24 విద్యాసంవత్సరానికి బోధన ఫీజుల బకాయిలు దాదాపు రూ.4వేల కోట్లకు పైగా ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం  దాదాపు రూ.2,600 కోట్ల నిధులను పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన ఫీజులు సకాలంలో చెల్లించేందుకు ఈ కేటాయింపులను చూపింది.

ఇంతకాలం అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ గురుకులాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో గత పదేళ్లలో గురుకులాలు 292 నుంచి 1022కు పెరిగాయి. వీటిలో చాలావరకు ఇరుకైన అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి శాశ్వత భవనాల నిర్మాణానికి గతంలోనే భూములు సమీకరించినా, నిర్మాణాలకు బడ్జెట్‌ కేటాయించలేదు. ఈసారి ఆ లోటును భర్తీ చేస్తూ... ఎస్సీ గురుకుల సొసైటీకి రూ.1,000 కోట్లు, ఎస్టీ గురుకుల సొసైటీకి రూ.250 కోట్లు, బీసీ గురుకుల సొసైటీకి రూ.1,546 కోట్లు... మొత్తం రూ.2,796 కోట్ల నిధులు చూపారు. దీంతో ఈ ఏడాది కనీసం 250కి పైగా గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం మొదలయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో రెండు ఎంబీఏ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పేదింటి ఆడపిల్లల వివాహానికి కల్యాణమస్తు, షాదీ ముబారక్‌ పథకాల కింద బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. గతంలో పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి అదనంగా నిధులు చేర్చింది. ఈ పథకాల కోసం సంక్షేమశాఖలకు కలిపి రూ.3 వేల కోట్ల వరకు ప్రభుత్వం పేర్కొంది. విదేశీవిద్యా పథకానికి కూడా భారీగా నిధులుచూపారు. .



సంస్కరణలతో సాగు భరోసా!

వ్యవసాయరంగ ప్రాథమ్యాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.26,831 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.7,085 కోట్ల మేర నిధులు తగ్గాయి. పంట పెట్టుబడికి సాయం అందించేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం స్థానంలో ‘రైతు భరోసా’ పేరిట నిధులందించాలని కొత్త సర్కారు సంకల్పించింది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీకి ఓటాన్‌ ఎకౌంట్‌లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌ కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయనుంది.
 

రైతుబంధుకు కేటాయించినన్ని నిధులే భరోసాకు..

గత బడ్జెట్‌లో రైతుబంధుకు రూ.14,800 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రైతు భరోసాకు అంతే మొత్తం నిధుల్ని ప్రభుత్వం కేటాయించింది. దీని కింద రైతులతో పాటు కౌలుదారులకూ ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని పేర్కొంది. రైతుబంధు మార్గదర్శకాలనే వీటికీ అమలు చేస్తే.. రూ.22 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన ప్రకారం.. సాగులో ఉన్న భూములకు పరిమితి లేకుండా ‘భరోసా’ సాయం ఇస్తారని తెలుస్తోంది. ఈ లెక్కన వ్యవసాయం చేయని భూములను ఈ పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అమలైతే రైతు భరోసా కింద కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ఆర్థికసాయం అందించే వీలుంటుందని ప్రభుత్వ అంచనా.

రైతుబీమాకు యథాతథం

గత బడ్జెట్‌లో కేటాయించినట్టే ప్రస్తుత పద్దులోనూ రైతుబీమా, వ్యవసాయ యాంత్రీకరణలకు రూ.1,500 కోట్ల చొప్పున కేటాయించారు. రైతుబీమా పథకాన్ని రైతులు, కౌలు రైతులకు అమలు చేయనున్నారు.

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీ

గత బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించారు. కానీ, ఈ పథకం పూర్తిగా అమలు కాలేదు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమని అంచనా వేసినా.. తాజా ఓటాన్‌ ఎకౌంట్‌లో నిధులు కేటాయించలేదు. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. రుణాలు సమీకరించి, అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. త్వరలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

కేంద్ర నిధులతో పంటల బీమా

రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రూ.2,500 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ, నిధులు కేటాయించలేదు. సొంతంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 


 

నూతన విత్తన విధానం

నాసిరకం, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నాణ్యమైన విత్తనోత్పత్తిలో పురోభివృద్ధి సాధించేందుకు నూతన విత్తన విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.10 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. దీనికి బోనస్‌ ఇవ్వాలంటే దానికి రూ.15 వేల కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు కేటాయించలేదు.
సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఇది మా ప్రభుత్వం’ అని ప్రజలు భావించేలా బాధ్యతతో వ్యవహరిస్తాం. గతంలో జరిగిన తప్పులు.. చేసిన అప్పులు.. మా లక్ష్యానికి ఏ మాత్రం అడ్డంకులు కావు.. కాలేవు.



అప్పుల భారం తప్పదు!

గతంలో తీసుకున్న అప్పులపై చెల్లించాల్సిన అసలు, వడ్డీలకు కిస్తీల ఆర్థికభారం పెరుగుతుండటంతో వచ్చే ఏడాది తీసుకోవాల్సిన రుణాల మొత్తాన్ని కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో తెలిపింది. వచ్చే ఏడాది (2024-25) సమకూరే మొత్తం రూ.2,74,186 కోట్లలో అప్పుల ద్వారా సేకరించే సొమ్ము రూ.68,585 కోట్లు (సుమారు 25 శాతం) ఉంటుందని వివరించింది. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పాతబాకీలకు తిరిగి చెల్లించాల్సింది రూ.39,753 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని తీసేస్తే మొత్తం రుణాలు రూ.68,585 కోట్లలో నికరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సొమ్ము రూ. 28,832 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థలు (కార్పొరేషన్లు) తీసుకుంటున్న రుణాలు అదనం. వీటిని రాష్ట్ర బడ్జెట్‌లో చూపడం లేదు.



రుణ పరిమితి పెరుగుతుందని..

పాత బాకీలకు తిరిగి చెల్లించాల్సిన సొమ్ము పెరుగుతున్నందున కొత్తగా తీసుకునే రుణాల పరిమితిని కూడా కేంద్రం పెంచుతుందని భావిస్తున్నామని, అందుకే రూ.68,585 కోట్లు అప్పుల ద్వారా సేకరించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ రుణాల్లో మార్కెట్ల నుంచి బాండ్ల వేలం ద్వారా నేరుగా సేకరించేవి రూ.59,625.21 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేవి రూ.3,900 కోట్లు, ఇతర రుణాలు మరో రూ.5,060 కోట్లు ఉంటాయని తెలిపింది. కేంద్రం నుంచి తీసుకునే రుణాలు రూ.4,102 కోట్లు ఉంటాయని గత బడ్జెట్‌లోనూ అంచనా వేయగా సవరించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది రూ.1,500 కోట్లే వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. మార్కెట్ల నుంచి నేరుగా సేకరించిన రుణాలు గత ఏడాది (2022-23) రూ.40,150 కోట్లుంటే.. వచ్చే ఏడాది రూ.రూ.59,625.21 కోట్లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 
కొత్తగా తీసుకునే రుణాలు పెరుగుతున్నట్లుగానే, గతంలో తీసుకున్న వాటికి చెల్లించాల్సిన కిస్తీల ఆర్థికభారం అధికంగా ఉంటున్నట్లు బడ్జెట్‌ గణాంకాలు
వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడి రూ.2.05 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో పాత బాకీలకు చెల్లించాల్సిన వడ్డీలు, అసలు కిస్తీల సొమ్ము రూ.39,753.18 (19.33 శాతం) ఉంటుంది.
 


ప్రత్యేక క్లస్టర్లు... డ్రైపోర్టులు!

రాష్ట్రంలో వడివడిగా పారిశ్రామికాభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లను ప్రతిపాదించింది. పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇటీవల దావోస్‌ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు వీలుగా క్లస్టర్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర నిధులతో పాటు పీఎం మిత్ర నిధులను కూడా వినియోగించుకొని వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను మరింతగా అభివృద్ధిచేయాలని కసరత్తు చేస్తోంది. సర్కారు తరఫున రెండు లెదర్‌ పార్క్‌లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో పొందుపర్చింది. తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేకపోవడం వల్ల సరకు రవాణాకు పోర్టులు అందుబాటులో లేవు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి డ్రైపోర్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం బృహత్‌ ప్రణాళికను రూపొందించింది. డ్రైపోర్టుల ఏర్పాటు ద్వారా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మన ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన మొత్తం పారిశ్రామిక నిధుల కేటాయింపుల్లో తొలి త్రైమాసానికి రూ.739.32 కోట్లను ప్రతిపాదించింది.



లక్ష్యం 4,16,500.. ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,740 కోట్లు

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందించాలనే నిర్ణయానికొచ్చింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,16,500 ఇళ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ కార్యాచరణలో భాగంగా ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు కేటాయించింది.

గత ప్రభుత్వం కన్నా రూ.రెండు లక్షలు అదనం

మునుపటి భారాస ప్రభుత్వం గృహలక్ష్మి పేరిట ఇంటి నిర్మాణ పథకాన్ని చేపట్టింది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్‌లో నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణానికి వీలుగా నిధులు కేటాయించింది. ఆ పథకం కార్యరూపంలోకి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలో ప్రకటించిన మేరకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.అయిదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకు తగినట్లు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


త్వరలో విధి విధానాలు...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. గతంలో రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్నింటిని కూడా  పరిశీలిస్తున్నారు. అవి సరిగా లేవని భావిస్తే నూతన విధివిధానాలు రూపొందిస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లబ్ధిదారుల ఎంపికపైనా ప్రభుత్వం త్వరలోనే విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. ‘‘ఆరు గ్యారంటీల అమలుకుసర్కారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 82 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. వాటి వడపోత ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తాం. ఏయే సామాజికవర్గాలకు ఎన్నెన్ని ఇళ్లు..ఏ ప్రాతిపదికన కేటాయించాలో ప్రభుత్వం ప్రకటించిన మీదట అమలు దిశగా ముందుకెళ్తాం’’ అని ఆ అధికారి వెల్లడించారు.
 

Posted Date: 14-02-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం