• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌



బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తాజాగా చేపట్టిన భారత పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ పర్యటన సాగింది. మన దేశం అనుసరిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం, యాక్ట్‌ ఈస్ట్‌ విధానం, సాగర్‌ పథకం, ఇండో-పసిఫిక్‌ విధానం వంటి అంశాల్లో ఢాకా సహకారం కీలకం.


బంగ్లాదేశ్‌ కొంతకాలంగా ఆర్థికంగా అనూహ్యమైన ప్రగతి సాధిస్తోంది. చేనేత, ఔషధ, వ్యవసాయ రంగాలతోపాటు ఇతర అంశాల్లో వాణిజ్యం ఇండియా, బంగ్లాకు లాభదాయకంగా ఉంటోంది. చెల్లింపుల విధానంలో కొంతమేరకు భారత కరెన్సీని అనుమతించాలని ఢాకా తీసుకున్న నిర్ణయం మన విదేశ మారక నిల్వలకు లబ్ధి కలిగించనుంది. గత ఏడాది బంగ్లాదేశ్‌లోని అఖౌరా-అగర్తలా రైల్వే మార్గాన్ని నిర్మించడంతో బంగ్లాదేశ్‌ నౌకాశ్రయాలైన చిట్టగాంగ్, మాంగ్లాలతో అనుసంధానం ఏర్పడింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలకు ఈ ఓడరేవుల నుంచి దిగుమతులు పెరుగుతాయి. తద్వారా రవాణా ఖర్చుల భారం తగ్గుతుంది. 


డ్రాగన్‌ పన్నాగాలు 

బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టేందుకు చైనా సుదీర్ఘకాలంగా యత్నిస్తోంది. భారత్‌లోని సిక్కిమ్‌లో జన్మించి అనంతరం బంగ్లాదేశ్‌లో ప్రవహించే తీస్తా నది ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేస్తానని బీజింగ్‌ గత డిసెంబరులో ముందుకు వచ్చింది. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే చికెన్‌ నెక్‌ కారిడార్‌కు అత్యంత చేరువగా తీస్తా నది ప్రవహిస్తోంది. మన దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ప్రాజెక్టు నెపంతో తిష్ట వేసేందుకు యత్నిస్తున్న డ్రాగన్‌ పన్నాగాలను భారత్‌ పసిగట్టింది. ఈ అంశాన్ని బంగ్లాదేశ్‌ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇండియా ఆందోళనలను గుర్తించిన ఢాకా, ఆ ప్రాజెక్టు నిర్మాణ పరిశీలన బాధ్యతలను భారత్‌కు అప్పగించేందుకు ముందుకు రావడం విశేషం. తీస్తా నదీ జలాల పంపిణీకి సంబంధించి 1983లో తాత్కాలిక ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు పక్షాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఫలవంతం కావడం లేదు. దీనిపై త్వరలోనే ఉభయ తారకమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. 


సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా వైద్యం కోసం భారత్‌కు వచ్చే బంగ్లా దేశీయులకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఏటా పెద్దసంఖ్యలో బంగ్లావాసులు చికిత్స నిమిత్తం భారత్‌కు వస్తుంటారు. 2023లో దాదాపు 16 లక్షల వీసాలు జారీచేయగా అందులో వైద్యం కోసం వచ్చిన వారు దాదాపు మూడు లక్షలమందిదాకా ఉంటారని అంచనా. బంగ్లాదేశ్‌లోని కీలక నగరమైన రంగ్‌పుర్‌లో భారత సహాయ కమిషనర్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దాంతో బంగ్లా దేశీయులు సత్వరమే ఈ-వీసాలు పొందే వీలుంటుంది. భారత్‌లో నిత్యావసరాల లభ్యత మిగుల నిల్వల ఆధారంగా బంగ్లాకు సరఫరా చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇరు దేశాల మధ్య పది రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. డిజిటల్, సముద్ర వాణిజ్యం, అంతరిక్షం, రైల్వే అనుసంధానం, హరిత సాంకేతికత, సముద్ర పరిశోధన, రక్షణ, వ్యూహాత్మక రంగాలకు సంబంధించి ఏడు కొత్త ఒప్పందాలు చేసుకొన్నారు. వాటితో పాటు ఆరోగ్యం, ఔషధ రంగాలు, విపత్తు ప్రతిస్పందన నిర్వహణ, మత్స్యసంపదలకు సంబంధించి మరో మూడు కొత్త ఒప్పందాలపైనా ఉభయ దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. గంగా నదీ జలాలపై ఒప్పంద గడువు 2026లో ముగియనుంది. ఈ నదీజలాల పంపకంపై త్వరలోనే చర్చలు ప్రారంభం కానున్నాయి. సరిహద్దుల అంశానికి వస్తే, గతంలో ఈశాన్య భారతానికి సంబంధించి పలు వేర్పాటువాద బృందాలు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేవి. హసీనా రాకతో వాటిని కట్టడి చేశారు. 


రక్షణ ఒప్పందాలు

డిజిటల్‌ రంగంలో ఎంతో ముందున్న భారత్‌ చేయూతతో బంగ్లాదేశ్‌లో డిజిటల్‌ రంగం కొత్తపుంతలు తొక్కే అవకాశముంది. బంగ్లాలో డిజిటల్‌ విస్తరణ భారత ఐటీ కంపెనీల మార్కెట్‌ విస్తృతికి దోహద పడే అంశమే. బంగాళాఖాతంలో ప్రవేశించేందుకు డ్రాగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో చైనా సైన్యం రాకుండా నిలువరించేందుకు బంగ్లాదేశ్‌తో రక్షణ ఒప్పందాలు ఉపయోగపడనున్నాయి. కొంతకాలం క్రితం చైనా నుంచి రెండు జలాంతర్గాములను బంగ్లాదేశ్‌ కొనుగోలు చేసింది. బీజింగ్‌కు ఢాకా చేరువకావడం భారత్‌ను కలవరపరచే అంశమే. బంగ్లాదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి భారత్‌ చేయూత కీలకమన్న సంగతిని గ్రహించిన హసీనా- స్వదేశంలో అతివాదుల అభ్యంతరాలను పక్కనబెట్టి దిల్లీతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిపాదిత ఇండో-పసిఫిక్‌ ఓషన్‌ ఇనిషియేటివ్‌లో చేరాలన్న బంగ్లా నిర్ణయాన్ని భారత్‌ స్వాగతించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి ఉత్పాతాల సమయంలో ఉభయులు పరస్పరం సహకరించుకోనున్నారు.


- కె.శ్రీధర్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్విస్‌ శాంతి సదస్సులో తటస్థ భారత్‌

‣ దక్షిణాఫ్రికాలో గాలి మార్పు

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

‣ జీ7లో భారత్‌ చేరుతుందా?

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

Posted Date: 26-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం