• facebook
  • whatsapp
  • telegram

పశ్చిమాసియాలో శాంతి విలసిల్లేనా?

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొన్ని రోజులుగా కొనసాగిన ఘర్షణలు, కాల్పుల విరమణ ఒప్పందంతో ఆగిపోవడం శాంతి స్థాపన దిశగా ఓ ముందడుగేనని చెప్పాలి. ఒప్పంద నిబంధనలపై అంత స్పష్టత రాకపోయినా, తాజా పరిణామం మాత్రం సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించిన అన్ని దేశాలు, వర్గాలకు శుభవార్తే. జెరూసలెంలోని పాలస్తీనియన్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో తాము సఫలమైనట్లు గాజాలోని హమాస్‌ వర్గాలు అంటుంటే; తామే సైనిక, రాజకీయ విజయం సాధించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించుకోవడం గమనార్హం. గాజాను ఇజ్రాయెల్‌ 2014లో దిగ్బంధించిన అనంతరం అక్కడ తీవ్రమైన పరిస్థితులు తలెత్తాయి. ఇజ్రాయెల్‌ రాకెట్‌ దాడులు గాజా ఆర్థిక వ్యవస్థను మరింత కునారిల్లేలా చేశాయి. తిరిగి గాడిన పడాలంటే రానున్న కొన్నేళ్లలో భారీయెత్తున విదేశీసాయం అవసరం అవుతుంది.

చొరవ చూపని అగ్రరాజ్యం

సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంఘర్షణను రూపుమాపి శాంతిని పునరుద్ధరించాలనే కోరిక ఇజ్రాయెల్‌ నేతల్లో గానీ, వారి స్థిరమైన మిత్రుల్లో కానీ ఎప్పుడూ కనిపించలేదు. 1990లలో బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి శాంతి స్థాపన ప్రక్రియకు గండి పడుతూ వస్తోంది. జో బైడెన్‌ సైతం గత అధ్యక్షుల బాటలోనే నడుస్తున్నారు.చైనా, రష్యాలను దూరంగా ఉంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ వివాదంలో ఐరాస భద్రతా మండలిగానీ, ఇతరులు గానీ కలగజేసుకోకుండా చూడటమే తన లక్ష్యమన్నట్లు వ్యవహరిస్తోంది. డ్రాగన్‌కు, రష్యాకు మండలిలో సభ్యత్వం ఉండటంతో ఆ దేశాలకు శాంతిని నెలకొల్పే అవకాశం దక్కనివ్వకూడదనే ధోరణిని అమెరికా కనబరుస్తోంది. చైనా, రష్యాలతో పోలిస్తే అమెరికాకు పశ్చిమాసియాలో ఉన్న పట్టు శక్తిమంతమైనది. రాజకీయంగా, ఆర్థికంగా, సైనికశక్తి పరంగా దీర్ఘకాలిక కార్యకలాపాల దృష్ట్యా అక్కడి దేశాలతో అమెరికాకు ఉన్న సంబంధాలూ దృఢమైనవే. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో అగ్రరాజ్యం ప్రాబల్యం తగ్గుతున్నా, ఇప్పటికీ పై చేయి దానిదే. కాబట్టి, అక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సామర్థ్యం అమెరికాకే ఉంది. అయినా ప్రతిష్టంభనను కొనసాగించేలా వ్యవహరిస్తున్న బైడెన్‌ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. కాల్పుల విరమణ పాటించాలని అమెరికా అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తిని నెతన్యాహు బహిరంగంగా వ్యతిరేకించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం.  

గాజాలో హింసాకాండ మొదలు కావడానికి ముందే జెరూసలెం సహా పశ్చిమతీరమంతటా ఘర్షణలు చెలరేగాయి. తాజా కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య మాత్రమే జరిగింది. తూర్పు జెరూసలెం సమీపంలోని షేక్‌ జరా నుంచి పాలస్తీనా ప్రజలను ఖాళీ చేయించే విషయంపై త్వరలో ఇజ్రాయెల్‌ సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. సున్నితమైన ఈ అంశంపై తీర్పు వెలువడిన తరవాత మళ్లీ సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచిఉంది. హమాస్‌ను అమెరికా ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించినప్పటికీ, ఆ సంస్థ సభ్యులను పాలస్తీనా ప్రజలు  పోరాటయోధులుగానే పరిగణిస్తారు. పాలస్తీనాలో 2006లో చివరిసారి జరిగిన   ఎన్నికల్లో హమాస్‌ సునాయాస విజయం సాధించింది. ఈ నెల చివర్లో జరపాలనుకున్న ఎన్నికల్లో సైతం విజయం హమస్‌నే వరిస్తుందని విశ్లేషణలు వెల్లడించాయి. అయితే ఆ ఎన్నికలను పాలస్తీనా అధ్యక్షుడు రద్దు చేశారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణలు కొనసాగుతున్న వేళలోనూ జాతీయ ఎన్నికలకోసం హమాస్‌ సన్నద్ధమైంది.

నివురుగప్పిన నిప్పులా...

ఓస్లో ఒప్పందం ప్రకారం పాలస్తీనా అధీనంలోని భూభాగాల్లో భద్రతపరమైన చర్యలు తీసుకునే అధికారం పాలస్తీనా యంత్రాంగానికి ఉంది. అయితే, ప్రస్తుతం వెస్ట్‌ బ్యాంక్‌లోని అతికొద్ది ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా నియంత్రణలో ఉన్నాయి. దానివల్ల పాలస్తీనా ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. అబ్బాస్‌ సర్కారు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినట్లు వారు భావిస్తున్నారు. నెతన్యాహు పాటించే యూదు జాతీయవాద స్వభావం తమ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ చెలరేగుతున్న ఘర్షణలు పాలస్తీనియన్లు, యూదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌ గత ప్రధాని ఇజ్జాక్‌ రాబిన్‌, పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌ యాసర్‌ అరాఫత్‌ మధ్య 1990లలో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు- ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రజల వైఖరిలో ఎంతో సానుకూల మార్పు కనిపించింది. కానీ, తరవాతి పరిణామాలు సామరస్యాన్ని ఎండమావి చేశాయి. 2014 యుద్ధం తరవాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఏడేళ్లపాటు అమలయింది. ఈ ఏడేళ్ల కాలంలో ఘర్షణ వాతావరణాన్ని పూర్తిగా నివారించే దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు. శాంతిస్థాపన విషయంలో ఇప్పుడున్న అనాసక్తత కొనసాగితే మళ్ళీ హింస చెలరేగడానికి ఎంతో కాలం పట్టదు!

- ఆంథొనీ బిల్లింగ్‌స్లే

(రచయిత- న్యూసౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ లెక్చరర్‌)

Posted Date: 27-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం